భారతదేశంలో ప్రతిరోజూ లక్షలాది మంది ప్రజలను రైల్వే తమ గమ్యస్థానాలకు చేరవేస్తోంది. అయితే, ఈ అతిపెద్ద రైల్వే వ్యవస్థకు ఆర్థికంగా వెన్నెముకగా నిలుస్తున్న సంస్థ ఐఆర్‌సీటీసీ (ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్). కేవలం టిక్కెట్ల అమ్మకాలతోనే కాకుండా, మరెన్నో వినూత్న మార్గాల్లో భారతీయ రైల్వేకు లాభాల పంట పండిస్తున్న ఐఆర్‌సీటీసీ వ్యాపార నమూనాను ఏంటో తెలుసుకుందాం.
ఆన్‌లైన్ టిక్కెటింగ్
ఐఆర్‌సీటీసీకి ప్రధాన ఆదాయ వనరుల్లో ఒకటి రైల్వే టిక్కెట్ బుకింగ్. ఆన్‌లైన్‌లో టిక్కెట్ బుక్ చేసినప్పుడు ప్రయాణికుల నుంచి నామమాత్రపు సర్వీస్ ఛార్జ్‌ను వసూలు చేస్తుంది (ఉదాహరణకు, నాన్-ఏసీ టిక్కెట్లపై రూ.15, ఏసీ టిక్కెట్లపై రూ.30). పేమెంట్ గేట్‌వేలను ఉపయోగించినందుకు వసూలు చేసే కన్వీనియన్స్ ఫీజు కూడా ఆదాయంగా మారుతుంది. అత్యవసర బుకింగ్ అయిన తత్కాల్ ద్వారా కూడా ఐఆర్‌సీటీసీ మంచి మొత్తాన్ని ఆర్జిస్తుంది.
క్యాటరింగ్ సేవలు
రైల్వే స్టేషన్లు, రైళ్లలో ఆహార సరఫరా, క్యాటరింగ్ సేవల నిర్వహణను ఐఆర్‌సీటీసీ పర్యవేక్షిస్తుంది. ఈ విభాగం ఆదాయంలో ముఖ్యమైన వాటాను కలిగి ఉంది. ప్రీమియం రైళ్లు (రాజధాని, శతాబ్ది వంటివి), ఇతర ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు. అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఆహారాన్ని తయారుచేయడానికి దేశవ్యాప్తంగా ఐఆర్‌సీటీసీ ఆధునిక బేస్ కిచెన్‌లను నిర్వహిస్తోంది. రైల్వే స్టేషన్లలో ఫుడ్ ప్లాజాలు, స్టాళ్లను నిర్వహించడం ద్వారా లేదా వాటిని ప్రైవేట్ సంస్థలకు లీజుకి ఇవ్వడం ద్వారా కూడా ఆదాయం లభిస్తుంది.
టూరిజం సేవలు
భారతదేశ వారసత్వం, ఆధ్యాత్మిక ప్రదేశాలను ప్రజలకు పరిచయం చేస్తూ ఐఆర్‌సీటీసీ టూరిజం సేవలను అందిస్తుంది. ‘భారత్ గౌరవ్’ వంటి ప్రత్యేక టూరిజం రైళ్లను నడుపుతోంది. దేశీయ, అంతర్జాతీయ విమాన, బస్సు టూర్ ప్యాకేజీలను అందించి లాభాలను ఆర్జిస్తోంది. రైల్వే స్టేషన్లలో ఉన్న విశ్రాంతి గృహాలు, హోటళ్లను లీజుకిచ్చి వాటి నిర్వహణ ద్వారా ఆదాయం సమకూర్చుకుంటోంది.
రైల్ నీర్
రైళ్లలో, రైల్వే స్టేషన్లలో ప్యాకేజ్డ్ తాగునీరు అవసరం చాలా ఎక్కువ. ఐఆర్‌సీటీసీ సొంత బ్రాండ్‌గా ‘రైల్ నీర్’ను తయారుచేసి విక్రయిస్తుంది. రైల్వే ఆవరణలో రైల్ నీర్‌కు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఈ విభాగం నుంచి స్థిరమైన, గణనీయమైన ఆదాయం లభిస్తుంది. ప్రైవేట్ బ్రాండ్స్ కంటే తక్కువ ధరకు నీటిని అందించడం ద్వారా సంస్థకు లాభం వస్తుంది.
ఇతర మార్గాలు
పై నాలుగు ప్రధాన మార్గాలు కాకుండా ఐఆర్‌సీటీసీకి మరికొన్ని అనుబంధ ఆదాయ వనరులు ఉన్నాయి. రైల్వే టిక్కెట్ల వెనుక, వెబ్‌సైట్‌లో, ఈ-టికెట్‌పై, రైళ్ల అంతటా ప్రకటనలకు అనుమతి ఇవ్వడం ద్వారా ఆదాయం సంపాదిస్తుంది. పార్శిల్ సేవలు, లాజిస్టిక్స్ సేవలను అందిస్తోంది. వివిధ ఆన్‌లైన్ లావాదేవీల ద్వారా లభించే పేమెంట్ గేట్‌వే కమీషన్ ఆదాయం ఉంది.
భారతీయ రైల్వేకు ఐఆర్‌సీటీసీ కీలకం
రైల్వే శాఖకు ఐఆర్‌సీటీసీ ఒక స్థిరమైన ఆదాయ మార్గాన్ని అందిస్తుంది. ఏటా డివిడెండ్ రూపంలో భారతీయ రైల్వేకు పెద్ద మొత్తంలో నిధులను సమకూరుస్తుంది. ఐఆర్‌సీటీసీ ద్వారా వచ్చే లాభాలను భారతీయ రైల్వే ట్రాక్‌ల ఆధునీకరణ, కొత్త రైళ్ల కొనుగోలు, మౌలిక వసతుల కల్పనకు ఉపయోగిస్తుంది.
ఇదీ చదవండి: డ్రైవర్ జీతం రూ.53,350.. త్వరలో రూ.1 లక్ష!


