సాక్షి తాడేపల్లి: ప్రాజెక్టుల విషయంలో క్యూసెక్కులు, టీఎంసీలకు మధ్య కనీస తేడా సైతం తెలియని వ్యక్తి మంత్రి నిమ్మల రామనాయుడని వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. అలాంటి వ్యక్తికి రాయలసీమ ఎత్తిపోతల పథకం విలువ ఏలా తెలుస్తుందని ప్రశ్నించారు. మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాయలసీమ లిప్టుతో ఎన్ని జీవితాలు ముడిపడి ఉన్నాయన్న విషయం మంత్రికి ఏం తెలుసని ప్రశ్నించారు.
రాయలసీమను ఎడారిగా మార్చబోతే దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ తెచ్చి ఊపిరి పోశారన్నారు. అప్పట్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు పోతిరెడ్డిపాడును అడ్డుకునేందుకు ప్రయత్నించారని చంద్రబాబు ప్రభుత్వానికి రాయలసీమ మీద ఎందుకంత కోపమో తెలియదన్నారు. చంద్రబాబే రాయలసీమకు మరణ శాసనం రాశారని తెలిపారు.1995లో ఆల్మట్టి డ్యాం నిర్మాణాన్ని ఆపలేదు. అప్పటినుంచే చంద్రబాబు రాయలసీమ విషయంలో కుట్రలు జరుపుతున్నారని తెలిపారు.
ఇప్పుడు రాయలసీమ లిఫ్టుపై చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అక్కడి ప్రజలు సహించరన్నారు. ఆల్మట్టి నుండి జూరాలకు నీరు వచ్చేసరికే వాటిని పక్క రాష్ట్రాలు దోచేస్తున్నాయి. శ్రీశైలంలో 800 అడుగులకు నీరు రాకముందే తెలంగాణకు జలాలు వెళుతున్నాయి. ఇక వీటన్నిటిని దాటి ఇక రాయలసీమకు నీరు ఏప్పుడు వస్తుందని ఎమ్మెల్యే ప్రశ్నించారు. శ్రీశైలం ప్రాజెక్టులో కనీసం డేడ్ స్టోరేజీ వాటర్ కూడా ఉండడం లేదు. చంద్రబాబు నిర్లక్ష్యం వలనే రాష్ట్రంలోని ప్రాజెక్టుల పరిస్థితి దారుణంగా మారిందన్నారు.
బ్రహ్మం సాగర్, గండికోట ప్రాజెక్టులను మాజీ సీఎం జగన్ పూర్తి చేశారని ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాయలసీమకు చేసిందేంటని ప్రశ్నించారు. మంత్రి నిమ్మలతో చంద్రబాబు మాట్లాడించిన మాటలను వెంటనే వెనక్కు తీసుకోవాలని రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని సంవత్సరంలో పూర్తి చేయాలని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాయలసీమ ప్రజల ఆవేదనను ముఖ్యమంత్రి చంద్రబాబు అర్థం చేసుకోవాలని తెలిపారు.


