భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ స్లీపర్ రైలుకు ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభించింది. కామాఖ్య –హౌరా మధ్య గురువారం నుంచి పరుగులు తీయయనున్న వందే భారత్ స్లీపర్ రైలు తొలి కమర్షియల్ జర్నీకి సంబంధించి టికెట్లు కొన్ని గంటల్లోనే అమ్ముడుపోయాయి.
సోమవారం(జనవరి 19) ఉదయం 8:00 గంటలకు రిజర్వేషన్లు ప్రారంభమవ్వగా.. కేవలం 24 గంటల లోపే అన్ని తరగతుల టిక్కెట్లు పూర్తిగా బుక్ అయ్యాయి. ఈ సెమీ హై-స్పీడ్ ట్రైన్‌ను 17 జనవరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ వందే భారత్ స్లీపర్ రైలులో ప్రపంచ స్థాయి ఇంటీరియర్స్, సెన్సార్ ఆధారిత లైటింగ్, మెరుగైన బెర్తులు, ఆధునిక బయో-టాయిలెట్లు ఉన్నాయి.
అంతేకాకుండా హౌరా, కామఖ్య మధ్య నడిచే ఈ వందే భారత్ స్లీపర్ రైలు ప్రయాణీకులకు దాదాపు 3 గంటల సమయం ఆదా చేస్తుంది. ఈ కారణాలతో ప్రయాణికులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.
ఛార్జీలు ఎలా ఉన్నాయంటే?
ప్రయాణికులు కనీసం 400 కిలోమీటర్ల దూరానికి కనీస ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. కామాఖ్య నుంచి హౌరా మధ్య ప్రయాణానికి ఫస్ట్ ఏసీలో రూ.3,855, సెకెండ్ ఏసీలో రూ.3,145, థర్డ్ ఏసీలో రూ.2,435 ఖర్చు అవుతోంది.
నో వెయిటింగ్ లిస్ట్!
సాధారణ రైళ్లలో లాగా ఇందులో ఆర్‌ఎసీ(RAC) లేదా వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్లు ఉండవు. కేవలం కన్ఫర్మ్ అయిన టికెట్ ఉన్న ప్రయాణికులను మాత్రమే అనుమతిస్తారు. దీనివల్ల రైలు లోపల రద్దీ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది.


