న్యూఢిల్లీ: పాఠశాలలో ఉపాధ్యాయుల నుంచి ఎదురైన అవమాన భారానికి ఒక విద్యార్ధి బలయ్యాడు. ఢిల్లీలోని ఒక ప్రముఖ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న 16 ఏళ్ల విద్యార్థి బలవన్మరణానికి పాల్పడటం అందరిలో విషాదాన్ని నింపింది. మెట్రో స్టేషన్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఆ బాలుడు.. తన ఆత్మహత్యకు పాఠశాల ఉపాధ్యాయుల వేధింపులేనని కారణమని ఆరోపిస్తూ ఒక సూసైడ్ నోట్‌ను వదిలివెళ్లాడు. ఈ ఘటన తల్లిదండ్రులను, స్థానికులను తీవ్రంగా కలచివేసింది.
కుమారుడిని కోల్పోయిన తండ్రి సదరు పాఠశాలలోని ముగ్గురు ఉపాధ్యాయులు, పాఠశాల ప్రిన్సిపాల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు తన కొడుకును మానసికంగా హింసించడం వల్లే ప్రాణాలను తీసుకున్నాడని ఆ తండ్రి కన్నీరుమున్నీరవుతూ పోలీసులకు తెలిపాడు. ప్రతిరోజూ మాదిరిగానే మంగళవారం ఉదయం 7.15 గంటలకు ఆ బాలుడు పాఠశాలకు వెళ్లాడు. అయితే మధ్యాహ్నం 2.45 గంటల ప్రాంతంలో సెంట్రల్ ఢిల్లీలోని రాజేంద్ర ప్లేస్ మెట్రో స్టేషన్ సమీపంలో గాయాలతో ఆ బాలుడు పడి ఉన్నట్లు తండ్రికి ఫోన్ వచ్చింది. బాలుడిని ఆస్పత్రికి తరలించే లోపే అతను మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.
మృతుని తండ్రి ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. ‘గత కొద్ది రోజులుగా నా కుమారుడిని పాఠశాలలోని ముగ్గురు ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్ వేధిస్తున్నారు. మంగళవారం ఒక డ్రామా క్లాసులో నా కుమారుడు పడిపోతే, ఒక టీచర్ అతనిని అవమానించి, అతిగా నటిస్తున్నావని ఎగతాళి చేశారు. దీంతో నా కుమారుడు ఏడవడం మొదలుపెట్టాడు. అయినప్పటికీ, ఆ టీచర్ నువ్వు ఎంత ఏడ్చినా పట్టించుకోను అని అన్నారు. ఇదంతా జరుగుతున్నప్పుడు ప్రిన్సిపాల్ అక్కడే ఉన్నా, తన కుమారునిపై వేధింపులను ఆపేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదని తండ్రి ఆరోపించారు.
10వ తరగతి పరీక్షలు దగ్గర పడుతుండటంతో, స్కూల్ ఉపాధ్యాయులు వేసే మార్కుల విషయంలో ఇబ్బంది ఎదురుకాకూడదనే ఉద్దేశంతో తాము పాఠశాల యాజమాన్యంపై గట్టి చర్య తీసుకోలేకపోయామని తండ్రి తెలిపారు. పరీక్షలు అయ్యాక వేరే స్కూల్‌లో చేరవచ్చని తన కుమారునికి హామీ ఇచ్చానని ఆ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. కాగా బాలుని బ్యాగులో దొరికిన సూసైడ్ నోట్‌లో.. తన అవయవాలు పని చేసే స్థితిలో ఉంటే వాటిని అవసరమైన వారికి దానం చేయాలని కోరాడు. అలాగే ఈ లెటర్ చదివినవారు ఈ నంబర్‌కు కాల్ చేసి, తాను చేసిన పనికి చింతిస్తున్నానని, పాఠశాలలో జరిగిన దానిని తట్టుకునేందుకు తనకు వేరే మార్గం లేదని భావిస్తున్నానని తెలిపాడు.
తన పాఠశాల ప్రిన్సిపాల్, ఇద్దరు ఉపాధ్యాయుల పేర్లను తెలియజేస్తూ, వారిపై చర్యలు తీసుకోవాలని, తద్వారా మరే విద్యార్థీ తనలాంటి దుస్థితిని ఎదుర్కోకుండా చూడాలని వేడుకున్నాడు. లేఖలో ఆ టీనేజర్ తన కుటుంబాన్ని తలచుకుని భావోద్వేగానికి లోనయ్యాడు. తన అన్నయ్యకు, తండ్రికి క్షమాపణలు చెప్పాడు. ఎల్లప్పుడూ తనకు మద్దతుగా నిలిచిన తల్లికి కృతజ్ఞతలు తెలుపుతూ, తండ్రిని, సోదరుడిని చక్కగా చూసుకోవాలని కోరాడు. ఒకవైపు పరీక్షల ఒత్తిడి, మరోవైపు టీచర్ల వేధింపులతో కుంగిపోయిన ఆ విద్యార్థి బలవన్మరణంతో తోటి విద్యార్థులు కంటతడి పెట్టుకున్నారు.
ఇది కూడా చదవండి: భారత్‌పై దాడికి జైష్ కుట్ర.. నిధుల సేకరణకు పిలుపు


