జైసల్మీర్: నేడు ఏకీకృత న్యాయవిధానం అవసరం ఎంతో ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న కోర్టుల్లో ప్రమాణాలు, విధానాలను ఏకీకృతం చేసేందుకు ఆధునిక సాంకేతికత ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. దీనివల్ల పౌరులు దేశంలో ఎక్కడ ఉన్నా నిరంతరంగా సమాచారాన్ని తెలుసుకునేందుకు అవకాశమేర్పడుతుందని తెలిపారు.
సమాఖ్య విధానం కారణంగా హైకోర్టులకు వేటికవి సొంత విధానాలు, సాంకేతికపరమైన సామర్థ్యాలను కలిగి ఉన్నాయంటూ ఆయన..ఇటువంటి అవరోధాలను సాంకేతిక సాయంతో, ఏకీకృత న్యాయ విధానంతో తొలగించుకోవచ్చని సీజేఐ చెప్పారు. జైసల్మీర్‌లో శనివారం జరిగిన వెస్ట్ జోన్ రీజినల్ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ న్యాయవ్యవస్థ (నేషనల్ జ్యుడీషియల్ ఈకోసిస్టమ్) అవసరాన్ని గురించి నొక్కి చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని దేశ న్యాయ వ్యవస్థను సమూలంగా సంస్కరించాలని పిలుపునిచ్చారు.


