అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ విద్యుత్ కోతలు సహజమే కావొచ్చు. కానీ, యూరప్‌లోనే అతిపెద్ద నగరమైన బెర్లిన్‌కు అందుకు మినహాయింపు. గత 80 ఏళ్లలో అక్కడ పవర్ కట్ లేనే లేదట ( ఇది మరీనూ.. చిన్న చిన్న అంతరాయలు ఉండొచ్చేమో). అలాంటిది ఆ నగరం ఇప్పుడు అంధకారాన్ని చవిచూసింది.
చీకట్లలో.. గడ్డ కట్టే చలితో వేలమంది బెర్లిన్ ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. వాళ్లకు సదుపాయాలు కలిగించలేక అటు ప్రభుత్వం చుక్కలు చూసింది. చివరకు విద్యుత్ పునరుద్ధరణతో అంతా హమ్మయ్యా అనుకున్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత.. తొలిసారి బెర్లిన్ నగరాన్ని ఆ స్థాయిలో చీకట్లు అలుముకున్నాయని చెబుతున్నారు.
హైవోల్టేజ్ కేబుల్స్ కాలిపోవడంతో సుమారు 50 వేల ఇళ్లకు, దాదాపు 1500ల వ్యాపార సముదాయ భవనాలకు కరెంట్ సరఫరా నిలిచిపోయింది. గడ్డ కట్టే చలిని తట్టుకోలేక ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఆదివారం అయితే ఏకంగా -9 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ నమోదు అయ్యింది. వెంటనే ప్రభుత్వం ఆర్మీని రంగంలోకి దించింది.

యుద్ధ ప్రాతిపాదికన హోటల్స్, స్కూల్స్, స్పోర్ట్స్‌సెంటర్‌లకు నగర పౌరులను తరలించింది. చివరకు బస్సులనూ షెల్టర్‌లుగా ఉపయోగించింది. అందరికీ ఆహారం, పడక, ఇతర సౌకర్యాలు కల్పించింది. పబ్లిక్ స్విమ్మింగ్ పూల్స్‌లో.. 24 గంటలు హాట్ వాటర్ సదుపాయం కల్పించారు. ఇందుకు అయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరించింది కూడా. రెండ్రోజులకు తాత్కాలికంగా.. గురువారం నాటికి పూర్తి స్థాయిలో విద్యుత్‌ను పునరుద్ధరించగలిగారు.

ఉగ్ర దాడి..
బెర్లిన్‌ను శనివారం నుంచి ఈ చీకట్లు అలుముకున్నాయి. అందుకు కారణం.. నగరానికి విద్యుత్ సరఫరా చేసే లైన్లలో జరిగిన అగ్నిప్రమాదమేనని గుర్తించారు. అయితే ఇది తమ పనేనని వుల్కాంగ్రూప్Vulkangruppe అనే నిషేధిత సంస్థ ప్రకటించుకుంది. క్లైమేట్ సంక్షోభం, ఏఐ ప్రభావంపై నిరసనగానే తాము ఈ దాడి చేసినట్లు 2,500 పదాల లేఖలో ఈ దాడిని సదరు సంస్థ సమర్థించుకుంది. దీంతో ఉగ్ర దాడి కోణంలోనే ఫెడరల్ ప్రాసిక్యూటర్లు దర్యాప్తు జరుపుతున్నారు.
వుల్కాంగ్రూప్ అనేది జర్మనీలో పనిచేస్తున్న ఫార్‌లెఫ్ట్ ఎక్స్‌ట్రీమిస్ట్ గ్రూప్. 2011 స్థాపించబడిన ఈ సంస్థ.. రైల్వే ఆస్తులను ధ్వంసం చేస్తూ,డాటా సెంటర్లు, టెస్లా ఫ్యాక్టరీపై దాడులతో వార్తల్లో నిలిచేది. ఈసారి ఏకంగా బెర్లిన్‌ను కరెంట్ కట్ చేసి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.


