ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటుకు భవిష్యత్తులో సవాళ్లు | What Bezos Actually Said about AI data centers | Sakshi
Sakshi News home page

ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటుకు భవిష్యత్తులో సవాళ్లు

Jan 13 2026 12:54 PM | Updated on Jan 13 2026 1:10 PM

What Bezos Actually Said about AI data centers

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో ప్రస్తుతం కొనసాగుతున్న డేటా సెంటర్ల నిర్మాణ వేగాన్ని అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ తీవ్రంగా తప్పుబట్టారు. 2026 న్యూయార్క్ టైమ్స్ డీల్ బుక్ సమ్మిట్ వేదికగా ఆయన మాట్లాడుతూ, ప్రైవేట్ కంపెనీలు తమ సొంత డేటా సెంటర్లను నిర్మించుకోవడాన్ని 110 ఏళ్ల క్రితం నాటి విద్యుత్ రంగ పరిస్థితులతో పోల్చారు.

చారిత్రక తప్పిదమే పునరావృతం?

మెటా, ఓపెన్ ఏఐ వంటి దిగ్గజ సంస్థలు తమ సొంత కంప్యూటింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవడాన్ని బెజోస్ తప్పుబట్టారు. 20వ శతాబ్దం ప్రారంభంలో పవర్ గ్రిడ్లు అందుబాటులోకి రాకముందు కర్మాగారాల్లో తమకు అవసరమైన విద్యుత్తును తామే ఉత్పత్తి చేసుకునేవారని, ఇప్పుడు ఏఐ రంగంలోనూ అదే జరుగుతోందని ఆయన గుర్తు చేశారు. ‘ప్రస్తుతం ప్రతి ఒక్కరూ తమ సొంత డేటా సెంటర్లు నిర్మించుకుంటున్నారు. కానీ ఇది శాశ్వతం కాదు. దీనికి ఎన్నో సవాళ్లు ఉన్నాయి. రాబోయే రోజుల్లో భారీగా విద్యుత్తు వనరుల అవసరం పెరగనుంది. భవిష్యత్తులో టెక్‌ ఇండస్ట్రీ అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) వంటి కేంద్రీకృత క్లౌడ్ కంప్యూటింగ్ సేవల వైపు మళ్లడం అనివార్యం. అప్పుడే వనరుల దుర్వినియోగం తగ్గుతుంది’ అని ఆయన అంచనా వేశారు. గతంలో విద్యుత్ రంగం ఎలాగైతే కేంద్రీకృతమై సమర్థవంతంగా మారిందో, ఏఐ మౌలిక సదుపాయాల్లో కూడా అదే రకమైన విప్లవం రావాలని హెచ్చరించారు.

పెరుగుతున్న విద్యుత్ డిమాండ్

ఏఐ వినియోగం పెరగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ వినియోగం గణనీయంగా మారుతోంది. 2024లో డేటా సెంటర్లు 415 టెరావాట్ల విద్యుత్తును వాడగా, 2030 నాటికి ఇది 945 టెరావాట్లకు చేరుతుందని అంచనా. అమెరికా జాతీయ విద్యుత్ డిమాండ్‌లో డేటా సెంటర్ల వాటా 4 శాతం నుంచి 12 శాతానికి పెరిగే అవకాశం ఉంది. ఒక సాధారణ గూగుల్ సెర్చ్‌తో పోలిస్తే, ఒక్క చాట్ జీపీటీ ప్రాంప్ట్‌ 10 రెట్లు ఎక్కువ శక్తిని తీసుకుంటుంది. అలాగే ఒక లార్జ్‌ ఏఐ మోడల్ శిక్షణకు ఏడాదికి సుమారు 200 గృహాలకు సరిపడా విద్యుత్ అవసరమవుతుందని అంచనా.

శక్తి వనరులే అసలైన అడ్డంకి

కేవలం బెజోస్ మాత్రమే కాకుండా, ఇతర టెక్ దిగ్గజాలు కూడా విద్యుత్ కొరతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఒక సందర్భంలో ‘తగినంత విద్యుత్ లేక జీపీయూ చిప్స్ ఖాళీగా ఉంటున్నాయి’ అని అంగీకరించారు. సుందర్ పిచాయ్ (గూగుల్ సీఈఓ) గతంలో మాట్లాడుతూ విద్యుత్ లభ్యత అనేది ఏఐ వృద్ధికి దీర్ఘకాలిక అడ్డంకి అని పేర్కొన్నారు. ఈ సమస్యను అధిగమించడానికి మెటా సంస్థ ఒహియోలో ఏర్పాటు చేస్తున్న తన సూపర్ క్లస్టర్ కోసం ఏకంగా అణు విద్యుత్ ఒప్పందాలను కుదుర్చుకోగా, ఆల్ఫాబెట్ సంస్థ పవర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం 4.75 బిలియన్‌ డాలర్లను వెచ్చించింది.

ఇదీ చదవండి: లక్షకు పైగా యూఎస్‌ వీసాల రద్దు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement