ఢిల్లీలో అల్లర్లు చెలరేగేలా కుట్రకు పాల్పడినట్లు ఆధారాలున్నాయి
సాక్ష్యాధారాల పరిశీలన లేదా సాక్షుల విచారణ తర్వాతే బెయిల్ పిటిషన్ చూస్తాం
ఇతర ఐదుగురు నిందితులకు బెయిల్ మంజూరు
ఢిల్లీలో ‘2020 అల్లర్ల కేసు’లో కీలక తీర్పు వెలువర్చిన సర్వోన్నత న్యాయస్థానం
ఉమర్, ఇమామ్‌లకు బెయిల్ తిరస్కరణపై విపక్షాల పెదవివిరుపు
న్యూఢిల్లీ: ఆరేళ్ల క్రితం దేశ రాజధానిలో 53 మంది మరణాలకు, 700 మందికిపైగా గాయాలపాలు కావడానికి కారణమైన భారీ అల్లర్ల కేసులో నిందితులు, జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) మాజీ విద్యార్థులు ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్‌లకు సుప్రీంకోర్టులో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. వీళ్లకు ఎట్టిపరిస్థితుల్లోనూ బెయిల్ ఇచ్చేది లేదని జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ వీఎన్ అంజారియాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టంచేసింది.
అల్లర్లకు భారీ స్థాయిలో కుట్ర పన్నడం, అమలు చేయడం, అల్లరిమూకలకు మార్గదర్శకం వహించడం, అల్లర్లలో భాగస్వాము లుగా మారడం దాకా ప్రతిదశలో వీళ్ల పాత్ర ఉన్నట్లు తెలిపే బలమైన సాక్ష్యాధారాలు ఉన్న కారణంగా ఖలీద్, ఇమామ్‌ల బెయిల్ అభ్యర్థనను తిరస్కరిస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. ‘‘ ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్‌లకు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాధారాలను పోలీసులు కోర్టుకు సమర్పించారు.
చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక)చట్టం(ఉపా)లోని సెక్షన్ 43డీ(5) ప్రకారం నిందితులపై ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలుంటే బెయిల్‌ను కోర్టు తిరస్కరించవచ్చు. దీని ప్రకారం వీళ్ల బెయిల్ పిటిషన్ తిరస్కరణకు అర్హమైందే. కేసు కీలక దర్యాప్తు, విచారణదశలో ఉన్న ఈ తరుణంలో వీళ్లిద్దరికీ బెయిల్ ఇవ్వడం సముచితం అనిపించుకోదు. కేసు విచారణ ఆలస్యమైనంత మాత్రాన నిందితులకు కొత్తగా ఒనగూరేది ఏమీ ఉండదు. నేరంలో లోతైన ప్రమేయం ఆధారంగా ఏడుగురు నిందితులను ఒకే గాటన కట్టట్లేము. అందుకే ఇతర ఐదుగురు నిందితులైన గుల్ఫిషా ఫాతిమా, మీరన్ హైదర్, షిఫా ఉర్ రెహ్మాన్, మొహమ్మద్ సలీమ్ ఖాన్, షాదాబ్ అహ్మద్‌లకు బెయిల్ ఇస్తున్నాం’’ అని సోమవారం సుప్రీంకోర్టు ప్రకటించింది.
11 షరతులు విధించిన కోర్టు
ఈ సందర్భంగా ఈ ఐదుగురికి కోర్టు 11 షరతులు విధించింది. ‘‘ తలా రూ.2 లక్షల పూచీకత్తుతో వ్యక్తిగత బాండ్ సమర్పించండి. దేశం దాటి ఎక్కడికీ పోవద్దు. ఢిల్లీ ఎన్‌సీఆర్ పరిధిలోనే అధికారులకు అందుబాటులో ఉండాలి. పాస్ట్‌పోర్ట్‌లను అధికారులకు ఇచ్చేయాలి. ఢిల్లీ జైసింగ్ మార్గ్ పోలీస్‌స్టేషన్‌కు ప్రతి సోమ, గురువారాలు వచ్చి సంతకాలు చేసి వెళ్లాలి. మీరు ఉండబోయే ఇంటి అడ్రస్, వాడబోయే ఫోన్ నంబర్, ఈమెయిల్‌లను దర్యాప్తు అధికారులకు ఇవ్వాలి. కేసు పూర్తయ్యేదాకా కేసు వివరాలు ఎక్కడా ఎవరితో పంచుకోవద్దు. ప్రచారసభల్లో ప్రసంగాలు చేయొద్దు. భౌతికంగా, ఎలక్ట్రానిక్ వస్తువులు, మాధ్యమాల్లో ఎలాంటి అంశాలను ప్రచారంలోకి తేవొద్దు’’ అని కోర్టు వాళ్లకు సూచించింది.
