ప్రముఖ కంటెంట్ క్రియేటర్లలో ఒకరైన అంకుర్ వారికూ తన డ్రైవర్ వేతనం, కుటుంబంలో అతనికి ఉన్న గౌరవాన్ని తెలియజేస్తూ సామాజిక మాధ్యమంలో చేసిన పోస్ట్‌కు సోషల్ మీడియాలో ప్రశంసలు అందుతున్నాయి. ఇంతకూ నెటిజన్లు దృష్టిని ఆకర్షించేలా ఆయన చేసిన పోస్ట్ ఏమిటో చూద్దాం.
అంకుర్ వారికూ చేసిన పోస్ట్‌లోని వివరాలు..‘దయానంద్ భయ్యా(డ్రైవర్) తాజా వార్షిక ఇంక్రిమెంట్‌తో అతని నెలవారీ వేతనం రూ.53,350కు చేరింది. దీనికి ఇన్సూరెన్స్, ఒక నెల దీపావళి బోనస్, తాజాగా ఇచ్చిన స్కూటీ అదనం. అతను 13 సంవత్సరాల క్రితం రూ.15,000 నెలవారీ వేతనంతో ఈ ఉద్యోగంలో చేరారు. తాను కేవలం డ్రైవర్ మాత్రేమే కాదు. మా కుటుంబంలో ఒకరు. నమ్మకమైన వ్యక్తి. అతని వద్ద ఇంటి తాళాలు ఉంటాయి. మా ఏటీఎం పిన్ నంబర్లు కూడా తనకు తెలుసు. అతను అత్యంత సమయపాలన, క్రమశిక్షణ గల వ్యక్తి. రోజూ ఉదయం 4:30 గంటలకు మేల్కొని, రాత్రి 8:30 గంటలకు నిద్రపోతారు. దయానంద్ భయ్యా ముగ్గురు పిల్లలు మంచి ఉద్యోగాల్లో స్థిరపడి, సంతోషంగా వివాహం చేసుకున్నారు. రాబోయే 5-6 సంవత్సరాల్లో అతని జీతం నెలకు రూ.1 లక్షకు చేరుకోవాలని ఆశిస్తున్నాను’ అని వారికూ అన్నారు.

2024లో రూ.16.84 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిన గుర్‌గావ్‌కు చెందిన వారికూ చేసిన పోస్ట్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిస్తున్నారు. సూరజ్ బాలకృష్ణన్ అనే ఒక యూజర్ ‘ఉద్యోగులతో ఇలా సరైన మార్గంలో వ్యవహరించాలి. నిన్ను చూసి గర్వంగా ఉంది అంకుర్’ అని రాశారు. మరొకరు, ‘రోజువారీ సహాయం చేసే వారిని విస్మరించే ఈరోజుల్లో నిజంగా గౌరవంతో చూస్తున్నారు. మీరు మీ డ్రైవర్‌పట్ల చాలా విధేయతతో ఉన్నారు. ఉద్యోగుల నమ్మకం, కృషిని గుర్తించడం చాలా సంతోషం’ అని వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: బ్యాటరీలతోనే బ్యాటరీలు తయారీ!


