వాణిజ్య ఒప్పందంపై త్వరలో సంతకాలు: గోర్‌  | India-US trade deal will be inked very soon | Sakshi
Sakshi News home page

వాణిజ్య ఒప్పందంపై త్వరలో సంతకాలు: గోర్‌ 

Feb 21 2026 6:20 AM | Updated on Feb 21 2026 11:35 AM

India-US trade deal will be inked very soon

న్యూఢిల్లీ: భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందంపై అతి త్వరలో సంతకాలు జరుగుతాయని భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్‌ వెల్లడించారు. అవి బహుశా ఈ వారమే జరగవచ్చని అభిప్రాయపడ్డారు. ఇరుదేశాల నడుమ మధ్యంతర ఒప్పందం కుదరడం నిజంగా గొప్ప విషయమన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్ల విషయంలో భారత్‌ ఇప్పటికే తమకు స్పష్టమైన హామీ ఇచి్చందని ఆయన చెప్పారు. 

వెనెజువెలా నుంచి చమురు కొనుగోలు చేసేలా భారత్‌తో అమెరికా చురుగ్గా చర్చలు జరుపుతోందని సంకేతాలిచ్చారు. అయితే చమురు సంబంధిత అంశాలపై ప్రస్తుతం ఇంతకంటే లోతుగా చెప్పదలచుకోలేదన్నారు. శుక్రవారం గోర్‌ ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ‘‘ఒక్క భారత్‌ అనే కాదు, రష్యా నుంచి ఏ దేశమూ చమురు కొనుగోలు చేయొద్దన్నదే అమెరికా స్పష్టమైన వైఖరి. ఈ విషయంలో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చాలా స్పష్టతతో ఉన్నారు. రష్యా చమురు కొనుగోలు చేసే దేశాలతో శాంతి చర్చలకు పూర్తిస్థాయిలో మంగళం పాడాలని ఆయన నిర్ణయించుకున్నారు’’అని తెలిపారు. 

అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అతి త్వరలో భారత్‌లో పర్యటించనున్నట్టు గోర్‌ చెప్పారు. రష్యా చమురు కొనుగోళ్లపై గోర్‌ వ్యాఖ్యలను విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌«దీర్‌ జైస్వాల్‌తో ప్రస్తావించగా, దీనిపై గతంలో విదేశాంగ కార్యదర్శి విక్రం మిస్రీ చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు. చమురు విషయంలో నిత్యం ఒకటికి మించిన దిగుమతి మార్గాలను భారత్‌ అందుబాటులో ఉంచుకుంటుందని గత వారం మిస్రీ స్పష్టం చేయడం తెలిసిందే. ఈ విషయంలో జాతీయ ప్రయోజనాలకే ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఆయన చెప్పారు. 

ఒప్పందంపై 23 నుంచి చర్చలు 
మధ్యంతర వాణిజ్య ఒప్పందం తాలూకు చట్టపరమైన అంశాల ఖరారుకు భారత్, అమెరికా ఉన్నతాధికారుల బృందం సోమవారం చర్చలు జరపనుంది. ఇవి అమెరికాలో మూడు రోజుల పాటు కొనసాగుతాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భారత బృందానికి కేంద్ర వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి దర్పణ్‌ జైన్‌ సారథ్యం వహిస్తున్నారు. చర్చలు పూర్తయి అంతా కొలిక్కి వచ్చిన అనంతరం ఒప్పందంపై మార్చిలో సంతకాలు జరుగుతాయని భావిస్తున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement