న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణికులకు గమనిక. నేటి నుంచి పెరిగిన కొత్త ట్రైన్ టికెట్ ధరలు అమల్లోకి వచ్చాయి. రైల్వే శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ఆధారంగా.. సాధారణ తరగతి ప్రయాణికులకు 215 కి.మీ. దూరం వరకు ఎలాంటి పెంపు ఉండదు. అయితే 216 కి.మీ (కిలోమీటర్) దూరం దాటిన తర్వాత ప్రతి కిలోమీటర్‌కు ఒక పైసా అదనంగా వసూలు చేస్తోంది.
రైల్వే అధికారులు మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లు, అన్ని ఏసీ తరగతులలో ప్రతి కిలోమీటర్‌కు రెండు పైసలు పెంపు అమలు చేశారు. ఈ పెంపుతో ఈ ఏడాదిలో రెండో సారి ట్రైన్ టికెట్ ధరలను పెంచినట్లైంది. తొలిసారి ఈ ఏడాది జులైలో రైల్వే టికెట్ ధరలు పెంచిన విషయం తెలిసిందే.
సవరించిన ధరల ప్రకారం, సబర్బన్ సేవలు, సీజన్ టికెట్లకు ఎలాంటి మార్పులు లేవు. సాధారణ నాన్-ఏసీ (నాన్-సబర్బన్) సేవల్లో రెండో తరగతి, స్లీపర్ క్లాస్, ఫస్ట్ క్లాస్ టికెట్లలో ధరలు దశలవారీగా పెంచింది. సెకండ్ క్లాస్ సాధారణ టికెట్లలో 215 కి.మీ. వరకు ఎలాంటి పెంపు లేదు. 216 కి.మీ. నుండి 750 కి.మీ. వరకు ప్రయాణానికి రూ.5 పెంపు ఉంటుంది. 751–1250 కి.మీ. మధ్య ప్రయాణానికి రూ.10, 1251–1750 కి.మీ. మధ్య ప్రయాణానికి రూ.15, 1751–2250 కి.మీ. మధ్య ప్రయాణానికి రూ.20 పెంపు అమలు చేసింది.
స్లీపర్ క్లాస్, ఫస్ట్ క్లాస్ సాధారణ టికెట్లలో ప్రతి కి.మీ.కు 1 పైసా చెల్లించాల్సి ఉంది. ఇది నాన్-సబర్బన్ ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది. మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లలో నాన్-ఏసీ, ఏసీ తరగతులన్నింటిలో ప్రతి కి.మీ.కు 2 పైసా పెంపు ఉంది. ఉదాహరణకు, 500 కి.మీ. ప్రయాణం చేసే ప్రయాణికుడు నాన్-ఏసీ మెయిల్/ఎక్స్‌ప్రెస్ కోచ్‌లో సుమారు రూ.10 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
అధికారిక నోటిఫికేషన్ ప్రకారం.. రాజధాని, శతాబ్దీ, దురంతో, వందే భారత్, హంసఫర్, అమృత భారత్, మహామనా, గతిమాన్, అంత్యోదయ, గరీబ్ రథ్, జన శతాబ్దీ, యువ ఎక్స్‌ప్రెస్, నమో భారత్ రాపిడ్ రైల్ వంటి ప్రధాన రైళ్లలో కూడా ఈ పెంపు వర్తిస్తుంది. ఏసీ ఎంఈఎంయూ/డీఈఎంయూ సేవలు మాత్రం మినహాయింపు పొందాయి. సవరించిన ధరలు డిసెంబర్ 26, 2025 నుండి బుక్ చేసిన టికెట్లకు మాత్రమే వర్తిస్తాయి. ఆ తేదీకి ముందు బుక్ చేసిన టికెట్లకు అదనపు ఛార్జీలు ఉండవు


