ధర రూ. 13.89 లక్షల నుంచి ప్రారంభం
జైసల్మేర్: ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా తాజాగా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో ఈవీని (ఎలక్ట్రికల్) ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 13.89 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో ఐసీఈ వెర్షన్‌ని 2024 ఏప్రిల్‌లో ప్రవేశపెట్టింది. ఎలక్ట్రిక్ వెర్షన్ 285 కి.మీ. రేంజినిస్తుంది. మరోవైపు, సెవెన్ సీటర్ ఎక్స్‌యూవీ 7ఎక్స్‌వోని కూడా ఆవిష్కరించింది. దీని ధర రూ. 13.66 లక్షల నుంచి రూ. 24.11 లక్షల వరకు (ఎక్స్‌షోరూం) ఉంటుంది.
ఇది ఎక్స్‌యూవీ 700కి కొత్త వెర్షన్. ఎక్స్‌యూవీ 700 అమ్మకాలు ప్రతి నెలా సుమారు 7,000 యూనిట్లుగా ఉండగా, 7ఎక్స్‌వో రాకతో విక్రయాలు దాదాపు 30 శాతం పెరగొచ్చని అంచనా వేస్తున్నట్లు మహీంద్రా అండ్ మహీంద్రా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేశ్ జెజూరికర్ తెలిపారు. కొత్త ఉత్పత్తులు, వేరియంట్లతో ఈ ఏడాది అమ్మకాలు మరింతగా వృద్ధి చెందుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గతేడాది బొలెరో, బొలెరో నియో కొత్త వెర్షన్లను ప్రవేశపెట్టగా, ఈసారి ఎక్స్‌యూవీ 7ఎక్స్‌వో, ఎలక్ట్రిక్ ఎక్స్‌ఈవీ 9ఎస్ దన్నుతో విక్రయాలు మరింత పెరుగుతాయని చెప్పారు. జీఎస్‌టీ తగ్గింపు ప్రభావం కార్లతో పాటు చిన్న కమర్షియల్ వాహనాలపైనా సానుకూల ప్రభావం చూపినట్లు రాజేశ్ తెలిపారు.
పరిశీలనలో రేట్ల పెంపు
కమోడిటీల రేట్లు పెరగడం, డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ క్షీణించడం తదితర పరిణామాల నేపథ్యంలో వాహనాల రేట్ల పెంపు అవకాశాలను పరిశీలిస్తున్నట్లు రాజేశ్ తెలిపారు. పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని, వచ్చే కొద్ది వారాల్లో దీనిపై నిర్ణయం తీసుకోవచ్చని వివరించారు. ఇప్పటికే హుందాయ్, బీవైడీ, జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటర్స్ మొదలైనవి జనవరి నుంచి రేట్ల పెంపు ప్రకటించాయి. అటు మెర్సిడెస్ బెంజ్ ఇండియా, బీఎండబ్ల్యూ ఇండియా తదితర దిగ్గజాలు కూడా రేట్ల పెంపును పరిశీలిస్తున్నాయి.


