బ్రస్సెల్స్: యూరప్‌లో హమాస్ ఉగ్రవాదుల భారీ విధ్వంసక కుట్ర భగ్నమయ్యింది. ఇక్కడి యూదుల లక్ష్యాలపై దాడులకు హమాస్ ఉగ్రవాదులు కుట్రపన్నారని, వారు ఖతార్, టర్కీలను టార్గెట్ చేసుకున్నారని ఇజ్రాయెల్ నిఘా సంస్థ ‘మొసాద్’ వెల్లడించింది. యూరోపియన్ అధికారుల సహకారంతో దర్యాప్తు నిర్వహించి, ఉగ్రవాద అనుమానితులను అరెస్ట్ చేశామని, ఆయుధాల నిల్వలను స్వాధీనం చేసుకున్నామని మొసాద్ ఒక ప్రకటనలో పేర్కొంది.
జర్మనీ, ఆస్ట్రియాలలో జరిగిన అరెస్టులు, ఆయుధాల స్వాధీనం ఈ దర్యాప్తులో భాగమేనని మొసాద్ తెలిపింది. జర్మన్ అరెస్ట్ వారెంట్‌పై లండన్‌లో అరెస్టయిన 39 ఏళ్ల బ్రిటిష్ వ్యక్తి, బెర్లిన్‌లో గత అక్టోబర్‌లో నిర్బంధించిన ముగ్గురు హమాస్ విదేశీ సభ్యులలో ఒకరైన అబెద్ అల్ జి అనే జర్మన్ పౌరుడిపై దర్యాప్తు జరిగిందని వివరించింది. ఈ అరెస్టుల సమయంలో పోలీసులు ఏకే-47 అసాల్ట్ రైఫిల్, హ్యాండ్‌గన్‌లు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వియన్నాలో స్వాధీనం చేసుకున్న ఈ ఆయుధాలు సీనియర్ హమాస్ పొలిట్‌బ్యూరో అధికారి బాసెం నయీమ్ కుమారుడు ముహమ్మద్ నయీమ్‌కు చెందినవని మొసాద్ తెలిపింది.
ముహమ్మద్ నయీమ్ సెప్టెంబర్‌లో ఖతార్‌లోని తన తండ్రిని కలిశాడని ఇజ్రాయెల్ పేర్కొంది. దీనిలో హమాస్ నాయకత్వ ప్రమేయం ఉండవచ్చని మొసాద్ అభిప్రాయపడింది. దర్యాప్తులో ఈ దాడుల ప్రణాళికలో టర్కీలోని హమాస్ సభ్యులు ఉన్నారా? అనే అంశం కూడా మొసాద్ పరిశీలనలో ఉంది. అయితే హమాస్ ఈ అరెస్టు అయిన వ్యక్తులతో తమకు ఎటువంటి సంబంధం లేదని తెలిపింది. మొసాద్ వెలువరించిన ప్రకటనలో.. 2023, అక్టోబర్ 7 దాడుల తరువాత హమాస్ యూరప్‌లో తన ఉగ్రవాద నెట్‌వర్క్‌ను విస్తరించడంపై దృష్టి సారించిందని పేర్కొంది. కాగా హమాస్ ఉగ్రవాద ముప్పును ఎదుర్కొనేందుకు యూరోపియన్ భాగస్వామ్యం సహకరించడంపై మొసాద్ అభినందించింది.
ఇది కూడా చదవండి: ‘ఎప్‌స్టీన్ ఫైళ్లు'.. ట్రంప్ సంచలన ప్రకటన


