నోబెల్ శాంతి బహుమతి కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరాటం అంతా ఇంతా కాదు అందుకోసం ఏదైనా దేశాల మధ్య పంచాయితీ ఉంటే హడావుడిగా వెళ్లి అందులో వేలు పెట్టడం తర్వాత వారి మధ్య పంచాయితీ తానే తెగ్గొట్టానని క్రెడిట్ కొట్టేయడం ట్రంప్‌కు చాలా కామన్‌గా మారింది. ఇప్పటి వరకూ తాను ఎనిమిది యుద్ధాలు ఆపానని అయినా తనను ఎవరూ గుర్తించరని తనకు శాంతి బహుమతి ఇవ్వరని ఆ మధ్య కస్సుబుస్సులాడారు.
ఈ నేపథ్యంలో మరోసారి ఆపరేషన్ సిందూర్ వ్యవహారం తెరమీదకు తెచ్చారు. ఇండియా-పాక్‌ల మధ్య తానే ఆపానని వార్ ఆపకుంటే అధిక పన్నులు విధిస్తానని హెచ్చరించడంతో ఇరు దేశాలు శాంతించాయని తెలిపారు. ఇలా యుద్ధం ఆపాననే ప్రకటనను ట్రంప్ ఇదివరకూ దాదాపు 70 సార్లు పలికాడంటే ఈ విషయంలో ఆయన భారత్‌ను ఎంతగా రెచ్చగొట్టారో అర్థం చేసుకోవచ్చు. అయితే తాజాగా మరోసారి ఆపరేషన్ సిందూర్ అంశం తెరమీదకొచ్చింది.
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమిన్ నెతన్యాహూతో ట్రంప్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఈ ప్రస్థావన తెరమీదకు తెచ్చారు. "ఇదివరకూ నేను ఎనిమిది యుద్ధాలను నియంత్రించాను. ఇండియా, పాకిస్థాన్ విషయంలోనూ అంతే కానీ ఆ క్రెడిట్ నాకు ఇవ్వరూ. . నిజానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ విషయంలో ఆశ్చర్యపోయారు. తాను గత పదేళ్లుగా ప్రయత్నిస్తూన్నా ఇది చేయలేకపోయానన్నారు. నేను మాత్రం ఒక్కరోజులో ఈ యుద్ధాలను ఆపా" అని ట్రంప్ బింకాలు పలికారు.
ట్రంప్ మధ్యవర్తిత్వం అంశంపై భారత్ సైతం ధీటుగా బదులిచ్చింది. ఆపరేషన్ సిందూర్ అంశంలో ఏవరూ మధ్యవర్తిత్వం వహించలేదని భారత విదేశాంగ శాఖ పలుమార్లు ప్రకటించింది. భారత ప్రధాని మోదీ స్వయంగా పార్లమెంటులో ఈ అంశంపై ప్రకటన చేశారు. ఏ ప్రపంచ నాయకుడు ఆపరేషన్ సిందూర్‌ను ఆపమని భారత్‌ను అడగలేదని ఈ నిర్ణయం భారత్ స్వతంత్ర్యంగా తీసుకుందని స్పష్టం చేశారు.
పహల్గామ్ అటాక్‌కు ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఇందులో భాగంగా పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలను వారి దేశంలోనే ధ్వంసం చేసింది.


