వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లో ఉన్నట్టుండి పుత్రోత్సాహం పెల్లుబికింది. దీనికి వైట్ హౌస్‌లో సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ కోసం ఏర్పాటు చేసిన విందు కార్యక్రమం వేదికగా నిలిచింది. ఈ విందుకు సాకర్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో హాజరుకావడం ఆసక్తికరంగా మారింది.
ఈ సందర్భంగా ట్రంప్.. రొనాల్డోను ప్రత్యేకంగా అభినందించారు. తన కుమారుడు బారన్.. రొనాల్డోకు పెద్ద అభిమాని అని ట్రంప్ వెల్లడించారు. తాను ఆ క్రీడా దిగ్గజాన్ని తన కుమారునికి పరిచయం చేయగలిగినందుకు చాలా సంతోషంగా ఉన్నానని అన్నారు. తన కుమారుడు బారన్ సాకర్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోను కలుసుకున్నాడు. ఇకపై బారన్ తనను మరింత అధికంగా గౌరవిస్తాడని అనుకుంటున్నానని ట్రంప్ చమత్కరించారు. సౌదీ క్లబ్ అల్-నాసర్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ, సౌదీ సాకర్ లీగ్‌లో కీలక ఆటగాడిగా ఉన్న రొనాల్టో వైట్ హౌస్‌లో జరిగిన విందుకు హాజరు కావడం ప్రత్యేకతను సంతరించుకుంది. ఇది అంతర్జాతీయ దృష్టిని కూడా ఆకర్షించింది.


