ఆన్‌లైన్ మోసాలు అనేవి ఎప్పటికప్పుడు వింటూనే ఉంటాయి. మనకు చుట్టుపక్కనోళ్లలోనే ఈ తరహా బాధితులు చాలామందే ఉంటారు. తాజాగా రాయిటర్స్ రిపోర్టర్లు.. థాయ్-కాంబోడియా సరిహద్దు దగ్గరలోని ఓ కాంబోడియా కౌంపౌండ్‌లో భారీ ఆన్‌లైన్ మోసాల కేంద్రాన్ని కనుగొన్నారు. దాన్ని బయటపెట్టారు. ఆ ప్రదేశంలో ఆస్ట్రేలియా, సింగపూర్ పోలీస్ స్టేషన్లలా కనిపించే నకిలీ గదులు, వియత్నాం బ్యాంక్‌లా కనిపించే సెటప్‌లు ఉండటం షాకింగ్‌గా అనిపిస్తోంది.
అలానే సదరు కేంద్రంలో దొరికిన పత్రాల్లో వృద్ధులు, మహిళలు, సమస్యల్లో ఉన్నవారి, బలహీన వర్గాల వివరాలే ఎక్కువగా ఉన్నాయి. ప్రేమ మోసాలు, పోలీసులుగా నటించి బెదిరించే స్కాములకు సంబంధించిన స్క్రిప్ట్‌లు దొరికాయి. ఈ క్రమంలోనే రాయిటర్స్.. ఓ జపాన్ వృద్ధుడిని సంప్రదించగా.. తనకు ఇలాంటి స్కామ్ కాల్ వచ్చిన విషయమే నిజమేనని చెప్పాడు. డబ్బు ఇవ్వకపోయినప్పటికీ.. వ్యక్తిగత సమాచారం చెప్పేశానని ఒప్పుకొన్నాడు.
ఈ స్కామ్ కేంద్రాలు.. బయటకు వ్యాపార సంస్థల్లా నడుస్తున్నాయి. వేర్వేరు స్కామర్ల గ్రూపులకు వీటిలో గదులు అద్దెకిచ్చి, నెలకు వేల డాలర్లు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. అలానే బయట వ్యక్తులు లోపలికి ప్రవేశించకుండా కఠిన నిబంధనలు, భద్రతా సిబ్బంది కూడా ఉన్నాయి. ఆగ్నేయాసియా ఇప్పుడు ప్రపంచ సైబర్ మోసాలకు ప్రధాన కేంద్రంగా మారిందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా చైనా నేరగాళ్లు.. ఎక్కువగా ఈ స్కామ్స్ నడుపుతున్నారు. ఇందులో పనిచేసేవారిలో చాలామంది మానవ అక్రమ రవాణా బాధితులే కావడం విచారకరం.
2024లో ఈ స్కామ్‌ల వల్ల అమెరికన్లు.. దాదాపు 10 బిలియన్ డాలర్లు నష్టపోయారని అంచనా. థాయ్ సైనిక దాడులు, ప్రభుత్వ చర్యల వల్ల ఇప్పుడు లక్షలాది మంది.. సదరు మోసాల కాంపౌండ్స్ నుంచి బయటకు రావాల్సి వచ్చింది. ఈ సంఘటనల వల్ల ప్రపంచవ్యాప్తంగా సైబర్ మోసాలు ఎంత పక్కాగా, ప్రమాదకరంగా మారాయో స్పష్టమవుతోంది.


