న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైష్ ఎ మొహమ్మద్ (జేఈఎం) భారతదేశంపై మరో ఆత్మాహుతి (ఫిదాయీన్) దాడికి సిద్ధమవుతోంది. ఈ దాడి కోసం ప్రత్యేకంగా నిధులు సేకరిస్తున్నట్లు నిఘా వర్గాలు ‘ఎన్‌డీటీవీ’కి తెలిపాయి. ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు దాడి దర్యాప్తులో ఈ విషయం వెలుగుచూసింది. జైష్ నేతలు ‘సదాపే’(పాకిస్తాన్ బ్యాంకింగ్ యాప్) లాంటి డిజిటల్ మార్గాల ద్వారా నిధులు సేకరణకు పిలుపునిచ్చారు.
జైష్ ఈ దాడుల కోసం మహిళల నేతృత్వంలో ఒక దళాన్ని కూడా సిద్ధం చేయనున్నదని తెలుస్తోంది. జైష్‌కు ఇప్పటికే మహిళా విభాగం ఉంది. ఉగ్ర సంస్థ నేత మసూద్ అజార్ సోదరి సాదియా ఈ యూనిట్‌కు నాయకత్వం వహిస్తున్నారని సమాచారం. ఎర్రకోట దాడిలో కీలక నిందితురాలు డాక్టర్ షాహినా సయీద్ అలియాస్ 'మేడమ్ సర్జన్' కూడా ఈ యూనిట్‌లో సభ్యురాలిగా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ ‘జిహాదీ’ ఆత్మాహుతి దళం కోసం జైష్ 20 వేల పాకిస్తానీ రూపాయలు (సుమారు రూ.6,400) చొప్పున విరాళాలు డిమాండ్ చేస్తోంది. ఈ డబ్బును ‘ముజాహిద్) (పోరాట యోధుడు) కోసం శీతాకాలపు కిట్‌ను కొనడానికి ఉపయోగిస్తారు. ఇందులో బూట్లు, సాక్స్, పరుపు, టెంట్ మొదలైనవి ఉంటాయి.
జైష్, లష్కర్ ఎ తోయిబా (ఎల్‌ఈటీ) వంటి ప్రధాన ఉగ్రవాద గ్రూపులు సమన్వయంతో కొత్త దాడులకు సిద్ధమవుతున్నాయని తాజా నిఘా సమాచారం సూచిస్తున్నది. ఈ రెండు సంస్థలకు పాకిస్తాన్ సైన్యం, డీప్ స్టేట్ నుండి నిధులు, మద్దతు లభిస్తున్నాయి. ఈ డిజిటల్ నిధుల నెట్‌వర్క్‌పై దర్యాప్తు సంస్థలు ప్రత్యేక విచారణ ప్రారంభించాయి. కాగా ఎర్రకోట కారు బాంబు దాడి నవంబర్ 10న జరిగింది. ఈ చారిత్రక కట్టడం సమీపంలో పేలుడు పదార్థాలతో నిండిన హ్యుందాయ్ ఐ20 పేలింది. ఈ పేలుడులో15 మంది మృతి చెందారు. కారు నడిపిన డాక్టర్ ఉమర్ మొహమ్మద్ కూడా మృతిచెందాడు.
ఇది కూడా చదవండి: ‘ముస్లింలు, క్రైస్తవులు.. అంతా హిందువులే’: మోహన్ భగవత్


