దేశ రాజధాని నగరం ఢిల్లీలో జరిగిన దారుణ ఘటన ఆలస్యం వెలుగులోకి వచ్చింది. ఆరేళ్ల బాలికపై 15 ఏళ్ల లోపు ముగ్గురు బాలురు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఆ ముగ్గురూ గత ఏడాది చనిపోయిన బాలిక సోదరుడికి స్నేహతులే. ఈశాన్య ఢిల్లీలోని భజన్‌పురాలో జనవరి 18న ముగ్గురు బాలురు ఆరేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం చేశారని పోలీసులు మంగళవారం తెలిపారు. నిందితుల వయస్సు 10, 13 , 14 సంవత్సరాలు. వీరిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే మూడో నిందితుడు, అతని కుటుంబం పరారీలో ఉంది.
ఏం జరిగిందంటే..
బాధితురాలి తల్లి అందించిన వివరాల ప్రకారం జనవరి 18న సాయంత్రం 7 గంటల ప్రాంతంలో బాలిక తీవ్ర రక్తస్రావంతో ఇంటికి తిరిగి వచ్చింది. మొదట తాను కింద పడిపోయానని చెప్పింది. పక్కింటి 13 ఏళ్ల అబ్బాయి కూడా అదే కథ చెప్పాడు. అయితే బాలిక అపస్మారక స్థితిలోకి జారుకుంది. ఆమె తట్టి లేపిన తల్లి గట్టిగా నిలదీయడంతో అసలు విషయం చెప్పింది. 13 ఏళ్ల పక్కింటి అబ్బాయి, మరో ఇద్దరు బాలురు ఆహారం ఇస్తామని ఆశ చూపి తనను తీసుకెళ్లారు. ఆ అబ్బాయిలు అక్కడే ఆమెను పట్టుకుని చావ్మిన్ ఇస్తామని చెప్పారు. ఆ తరువాత సమీపంలోని ఖాళీగా ఉన్న రెండు అంతస్తుల భవనంలోకి తీసుకెళ్లి, ఆమె చేతులు కట్టి, నోటికి గుడ్డ కట్టి అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో వారు వెంటనే జాఫరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాలికకు జగ్ ప్రవేశ్ చంద్ర ఆసుపత్రిలో చికిత్స అందించారు. అక్కడ వైద్య నివేదికలో ఆమె నడవలేకపోతోందని,తీవ్ర రక్తస్రావం అవుతోందని పేర్కొన్నారు. హెచ్‌ఐవి, ఇతర వ్యాధుల కోసం పరీక్షలు చేయించుకోవాలని కూడా వైద్యులు సూచించారు.
ఇదీ చదవండి: 78 ఏళ్లకు లవ్ ప్రపోజల్..39 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి!
విచారణ సమయంలో బాలిక కూడా ఈ వివరాలను పంచుకుందని ధృవీకరించారు. అలాగే ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని ఆమెను బెదిరించినట్లు పోలీసు అధికారి తెలిపారు. నిందితులను జనవరి 19న అదుపులోకి తీసుకుని బాలల సంక్షేమ కమిటీ ముందు హాజరుపరిచినట్టు చెప్పారు. ప్రస్తుతం బాధిత బాలిక నిలకడగా ఉందని, ఇంట్లోనే కోలుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: షాకింగ్ న్యూస్ : అమెజాన్‌లో వేలాది మంది ఉద్యోగులపై వేటు
ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆగ్రహాన్ని కూడా రేకెత్తించింది. నిందితులు సమీపంలోని ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ముగ్గురు ముస్లిం అబ్బాయిలు కావడంతో హిందూ కార్యకర్తలు న్యాయం కోరుతూ రహదారిని దిగ్బంధించారు. సోమవారం, హిందూ మితవాద సంఘాలు మూడవ నిందితుడిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఒక రహదారిని దిగ్బంధించి నిరసన తెలిపాయి. దీంతో పోలీసులు కేసును భజన్‌పురా పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. దర్యాప్తు అధికారులు ఆ భవనాన్ని సందర్శించి,ఫోరెన్సిక్ ఆధారాలను సేకరించి దర్యాప్తు ముమ్మరం చేశారు.
నడవలేక నరకయాతన పడుతోంది : బాధితురాలి తల్లి
బాలిక ప్రస్తుతం మంచానికే పరిమితమైంది. నడిచినా లేదా ఆడినా రక్తస్రావంతో, నొప్పితో ఇబ్బందిపడుతోందని తల్లి వాపోతోంది. ఆ బాలిక తండ్రి, రిక్షా కార్మికుడు, నిందితులను వయోజనులుగా పరిగణించి విచారించాలని డిమాండ్ చేశాడు. వారికి కఠినమై శిక్షపడాలని డిమాండ్ చేశాడు. తన బిడ్డను అలా చూసి కుమార్తెల భద్రతపై భయంతో తాను ఇంకా పనికి తిరిగి వెళ్లలేదని ఆ తండ్రి చెప్పాడు.
ఇదీ చదవండి: Ajit Pawar jet crash : హాట్ టాపిక్‌గా ఆ ఇద్దరు పైలట్లు


