అమెరికా ఇమ్మిగ్రేషన్ విధానాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. భద్రతా కారణాలు, చట్టపరమైన నిబంధనలు ఉల్లంఘనల నేపథ్యంలో యూఎస్ విదేశాంగ శాఖ ఏడాది కాలంలో ఏకంగా 1,00,000 కంటే ఎక్కువ వీసాలను రద్దు చేసినట్లు ప్రకటించింది. రద్దు చేసిన వాటిలో దాదాపు 8,000 విద్యార్థి వీసాలు, 2,500 ప్రత్యేక వర్క్ పర్మిట్లు ఉండటం గమనార్హం. క్రిమినల్ రికార్డులు లేదా చట్టపరమైన నిబంధనలు అతిక్రమించిన విదేశీ పౌరులపై చేపట్టిన చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
సురక్షిత అమెరికా లక్ష్యంగా..
ఇటీవల తన అధికారిక ఎక్స్(గతంలో ట్విట్టర్) ఖాతా ద్వారా యూఎస్ విదేశాంగ శాఖ ఈ వివరాలను వెల్లడించింది. అమెరికాను సురక్షితంగా ఉంచడానికి వీసారద్దును, కఠినమైన నిబంధనలను కొనసాగిస్తామని స్పష్టం చేసింది. ట్రంప్ పరిపాలనలో వీసా అమలును కఠినతరం చేయడం, యూఎస్‌లోకి ప్రవేశించిన తర్వాత కూడా వీసా హోల్డర్ల ప్రవర్తనను పర్యవేక్షించే స్క్రీనింగ్ విధానాల విస్తరణ వల్లే ఈ స్థాయిలో రద్దులు జరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
భారతీయులపై ప్రభావం
అమెరికా వీసా హోల్డర్లలో అధిక సంఖ్యలో ఉన్న భారతీయులపై ఈ నిర్ణయం నేరుగా ప్రభావం చూపుతోంది. అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య పరంగా చైనాను అధిగమించిన భారత్, ఇప్పుడు కఠినమైన యూఎస్ స్క్రీనింగ్ విధానాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటోంది. 2025లో భారతీయ విద్యార్థులకు వీసా జారీ ప్రక్రియ నెమ్మదించింది. హెచ్-1బీ వీసాలపై ఉన్న భారతీయ ఐటీ నిపుణులు కూడా అనిశ్చితిని ఎదుర్కొంటున్నారు. కొత్త H-1B వీసాలపై ప్రతిపాదిత 1,00,000 డాలర్ల ఫీజు విధించే నిబంధన కంపెనీలకు భారంగా మారింది. ప్రస్తుతం ఈ అంశం యూఎస్ కోర్టుల్లో చట్టపరమైన సవాలును ఎదుర్కొంటోంది. ఒకవైపు భారత్‌లోని రాయబార కార్యాలయం వరుసగా రెండో ఏడాది 10 లక్షల కంటే ఎక్కువ నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాలను జారీ చేసినప్పటికీ, ఈ వీసాల రద్దు ఆందోళన కలిగిస్తోంది.
🚨BREAKING: The State Department has now revoked over 100,000 visas, including some 8,000 student visas and 2,500 specialized visas for individuals who had encounters with U.S. law enforcement for criminal activity.
We will continue to deport these thugs to keep America safe. pic.twitter.com/wuHVltw1bV— Department of State (@StateDept) January 12, 2026
రంగంలోకి భారత ప్రభుత్వం
పెరుగుతున్న వీసా రద్దులు, కఠిన నిబంధనలపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. అమెరికాలో ఉంటున్న భారతీయ విద్యార్థులు, కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తాము నిశితంగా గమనిస్తున్నట్లు తెలిపింది. ‘ప్రభావిత భారతీయ పౌరులతో సంప్రదింపులు జరుపుతున్నాం. వీసా ఆందోళనలను అధికారికంగా యూఎస్ దృష్టికి తీసుకెళ్లాం’ అని ప్రభుత్వం ప్రకటించింది.
ఇదీ చదవండి: పండగ ముందు పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..


