చంద్రుడిపై అన్వేషణలో భాగంగా పలు దేశాలు కీలక ప్రాజెక్టులు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరో ముందడుగు వేసేందుకు రష్యా సిద్ధమవుతోంది. జాబిల్లిపై వచ్చే పదేళ్లలో విద్యుత్ కేంద్రం నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తాము చేపడుతోన్న లూనార్ ప్రొగ్రామ్‌తో పాటు రష్యా-చైనా ఉమ్మడి పరిశోధన కేంద్రానికి విద్యుత్ సరఫరా చేసే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు వెల్లడించింది.
చంద్రుడిపై 2036 నాటికి విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని ప్రణాళిక రచించినట్లు రష్యా ప్రభుత్వ ఆధ్వర్యంలోని అంతరిక్ష పరిశోధనా సంస్థ రాస్కాస్‌మస్ వెల్లడించింది. ఇందుకోసం ఏరోస్పేస్ కంపెనీ లావొచ్‌కిన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. రోవర్లు, అబ్జర్వేటరీ, రష్యా-చైనా సంయుక్త పరిశోధనా కేంద్రంతో పాటు తమ సొంత లూనార్ ప్రోగ్రామ్‌కు విద్యుత్‌ను అందించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశమని పేర్కొంది. అయితే, అది అణువిద్యుత్ కేంద్రమేనని వార్తలు వస్తున్నప్పటికీ.. రష్యా సంస్థ నుంచి దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.
అంతరిక్ష పరిశోధనల్లో ముందున్న రష్యా.. తమ వ్యోమగామి యూరి గగారిన్‌ను 1961లోనే అంతరిక్షంలోకి పంపించింది. కానీ, కొన్ని దశాబ్దాలుగా అమెరికా, చైనాల కంటే కాస్త వెనకబడినట్లు కనిపిస్తోంది. ఇటీవల (2023 ఆగస్టులో) రష్యా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన లూనా-25 జాబిల్లిపై అడుగుపెట్టడానికి ముందే కూలిపోయింది. మరోవైపు అంతరిక్ష ప్రయోగాల్లో దూసుకెళ్తున్న ఎలాన్ మస్క్ కూడా తీవ్ర పోటీని ఇస్తున్న విషయం తెలిసిందే.


