భారతీయ రైల్వే చరిత్రలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ప్రయాణికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న దేశంలోనే తొలి వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ ఈ నెలలోనే పట్టాలెక్కనుంది. పశ్చిమ బెంగాల్‌లోని హౌరా, అస్సాంలోని గువాహతి (కామాఖ్య) మధ్య ఈ రైలు తన ప్రయాణాన్ని ప్రారంభించనుంది. దీనికి సంబంధించిన టికెట్ ధరలు, రిజర్వేషన్ నిబంధనలను రైల్వే బోర్డు అధికారికంగా వెల్లడించింది.
జనవరి 17న ప్రారంభం
రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఈ రైలుకు సంబంధించిన ట్రయల్ రన్, టెస్టింగ్, భద్రతా సర్టిఫికేషన్ ప్రక్రియలు విజయవంతంగా పూర్తయ్యాయి. జనవరి 17, 2026న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు. సాధారణ ప్రయాణికులకు జనవరి 18 నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
వందే భారత్ స్లీపర్ రైలులో ప్రయాణికులకు అత్యుత్తమ అనుభూతిని అందించేందుకు రైల్వే బోర్డు విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ రైలులో కేవలం ‘కన్ఫర్మ్’ అయిన టిక్కెట్లు మాత్రమే జారీ చేస్తారు. సాధారణ రైళ్లలో ఉండే ఆర్‌ఏసీ లేదా వెయిటింగ్ లిస్ట్ ఇందులో ఉండదు. అంటే, రైలు చార్ట్ సిద్ధమైన తర్వాత సీటు కేటాయించబడని వారికి ప్రయాణించే అవకాశం ఉండదు. అడ్వాన్స్ రిజర్వేషన్ కాలపరిమితి (ARP) మొదటి రోజు నుంచే అన్ని బెర్తులు బుకింగ్ కోసం అందుబాటులో ఉంటాయి.
టికెట్ ధరలు, కనీస ఛార్జీ
రైల్వే బోర్డు ఇటీవల ప్రకటించిన సర్క్యులర్ ప్రకారం, వందే భారత్ స్లీపర్ ఛార్జీలు కిలోమీటరు ప్రాతిపదికన నిర్ణయించారు.
కనీస ఛార్జీ: ప్రయాణికులు కనీసం 400 కిలోమీటర్ల దూరానికి ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది.
3 ఏసీ కిలోమీటరుకు రూ.2.4 (కనీస ధర రూ.960)
2 ఏసీ: కిలోమీటరుకు రూ.3.1 (కనీస ధర రూ.1,240)
1 ఏసీ: కిలోమీటరుకు రూ.3.8 (కనీస ధర రూ.1,520)
హౌరా-గువాహతి మార్గంలో పూర్తి ప్రయాణానికి 3 ఏసీకి సుమారుగా రూ.2,300, 2 ఏసీకి రూ.3,000, ఫస్ట్ ఏసీకి రూ.3,600 (కేటరింగ్ ఛార్జీలతో కలిపి) ఉండొచ్చని అంచనా. వీటికి అదనంగా జీఎస్టీ ఛార్జీలు ఉండే అవకాశం ఉందని గమనించాలి.
రిజర్వేషన్ కోటాలు
ఈ రైలులో అన్ని రకాల కోటాలు వర్తించవు. కేవలం కింద పేర్కొన్న ముఖ్యమైన విభాగాలకు మాత్రమే రిజర్వేషన్ కోటా ఉంటుంది.
1. మహిళలు
2. దివ్యాంగులు
3. సీనియర్ సిటిజన్లు
4. డ్యూటీ పాస్ కోటా (రైల్వే సిబ్బంది కోసం). మిగిలిన ఇతర ప్రత్యేక కోటాలకు ఈ రైలులో చోటు లేదు.
ఈ రైలు ప్రత్యేకతలు
మొత్తం 16 కోచ్‌లతో (11 థర్డ్ ఏసీ, 4 సెకండ్ ఏసీ, 1 ఫస్ట్ ఏసీ) నడవనున్న ఈ రైలులో 823 మంది ప్రయాణించవచ్చు. గంటకు 160 కిమీ వేగంతో ప్రయాణించగల సామర్థ్యం దీని సొంతం. అత్యాధునిక ‘కవచ్’ భద్రతా వ్యవస్థ, ఆటోమేటిక్ డోర్స్, విమాన స్థాయి సౌకర్యాలతో ఈ వందే భారత్ స్లీపర్ ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని ఇవ్వనుందని భారీతీయ రైల్వే తెలిపింది.
ఇదీ చదవండి: ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటుకు భవిష్యత్తులో సవాళ్లు


