నాతో పెట్టుకోవద్దు.. టారిఫ్‌లపై ట్రంప్‌ కొత్త లాజిక్‌ | Donald Trump Sensational Comments On Tariff Issue, Announces 10% Tariff On Foreign Imports | Sakshi
Sakshi News home page

నాతో పెట్టుకోవద్దు.. టారిఫ్‌లపై ట్రంప్‌ కొత్త లాజిక్‌

Feb 21 2026 7:36 AM | Updated on Feb 21 2026 10:05 AM

Donald Trump Sensational Comments On Tariff Issue

వాషింగ్టన్‌: ప్రపంచ దేశాలపై తాను విధించిన టారిఫ్‌లు చెల్లవన్న అమెరికా సుప్రీంకోర్టు తీర్పుపై అధ్యక్షుడు డొనా­ల్డ్‌ ట్రంప్‌ నిప్పులు చెరిగారు. దాన్ని అత్యంత సిగ్గుచేటైన, తప్పుడు తీర్పుగా అభివర్ణించారు. ఆ తీర్పు ఇచ్చిన జడ్జి­లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘వాళ్లు పనికి­మాలినవాళ్లు. దేశానికే తలవంపులు తెచ్చారు. దేశానికి ఏది మేలో అర్థం చేసుకుని ఆ దిశగా నిర్ణయం తీసుకునే ధైర్యం ఏ మాత్రమూ లేని ఆ జడ్జిలను చూసి ఎంతగానో సిగ్గుపడుతున్నా’ అంటూ తూర్పారబట్టారు.

శుక్రవారం తీర్పు వెలువడ్డ అనంతరం ట్రంప్‌ మీడియాతో మాట్లాడా­రు. ఆ తీర్పుపై విదేశీ ప్రయోజనాల ప్రభావ­ముందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పుతో దేశాలన్నీ సంబరపడు­తున్నాయంటూ వాపోయా­రు. ప్రపంచ దేశాల­పై 10 శాతం టారిఫ్‌లు విధిస్తున్నట్టు ఈ సందర్భంగా ట్రంప్‌ ప్రకటించడం విశేషం. ‘ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుంది. ఈ మేరకు ఉత్తర్వులపై త్వరలో సంతకం చేస్తా’ అని చెప్పారు. తన వాణిజ్య అజెండాకు కోర్టు తీర్పు విఘాతం కలిగించబోదని స్పష్టం చేశారు.

ఇదే సమయంలో ‘దేశ ఆదాయా­న్ని పెంచేందుకు మరింత శక్తిమంతమైన మార్గాలెన్నో మాకు అందుబాటులో ఉన్నాయి. ఇకపై మరిన్ని టారిఫ్‌లు విధించగలను’ అని చెప్పుకొచ్చారు. 1977 నాటి ఐఈఈపీఏ చట్టం ప్రకారం ట్రంప్‌ ఇప్పటిదాకా పలు దేశాలపై విధించిన టారిఫ్‌లు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రద్దయినందున, వాటి స్థానంలో ఆయన తాజాగా ప్రకటించిన 10 శాతం టారిఫ్‌లు అమల్లోకి రానున్నాయి. 1974 నాటి వర్తక చట్టంలోని 122వ సెక్షన్‌ ప్రకారం ట్రంప్‌ వాటిని విధించారు. ఈ నిర్ణయానికి 150 రోజుల్లోపు కాంగ్రెస్‌ ఆమోదం పొందాల్సి ఉంటుంది. లేదంటే ఆ టారిఫ్‌లు అంతటితో రద్దవుతాయి.  

వైట్‌హౌస్‌ కీలక ప్రకటన.. 
మరోవైపు.. ప్రపంచ దేశాలపై అమెరికా విధించిన సుంకాలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మరింత రెచ్చిపోతూ అదనంగా 10 శాతం టారిఫ్​ విధిస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే భారత్​ కూడా ఆ 10శాతం సుంకాలు చెల్లించాల్సిందే అని వైట్‌హౌస్‌ పేర్కొంది. అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందం ప్రకారం టారిఫ్‌ చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. విలేకర్ల సమావేశంలో ఈ వైట్‌హౌస్ అధికారులు ఈ మేరకు మాట్లాడారు.

భారత్ 10 శాతం టారిఫ్ చెల్లించాలా? అలాగే ఇది గతంలో ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకానమీక్ పవర్ యాక్ట్(ఐఈఈపీఏ) కింద విధించిన టారిఫ్‌లను భర్తీ చేస్తారా అని ప్రశ్నకు వైట్‌హౌస్‌ అధికారి ఈ మేరకు స్పందించారు. మరో చట్టపరమైన అధికారం అమల్లోకి వచ్చే వరకు 10 శాతం టారిఫ్ కొనసాగుతుందని తెలిపారు. అంతేకాకుండా, అన్ని వాణిజ్య భాగస్వామ్య దేశాలు ఒప్పందాలకు కట్టుబడి ఉండాలని సూచించారు. ఈ 10 శాతం గ్లోబల్ టారిఫ్​ అనేది అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేపట్టిన రక్షణాత్మక వాణిజ్య విధానంలో భాగమని పేర్కొన్నారు. చెల్లింపుల సమతుల్యత లోటును తగ్గించడం, అన్యాయ వాణిజ్య విధానాలను పరిష్కరించే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement