గ్లోబల్ ఏరోస్పేస్ దిగ్గజం జీఈ ఏరోస్పేస్ (GE Aerospace) తన పుణె తయారీ కేంద్రాన్ని విస్తరించడానికి తాజాగా 14 మిలియన్ డాలర్ల (సుమారు రూ.120 కోట్లు) పెట్టుబడిని ప్రకటించింది. కంపెనీ పదో వార్షికోత్సవం సందర్భంగా ఈ ప్రకటన వెలువడడం గమనార్హం. ఇప్పటికే గతేడాది ప్రకటించిన 30 మిలియన్ డాలర్ల పెట్టుబడికి ఇది అదనం.
ఈ తాజా పెట్టుబడి ప్రధానంగా అప్‌గ్రేడ్ చేసిన తయారీ ప్రక్రియలు, ఆటోమేషన్ కోసం ఎంతో ఉపయోగపడుతుందని అధికారులు చెప్పారు. గ్లోబల్ కమర్షియల్ జెట్ ఇంజిన్ ప్రోగ్రామ్‌ల కోసం మరింత అధునాతన ఇంజిన్ భాగాలను ఉత్పత్తి చేసే కేంద్రాన్ని సైతం అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. కార్యకలాపాలు విస్తరించడం ద్వారా ఉత్పత్తిని క్రమబద్ధీకరించడం, సామర్థ్యాన్ని మెరుగుపరచడం, భద్రత, నాణ్యత విషయంలో పుణె కేంద్రాన్ని మరింత బలోపేతం చేయాలని కంపెనీ భావిస్తోంది.
ఈ సందర్భంగా జీఈ ఏరోస్పేస్ పుణె ఫెసిలిటీ మేనేజింగ్ డైరెక్టర్ విశ్వజిత్ సింగ్ మాట్లాడుతూ..‘కంపెనీ కార్యకలాపాల విస్తరణ మేక్ ఇన్ ఇండియా చొరవ పట్ల సంస్థ నిబద్ధతను, ప్రపంచ ఏరోస్పేస్ తయారీలో భారతదేశ పాత్రను ముందుకు తీసుకెళ్లడానికి ఎంతో ఉపయోగపడుతుంది’ అని అన్నారు. 2015లో మల్టీ-బిజినెస్ మాన్యుఫ్యాక్చరింగ్ సైట్‌గా పుణెలో కంపెనీ యూనిట్‌ను స్థాపించింది. దేశవ్యాప్తంగా 2,200 మంది సప్లయర్ల నెట్‌వర్క్‌ను సంపాదించింది. ఏరోస్పేస్ విడిభాగాల తయారీలో 5,000 మందికి పైగా ప్రొడక్షన్ అసోసియేట్‌లకు శిక్షణ ఇచ్చింది. పుణె యూనిట్ ఫ్లైట్ డెక్ (Flight Deck) అనే ఏరోస్పేస్ ప్రొప్రియారిటీ లీన్ ఆపరేటింగ్ మోడల్ ద్వారా నడుస్తుంది. ఇది భద్రత, నాణ్యత, ఉత్పత్తుల సామర్థ్యాన్ని హైలైట్ చేసే మోడల్ అని కంపెనీ తెలిపింది.
ఇదీ చదవండి: రైల్వేకు ఐఆర్‌సీటీసీ కాసుల వర్షం.. ఎలాగంటే..


