గౌహతి: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ మతాన్ని కేవలం మతపరమైన అర్థాలలో చూడకూడదన్నారు. ఇది అందరినీ కలుపుకునిపోయే సంస్కృతి అంటూ గౌహతిలో జరిగిన మేధావుల సమావేశంలో ఆయన వ్యాఖ్యానించారు.
దేశంలోని ముస్లింలు, క్రైస్తవులు వారి ఆచారాలను వదులుకోవాల్సిన అవసరం లేదని, అయితే వారు ఈ దేశాన్ని ఆరాధించాలని, భారతీయ సంస్కృతిని అనుసరించాలన్నారు. దేశానికి చెందిన పూర్వీకుల పట్ల గౌరవభావం కలిగి ఉండాలన్నారు. ఇలాంటి లక్షణాలు ఉన్నవారంతా హిందువులేనని భగవత్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన ‘పంచ పరివర్తన’ గురించి వివరించారు. సామాజిక సామరస్యం, కుటుంబ పరిరక్షణ వాటిలో ప్రధానమైనవన్నారు. పౌర క్రమశిక్షణ, స్వావలంబన, పర్యావరణ పరిరక్షణ కూడా అంతే ముఖ్యమన్నారు.
కుటుంబ వ్యవస్థను బలోపేతం చేయాలని ఆయన కోరారు. పూర్వీకుల సంప్రదాయాలను కాపాడుకోవాలని కుటుంబాలకు పిలుపునిచ్చారు. ఇది యువతలో సాంస్కృతిక గౌరవాన్ని పెంచుతుందన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో ఆర్‌ఎస్‌ఎస్ పాత్రను ఆయన గుర్తు చేసుకున్నారు. డాక్టర్ హెడ్గేవార్ జైలు శిక్షను ప్రస్తావించారు. దేశ నిర్మాణం కోసం నిస్వార్థంగా పనిచేయాలని మోహన్ భగవత్ కోరారు. ఈశాన్య ప్రాంతాన్ని భిన్నత్వంలో ఏకత్వానికి ఉదాహరణగా అభివర్ణించారు.
ఇది కూడా చదవండి: ‘ప్రిన్స్’ విందులో.. ట్రంప్ ‘పుత్రోత్సాహం’


