వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు లేదా జ్ఞాపకశక్తిని కోల్పోవడంతో సమస్యలు జఠిలంగానే ఉంటాయి. ముఖ్యంగా అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న పెద్దవాళ్లున్న కుటుంబాలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వ్యాధికా కారణాలు ఏమైనప్పటికీ తమ ఇంటిని, ఇంట్లోని వారిని మర్చిపోతూ ఉంటారు. మరికొంతమంది తమ జీవిత భాగస్వామిని కూడా గుర్తు పట్టలేని స్థితిలో ఉంటారు. అలా అల్జీమర్స్ బాధపడుతున్న 77 ఏళ్ల మైఖేల్ ఓ'రైలీ లవ్ స్టోరీ నెట్టింట సందడిగా మారింది.
సుమారు ఏడేళ్ల క్రింత ఓ'రైలీకి అల్జీమర్స్ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ కష్టకాలంలో అతనికి అండగా నిలబడి, అతని బార్య ఫెల్డ్‌మాన్ దగ్గరుండి భర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటోంది. మైఖేల్ గడపదాటితే దారి మర్చిపోయేవాడు. చివరికి నిరంతరం తనకు సేవలందిస్తున్న భార్యను కూడా మర్చిపోయాడు. దీంతో ఓ'రైలీ 'ది ఐవీ' అనే సంరక్షణ కేంద్రంలో చేరాడు. ఫెల్డ్‌మాన్ తన భార్య అని మర్చిపోయాడు. కానీ విచిత్రంగా 39 ఏళ్ల తరువాత ఆమెతో మళ్లీ ప్రేమలో పడిపోయాడు. నన్ను పెళ్లి చేసుకుంటావా అని లిండా ఫెల్డ్‌మన్‌ను ధైర్యంగా అడిగేశాడు. దీంతో ఆమె మారు మాట్లాడకుండానే ఓకే చెప్పేసింది.
అక్కడి సిబ్బందికి మైఖేల్ లవ్ ప్రపోజల్ గురించి తెలిసింది. ఈ ప్రేమ జంటకు మళ్లీ పెళ్లి చేయాలనే ఆలోచన పుట్టింది. జనవరి 10న, హోం సంరక్షకులు, స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఒక ఆత్మీయ వేడుకలో, ది ఐవీఎట్ బర్కిలీలో వారిద్దరూ మరోసారి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇలాంటి ప్రేమ కథలే హృదయాలను మురిపిస్తాయి. నిజమైన ప్రేమ శాశ్వతం అనే నమ్మకాన్ని పుట్టిస్తాయి.
వీరి ప్రేమ కథ
న్యాయవాద వృత్తిలో ఉన్న ఇద్దరూ అలమెడ కౌంటీలో పబ్లిక్ డిఫెండర్లుగా పనిచేసేవారు. మంచి అటార్నీ వాదనలు చూడాలంటే, కచ్చితంగా మైఖేల్‌ను చూడాల్సిందే అన్న స్నేహితుల మాటలకు ప్రభావితమై అతణ్ణి కలిసింది. అద్భుతమైన లాయర్ అనుకొంది. అంతే అప్పటినుంచి మైఖేల్ ఫెల్డ్‌మన్‌కు గురువుగా మారాడు. అలా వీరి పరిచయం 1979 నాటికి గాఢమైన స్నేహంగా మారింది. అప్పటికి ఇద్దరికి వివాహాలు అయ్యాయి. ఓ'రైలీకి మొదటి వివాహం ద్వారా ఇద్దరు కుమార్తెలు, ఫెల్డ్‌మాన్‌కు ఒక కుమారుడు ఉన్నాడు. కొన్ని ఏళ్ల తర్వాత వారిద్దరూ తమ భాగస్వాముల నుండి విడాకులు తీసుకున్నారు.
ఫెల్డ్‌మన్‌కు ఫోరెన్సిక్ పాథాలజీపై ఆసక్తి ఉందని గమనించ ఆ కోణంలో ఒక అవకాశాన్నిచ్చిన ఓ'రైలీ ఫెల్డ్‌మన్‌ను డేట్‌కు రమ్మని అడిగాడు. ఫెల్డ్‌మన్ తొలుత సంశయించినప్పటికీ, చివరికి ఒప్పుకుంది. అలా వారిద్దరూ శవపరీక్ష చూడటానికి వెళ్లి, ఆ తర్వాత డిన్నర్ డేట్‌కు వెళ్లారు. అక్కడ పరస్పరం చర్చించు కుని తమ పిల్లలతో కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. అయితే వారి ప్రయాణం అంతా సాఫీగా సాగలేదు, వారి పిల్లలు వారి ప్రేమను అర్థం చేసు కోవడానికి ఇబ్బంది పడ్డారు. మొత్తానికి 1987లో తమ నివాసంలోని గదిలోనే ఎలాంటి హంగూ ఆర్బాటం లేకుండా వివాహం చేసుకున్నారు.
తాను ఒక నాడీ సంబంధిత సమస్యలున్న చిన్న యూదు అమ్మాయినని, భర్త ఒక ఐరిష్ కాథలిక్ సాహస ప్రియుడని చెప్పింది. నాకు థియేటర్, ఆయనకు మ్యూజియంలంటే చాలా ఇష్టం అని గుర్తు చేసుకుంది ఫెల్డ్‌మన్‌కు. తనకు రివర్ రాఫ్టింగ్ వంటివి పరిచయం చేసింది తన భర్తేనని చెప్పింది. ఇద్దరికీ విభిన్న దిశలు అయినా కలిసి విస్తృతంగా ప్రయాణించారు. దేని గురించైనా మాట్లాడు కోవడం, ఒకర్ని మరొకరు గౌరవించుకునే లక్షణమే వారి బంధాన్ని సజీవంగా ఉంచిందనడంలో సందేహం లేదు.
మరోవైపు ఫెల్డ్‌మాన్ తన భర్త గురించి మాట్లాడుతూ అల్జీమర్స్‌తో బాధపడుతున్న చాలామంది తమ జీవిత భాగస్వామిని కూడా గుర్తించలేరు. కానీఇపుడు తాను చాలా అదృష్టవంతురాలినని, ఎందుకుంటే తన భర్త అంతులేని ప్రేమతో ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని ముద్దుపెట్టి, 'ఐ లవ్ యూ' అని చెబుతాడు అంటూ తెగ మురిసిపోయింది.