వీళ్లది కీలక పాత్ర..
‘‘ ఉమర్ ఖలీద్, ఇమామ్‌లు భారీ కుట్రలో కీలక భాగస్వాములుగా ఉన్నారు. వ్యూహరచన, అల్లరిమూకలను రెచ్చగొట్టడం, లక్షిత ప్రాంతాల్లో గుమిగూడేలా చేయడం, ప్రణాళిక అమలులో వీళ్ల పాత్ర ఉందని ప్రాథమిక సాక్ష్యాధారాలు స్పష్టంచేస్తున్నాయి. ట్రంప్ పర్యటన సందర్భంగా జనం రోడ్లమీదకొచ్చి రాస్తారోకోలు, ధర్నాలు చేసేలా ఫిబ్రవరి 24, 25 తేదీల్లో ఖలీద్ విద్వేషపూరిత ప్రసంగాలిచ్చాడు. భారత్‌లో మైనార్టీలు హింసకు బలవుతున్నారనే వాదనలు నిజమని అంతర్జాతీయ సమాజం విశ్వసించేలా ప్రసంగాలిచ్చారు. జేఎన్‌యూ వర్సిటీలో ముస్లిం స్టూడెంట్స్ ఆఫ్ జేఎన్‌యూ వాట్సాప్ గ్రూప్ సృష్టించి అందర్నీ సమీకరించాడు. ఇతని పాత్ర ఒక్క ఢిల్లీకే పరిమితం కాలేదు. జనాన్ని పోగేసేందుకు అలీగఢ్, ఇతర ప్రాంతాల్లోనూ పర్యటించాడు’’ అని ధర్మాసనం తన తీర్పులో పలు అంశాలను ప్రస్తావించింది.
గుల్ఫిషా ఫాతిమా పాత్రపై..
‘‘ఇక మరో నిందితురాలు గుల్ఫిషా ఫాతిమా.. స్థానిక మహిళలను పోగేసి నిరసన ప్రదర్శనల ప్రాంతాలకు తరలించారని, ఉద్యమ సంబంధ వస్తువుల సేకరణకు సాయపడ్డారని చేసిన వాదనల్లో పస లేదు. అందుకే ఆమెకు బెయిల్ ఇస్తున్నాం’’ అని కోర్టు స్పష్టంచేసింది. పౌరసత్వ సవరణచట్టం–2020, జాతీయ పౌరపట్టీ (ఎన్‌ఆర్‌సీ)లను తీవ్రంగా వ్యతిరేకిస్తూ చట్టవ్య తిరేక విద్వేషక ప్రసంగాలు చేశారన్న ఆరోపణలపై ఇమామ్‌ను పోలీసులు 2020 జనవరి 28వ తేదీన, సెప్టెంబర్ 13వ తేదీన ఖలీద్‌ను అరెస్ట్‌చేశారు.
ఈ కేసులో బెయిల్ కుదరదని ఢిల్లీ హైకోర్టు గత ఏడాది సెప్టెంబర్ రెండో తేదీన ఇచ్చిన తీర్పును ఖలీద్, ఉమర్‌తోపాటు మరో ఐదుగురు నిందితులు సుప్రీంకోర్టులో సవాల్ చేయగా గత ఏడాది డిసెంబర్‌లో వాదనలు పూర్తయ్యాయి. నిందితుల తరఫున కపిల్ సిబల్, అభిషేక్ సింఘ్వీ, సిద్ధార్థ దవే, సల్మాన్ ఖుర్షీద్, సిద్ధార్థ్ లూథ్రా హాజరై వాదనలు వినిపించారు. ఢిల్లీ పోలీసుల తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వీ రాజు వాదనలు వినిపించగా తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం గత ఏడాది డిసెంబర్ 10వ తేదీన రిజర్వ్‌చేసి సోమవారం తీర్పును వెలువర్చింది.
సాక్ష్యాధారాల పరిశీలన, సాక్షుల విచారణ తర్వాత లేదా ఏడాది తర్వాత ఉమర్, ఇమామ్‌లు తాజాగా బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ధర్మాసనం సూచించింది. ఉత్తర ఢిల్లీలో 2020 ఫిబ్రవరిలో జరిగిన అల్లర్ల వెనుక ముందస్తు ప్రణాళిక దాగి ఉందని, ఇలాంటి వ్యూహరచన, అమలు అనేవి దేశ సార్వభౌమత్వంపై దాడి అని ఢిల్లీ పోలీసులు విచారణ సందర్భంగా వాదించారు. అందుకే అత్యంత కఠినమైన ఉపా, భారత శిక్షాస్మృతి సెక్షన్ల కింద కేసు నమోదుచేశామని వాదించారు.
