వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సెలియా ఫ్లోరెస్‌ను అరెస్ట్ చేసి ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసింది అమెరికా. ఆపై ఆ దేశపు చమురు నిల్వలు పూర్తిగా తమ ఆధీనంలోనే ఉంటాయని.. అదీ నిరవధికంగానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించుకున్నారు. ఈ పరిణామంపై వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా. అయితే..
ఈ భూమ్మీద అత్యధిక చమురు నిల్వలు(సుమారు 300 బిలియన్ బ్యారెల్స్) వెనెజువెలాలోనే ఉన్నాయి. అందునా ఎక్కువగా ఒరినోకో బెల్ట్ ప్రాంతంలో లభిస్తున్నాయి. కానీ, వెనెజువెలాలో లభించే చమురు హెవీ సోర్ క్రూడ్.. అంటే మందంగా, మరీ చిక్కగా ఉంటుంది. డర్టీ ఆయిల్‌గా ఇక్కడి చమురు నిక్షేపాలకు ఓ పేరుంది. పైగా ప్రతి బ్యారెల్‌కి ప్రపంచ సగటు కంటే రెండింతలు ఎక్కువ కాలుష్యం కలిగిస్తోంది. అలాగే..
ఇంతకాలం వెనెజువెలా చమురును ఆవిరితో కరిగించి.. లైట్ క్రూడ్ ఆయిల్‌తో కలిపి అమెరికా, చైనా, ఇండియా వంటి దేశాల రిఫైనరీలకు పంపించి వాడుకున్నారు. కానీ ఇది ఖరీదైనది.. కాలుష్యం ఎక్కువగా కలిగించే ప్రక్రియ కూడా.
కాబట్టి ఎలా చూసుకున్నా ఈ చమురును శుధ్ది చేసి పెట్రోల్, డీజిల్‌గా మార్చడం అత్యంత కష్టంతో కూడుకున్న పని. దీనికి ఎక్కువ ఎనర్జీ అవసరం పడుతుంది. కాబట్టి అడ్డగోలుగా ఖర్చు చేయాల్సి వస్తుంది. వీటన్నింటికి తోడు.. వెనెజువెలాలో ప్రస్తుతం చమురు శుద్ధి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పాతది. పైగా మీథేన్ లీకేజీలు, అగ్నిప్రమాదాలకు ఆస్కారం ఉంది. ఈ ప్రక్రియ జరిగేటప్పుడు విడుదలయ్యే.. మీథేన్ వాయువు కార్బన్ డయాక్సైడ్ కంటే 80 రెట్లు ప్రమాదకరం కూడా.
అయితే.. తమ దగ్గర ఉన్న ఆధునిక సాంకేతికతతో ఉద్గారాలను తగ్గించగలమని అమెరికా అంటోంది. అయినప్పటికీ కూడా అమెరికా చమురు ఉత్పత్తి చేస్తే కూడా పర్యావరణంపై భారీ ప్రభావం తప్పదని నిపుణులు అంటున్నారు. వెనెజువెలా చమురు మొత్తాన్ని తీయడం అమెరికాకు ఆర్థిక భారమే కాదు.. ప్రపంచ వాతావరణ ప్రతికూల మార్పు మరింత వేగవంతం అవుతుందని హెచ్చరిస్తున్నారు.


