మరో ఆరునెలల్లో.. ప్రపంచం చూపు మొత్తం అటు వైపే ఉండబోతోంది. వేలాది మందితో అక్కడ కోలాహలం కనిపించనుంది. వీవీఐపీల రాక నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాటు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈలోపు.. సంచుల్లో వందల సంఖ్యలో మృతదేహాలు బయటపడ్డాయన్న విషయం కలవరపాటుకు గురి చేస్తోంది.
ఈ పరిణామాల చోటు చేసుకుంటోంది ఎక్కడో కాదు.. మరో ఆరు నెలల్లో ఫుట్‌బాల్ సంబురం ఫిఫా వరల్డ్ కప్ జరగబోయే మెక్సికోలోని ఓ స్టేడియం దగ్గర్లో. జలిస్కో స్టేట్ గ్వాడలజారా(Guadalajara) ఎస్టాడియో అక్రోన్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో శవాల సంచులు బయటపడుతున్నాయి. స్టేడియం నిర్మాణ పనుల నేపథ్యంలో.. ఈ విషయం బయటకు రావడంతో భద్రతా ఆందోళనలు పెరుగుతున్నాయి. అయితే..
ఇవేం ఒక్కసారిగా బయటపడ్డవేం కాదు. 2022 నుంచి గతేడాది డిసెంబర్ మొదటి వారంలోపు.. మొత్తం 456 మృతదేహాల అవశేషాలను అదీ సంచుల్లోనే గుర్తించారు. స్టేడియానికి 10 నుంచి 20 కి.మీ దూరంలో ఉన్న లాస్ అగుజాస్, జపోపాన్, ట్లాక్వేపాక్ ప్రాంతాల్లో ఇవి బయటపడ్డాయి. ఇందులో ఒక్క లాస్ అగుజాస్ ప్రాంతంలోనే 290 సంచులు బయటపడ్డాయట!.

2025 నాటికి మెక్సికోలో 1,30,000 మిస్సింగ్ కేసులు నమోదు అయ్యాయి. జలిస్కో రాష్ట్రం అదృశ్యాల సంఖ్యలో దేశంలో అగ్రస్థానంలో ఉంది. అయితే.. లోకల్ ఏజెన్సీల ప్రకారం ఈ అవశేషాలు నేర గుంపులు (కార్టెల్స్) చేసిన పనేనట. అందునా మెక్సికోలోనే అత్యంత శక్తివంతమైన న్యూ జనరేషన్ కార్టెల్ (CJNG) కారణంగానే ఈ మిస్సింగ్‌లు, హత్యలు జరిగినవని అంచనా వేస్తున్నారు.
2026 వరల్డ్ కప్ వేదికగా ఉన్న మెక్సికోలోని ఎస్టాడియో అక్రోన్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో 456 సంచుల్లో మానవ అవశేషాలు బయటపడటం.. అక్కడి భద్రతా పరిస్థితులపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అయితే ఈ వ్యవహారం అధికారుల స్పందన మరోలా ఉంది. ఆటగాళ్లు, ప్రేక్షకుల భద్రతకు వచ్చిన ముప్పేమీ లేదని అంటున్నారు. స్టేడియం పరిసరాల్లో ఇప్పటికే ఉన్నవి కాకుండా.. అదనంగా 3,000 సీసీ కెమెరాలు, ఆర్మర్డ్ వాహనాలు, మెటల్ డిటెక్టర్లు, నేషనల్ గార్డ్ బలగాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఎస్టాడియో అక్రోన్ స్టేడియం 2026 వరల్డ్ కప్‌లో నాలుగు గ్రూప్ మ్యాచ్‌లు నిర్వహించనుంది. మెక్సికో రెండో గ్రూప్ మ్యాచ్ కూడా ఇక్కడే జరగనుంది. అయితే సంచుల్లో మృతదేహాలు బయటపడిన ఈ పరిస్థితుల్లో ఇక్కడ వరల్డ్ కప్ నిర్వహించడంపై అంతర్జాతీయ సమాజం నుంచి ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇది ఎలాంటి పరిణామానికి దారి తీస్తుందో చూడాలి.


