జర్మనీ.. రెండో ప్రపంచ యుద్దం తర్వాత తొలిసారి తమ సైనిక విస్తరణపై దృష్టిసారించింది. యూరప్ ఖండంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యాన్ని తాయారు చేయడమే లక్ష్యంగా జర్మనీ అడుగులు వేస్తోంది. జర్మనీ సర్కార్ తమ సాయుధ దళాలను ఆధునీకరించడానికి 377 బిలియన్ యూరోల (సుమారు రూ.33,93,000 కోట్లు ) భారీ నిధిని కేటాయించింది.
ఇది ఆధునిక చరిత్రలోనే అతిపెద్ద రక్షణ బడ్జెట్లలో ఒకటి. రష్యా నుంచి పెరుగుతున్న ముప్పు, అంతర్జాతీయ రాజకీయాల్లో మారుతున్న సమీకరణాల నేపథ్యంలో ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
యువతకు బంపర్ ఆఫర్..
యువతను సైన్యం వైపు ఆకర్షించడానికి జర్మనీ భారీ జీతాన్ని ఆఫర్ చేస్తోంది. కొత్తగా చేరే సైనికులకు నెలకు 2,600 యూరోలు(భారత కరెన్సీలో సుమారు రూ. 2,80,000) ఇవ్వనున్నారు. అదేవిధంగా ఉచిత నివాసం, ఉచిత వైద్య సౌకర్యాలు కూడా అందించనున్నారు. కాగా సైన్యం ఎంపిక సంబంధించి జర్మనీ ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది.
ఈ చట్టం ప్రకారం.. జర్మనీ సర్కార్ 18 ఏళ్లు నిండిన యువకులందరికీ ఒక ఫారమ్‌ను పంపుతోంది. అందులో వారు తమ ఫిట్‌నెస్ లెవెల్స్, సైన్యంలో చేరడంపై ఆసక్తిని తెలియజేస్తూ సమాధానం కచ్చితంగా ఇవ్వాలి. అయితే సైన్యంలో చేరాలా? వద్దా అనేది? యువత ఇష్టానికే ప్రభుత్వం వదిలేసింది.
కానీ ఒకవేళ అనుకున్న సంఖ్యలో (ఏడాదికి కనీసం 80,000 మంది) వాలంటీర్లు రాకపోతే, బలవంతంగా చేర్చుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. జర్మనీ సైన్యాన్ని 'బుండెస్‌వెహర్' అని పిలుస్తారు. ప్రస్తుతమున్న 1.8 లక్షల మంది సైనికులను 2035 నాటికి 2.6 లక్షలకు పెంచాలని జర్మనీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాకుండా 2 లక్షల మంది రిజర్వ్ సైన్యాన్ని కూడా సిద్దం చేయనున్నారు.


