వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్ రహస్య ఫైళ్లను బహిరంగంగా విడుదల చేయాలంటూ న్యాయ శాఖను ఆదేశించే బిల్లుపై సంతకం చేసినట్లు ప్రకటించారు. రాజకీయ ఒత్తిడికి తలొగ్గి ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తన సోషల్ మీడియా పోస్ట్‌లో ఆయన.. ‘మా అద్భుతమైన విజయాల నుండి దృష్టి మరల్చేందుకు ‘ఎప్‌స్టీన్ ఫైళ్లు' అంశాన్ని డెమొక్రాట్లు ఉపయోగించుకున్నారు’ అని ఆరోపించారు.
‘ఎన్‌డీటీవీ’ అందించిన కథనంలోని వివరాల ప్రకారం ఈ బిల్లు ‘ఎప్‌స్టీన్ ఫైళ్లు పారదర్శకత చట్టం’ పేరుతో కాంగ్రెస్‌లో ద్వైపాక్షిక మద్దతు పొందింది. మంగళవారం హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్‌లో 427-1 ఓట్ల భారీ తేడాతో ఈ బిల్లు ఆమోదం పొందడం విశేషం. ట్రంప్ వ్యతిరేకత తర్వాత కూడా రిపబ్లికన్లతో సహా మెజారిటీ చట్టసభ సభ్యులు ఈ పారదర్శకతకు మద్దతు తెలిపారు. ఈ పరిణామం ఎప్‌స్టీన్ బాధితులకు, ఈ కేసులోని నిజానిజాలు తెలుసుకోవాలని కోరుకుంటున్న ప్రజలకు ఉపశమనం కలిగింది.
ఈ చట్టం ప్రకారం.. న్యాయ శాఖ (డీఓజే) ఎప్‌స్టీన్‌కు సంబంధించిన అన్ని ఫైళ్లు, కమ్యూనికేషన్‌లను 30 రోజుల్లోపు విడుదల చేయవలసి ఉంటుంది. 2019లో ఫెడరల్ జైలులో ఎప్ స్టీన్ మరణంపై జరిగిన దర్యాప్తుకు సంబంధించిన సమాచారాన్ని కూడా బహిర్గతం చేయాలని ఈ బిల్లు కోరుతోంది. ఎప్‌స్టీన్ జైలులో ఆత్మహత్య చేసుకున్నప్పటికీ, అతని మరణంపై అనేక సందేహాలు, కుట్ర కోణాలు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రంప్ ప్రకటన కీలకంగా మారింది. అయితే ఈ బిల్లులో కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి. కొనసాగుతున్న ఫెడరల్ దర్యాప్తుల కోసం ఎప్‌స్టీన్ బాధితులకు సంబంధించిన కొన్ని సవరణలను (Redactions) చేయడానికి ఈ చట్టం అనుమతిస్తుంది. అంటే రాజకీయంగా ఎంతటి సున్నితమైన లేదా ఇబ్బందికరమైన సమాచారం ఉన్నా, అది తప్పనిసరిగా బహిర్గతం చేయవలసి ఉంటుంది. త్వరలోనే ఎప్‌స్టీన్ ఫైళ్లు వెల్లడి కానుండటంతో, దీనిలో ఏయే ప్రముఖుల పేర్లు బయటపడతాయో అనే ఉత్కంఠ ప్రపంచవ్యాప్తంగా నెలకొంది.
ఇది కూడా చదవండి: ‘ఏడ్చినా.. పట్టించుకోను’.. టీచర్ వేధింపులకు విద్యార్థి బలి


