అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేరు మారు మోగిపోతుంది. వెనెజువెలా అధ్యక్షున్ని ఆయన దేశంలోనే నిర్భంధించి అమెరికా జైల్లో పడేయడంతో.. ట్రంప్ మాటలే కాదు చేతలూ చేయగలడని అంతా అనుకుంటున్నారు. దీంతో అమెరికా అధ్యక్షుడి నెక్స్ట్ టార్గెట్ ఏ దేశమా? అనే చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఆర్థిక వేత్త జెప్రీ సాచస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ నెక్స్ట్ టార్గెట్ ఇరానే అయి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. ఒకవేళ అదే జరిగితే పరిస్థితులు చాలా భయంకరంగా ఉండే అవకాశం ఉందన్నారు.
ట్రంప్ రెండవసారి అధికారం చేపట్టినాటి నుంచి అమెరికాతో సత్సంబంధాలు లేకున్నా ఆ దేశానికి వ్యతిరేకంగా ఉన్నా అస్సలు సహించడం లేదు. 'మేక్ అమెరికా గ్రేట్ ఎగేన్' అనే భావనతో చాలా దేశాలతో కయ్యానికి కాలు దువ్వుతున్నారు. అధిక పన్నులు వేయడంతో పాటు ప్రత్యక్ష యుద్దాలకు వెనుకాడడం లేదు. తనకు అనుకూలంగా లేని దేశాలను ఇన్ని రోజులు మాటలతో హెచ్చరించిన ట్రంప్ తాజాగా తన సత్తా ఎంటో చూపాడు. అమెరికాకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారనే నెపంతో వెనిజువెలా అధ్యక్షుడిని బంధించి అమెరికా తీసుకు వచ్చారు. ఈ నేపథ్యంలో తన నెక్స్ట్ టార్గెట్ ఇరాన్ దేశం అయి ఉండవచ్చని ప్రముఖ ఆర్థిక వేత్త జేప్రీసాచ్స్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఆయన ఏమన్నారంటే.. "ప్రస్తుతం ట్రంప్ అవుట్ ఆఫ్ కంట్రోల్‌లో ఉన్నారు. ఆయన మెుదటిసారి అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే ‘‘నేను వెనెజువెలాపై ఎందుకు దాడి చేయకూడదు’’ అని అనుకున్నారు. అంటే ఆ భావన ఎప్పటి నుంచో ఆయనలో ఉందన్నమాట. అయితే ఇటీవల జరిగిన కొత్త సంవత్సర వేడుకలో ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహుతో కలిసి ‘‘ఇరాన్.. నెక్స్ట్ నువ్వే’’ అన్నారు. బహుశా ట్రంప్ తదుపరి టార్గెట్ ఇరానే అయి ఉండవచ్చు. ఒకవేళ అదే జరిగితే పరిస్థితులు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. ఇరాన్ వద్ద అత్యాధునిక హైపర్ సోనిక్ మిసైల్స్ ఉండడంతో పాటు ఆ దేశానికి ప్రధాన శక్తుల అండ ఉంది. ఇది ప్రపంచ వినాశనానికి దారి తీయవచ్చు" అని ఆయన అన్నారు.
అమెరికా విదేశాంగ విధానాన్ని అక్కడే పెంటగాన్ నడిపిస్తోంది అన్నారు. అదేవిధంగా యూఎస్ కంటే ఇజ్రాయెల్ మరింత ప్రమాదకరమైన దేశమన్నారు. ఇండియా నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జెప్రీ సాచస్ పైన పేర్కొన్న వివరాలు పంచుకున్నారు.
కాగా గతేదాడి ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం జరగగా అమెరికా మధ్యలో ఎంట్రీ ఇచ్చింది. ఆదేశానికి చెందిన బి-2 స్పిరిట్ బాంబర్లతో ఇరాన్‌లోని అణుకేంద్రాలపై దాడులు నిర్వహించింది. దీనికి ప్రతీకారంగా ఖతార్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు చేసింది. తర్వాత ట్రంప్ ఎంట్రీతో తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అయితే అణు ఒప్పంద విషయంలో మాత్రం ట్రంప్ ఇరాన్‌పై ఇంకా అసంతృప్తితోనే రగిలిపోతున్నారు.