అదృష్టం లేదంతే
బెయిల్ తిరస్కృతిపై ఖలీద్ తండ్రి ఆవేదన
న్యూఢిల్లీ: ఉమర్ ఖలీద్‌కు బెయిల్ రాకపోవడంపై అతని తండ్రి ఎస్‌క్యూఆర్ లియాస్ ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘ తీర్పు కాపీ అందరికీ అందుబాటులోనే ఉంది. దీనిపై నేను కొత్తగా చెప్పేదేం లేదు. ఖలీద్ విషయంలో మాకు అదృష్టం లేదంతే. ఇది నిజంగా దురదృష్టకరం’’ అని వ్యాఖ్యానించారు.
ఇకపై ఇదే నా కొత్త జీవితం..
తీర్పుపై ఖలీద్ సహచరిణి బానోజ్యోత్స్న లాహిరి ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. అతనికి బెయిల్ రాకపోయినా తన తోటి వాళ్లు బెయిల్‌పై విడుదల అవుతున్నందుకు ఖలీద్ సంతోషం వ్యక్తం చేశాడని బానోజ్యోత్స్న వెల్లడించారు. ‘‘ బెయిల్ కనీసం వాళ్లకయినా వచి్చందికదా. సంతోషం. నాకెంతో తృప్తిగా ఉంది’’ అని ఖలీద్ అన్నారు. దీనికి స్పందనగా ‘‘ నేను రేపు వచ్చి జైలులో నీతో ములాఖత్ అవుతాను’’ అని జ్యోత్స్న సమాధానం ఇచ్చారు. దీనికి స్పందనగా ఖలీద్ ‘‘ మంచి పని. వచ్చేసెయ్. ఇకపై ఇదే నా కొత్త జీవితం’’ అని వ్యాఖ్యానించాడు.
ఆయనకు 15 సార్లు ఎలా?
ఉమర్ ఖలీద్, ఇమామ్‌ల బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ సుప్రీంకోర్టు వెలువ ర్చిన తీర్పుపై విపక్ష నేతలు అసహనం వ్యక్తంచేశారు. ఈ మేరకు సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిటాస్ తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ ఖాతాలో ఒక పోస్ట్‌పె ట్టారు. ‘‘ వీలైనంత వరకు నిందితులకు బెయిల్ ఇచ్చేందుకే చూడాలి. తప్పనిసరి పరిస్థితుల్లోనే జైలుకు పంపాలి అనే సూత్రం అందరికీ ఒకేలా వర్తించబోదని నేడు సుప్రీం తీర్పుతో అర్థమైంది. ఈ కేసులో విచారణ ఇంకా మొదలుకాలేదు. అయినాసరే కఠిన ఉపా చట్టం కింద ఉమర్‌ఖలీద్‌ను ఐదేళ్లుగా కారాగార చీకటికొట్టంలో పడేశారు. ఇది విచారణకు ముందే జైలుశిక్ష అమలుచేయడం కాదా?.
మహిళా భక్తులపై రేప్, హత్య కేసులో 2017లోనే 20 ఏళ్ల శిక్షపడిన డేరాసచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రాంరహీం సింగ్‌కు మరోసారి తాత్కాలిక జైలుశిక్ష నిలుపుదల(పెరోల్) అవకాశం కల్పించారు. ఇప్పటికి ఆయన ఇలా 15 సార్లు పెరోల్‌మీద బయటికొచ్చాడు. ఒకరికి ఒక న్యాయం, మరొకరికి మరో న్యాయమా. ఒకరు(ఖలీద్) నిరవధికంగా జైళ్లో మగ్గిపోతుంటే మరొకరు(గుర్మీత్ బాబా) బయట డిమాండ్‌కు తగ్గట్లు ఎప్పటికప్పుడు జైలు నుంచి సెలవుల మీద విడుదలై సంతోషంగా గడుపుతున్నారు’’ అని జాన్ బ్రిటాస్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తీర్పును బీజేపీ స్వాగతించింది. సత్యమేవ జయతే అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ‘ఎక్స్’లో ఒక పోస్ట్ పెట్టారు. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా సైతం తీర్పుపై సంతోషం వ్యక్తంచేశారు.


