డ్రైవర్ల బిహేవియర్ ప్రొఫైల్స్ సిద్ధం చేయాలని కేంద్రం నిర్ణయం
ఏఐ టెక్నాలజీతో రూపకల్పనకు మార్గదర్శకాలు జారీ
నిర్లక్ష్యపూరిత డ్రైవర్లపై కఠిన చర్యలకు కసరత్తు
జాతీయ రహదారి భద్రత ప్రణాళిక–2030 ఖరారు
సాక్షి, అమరావతి: రోడ్డు ప్రమాదాలతో దేశంలో ఏటా 1.6లక్షల మంది దుర్మరణం చెందుతున్నారు. అందులో 80 శాతం ప్రమాదాలకు డ్రైవర్ల తప్పిదాలే ప్రధాన కారణం. అందుకే నిర్లక్ష్యపూరితంగా డ్రైవింగ్ చేసేవారిపై కొరడా ఝుళిపించేందుకు కేంద్ర రవాణా శాఖ సిద్ధమవుతోంది. నిర్లక్ష్యపూరిత డ్రైవర్లను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సాంకేతికతతో కట్టడి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. జాతీయ రహదారుల నిర్మాణ లోపాలకు బాధ్యులైన కాంట్రాక్టు సంస్థలపై కూడా కఠిన చర్యలు చేపట్టాలని నిర్ణయించింది.
ఈ మేరకు జాతీయ రహదారి భద్రత ప్రణాళిక–2030ను కేంద్ర రవాణా శాఖ ప్రకటించింది. రోడ్డు ప్రమాదాలను కనిష్ట స్థాయికి తగ్గించేందుకు యూకే, సింగపూర్ దేశాల్లో అమలు చేస్తున్న డ్రైవర్ల బిహేవియర్ డేటా ట్రాకింగ్ వ్యవస్థను మన దేశంలో ప్రవేశపెడతామని తెలిపింది. ఇందుకనుగుణంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలను జారీ చేసింది.
జాతీయ రహదారి భద్రత ప్రణాళికలో కొన్ని ముఖ్యాంశాలు...
» నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసేవారికి కేవలం జరిమానాలు విధించడంతో సరిపెట్టకూడదని కేంద్రం స్పష్టం చేసింది. పదేపదే నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం అలవాటుగా మారిన వాళ్లకు ‘డేంజరస్ డ్రైవింగ్ బిహేవియర్’ అనే కేటగిరీ కింద చేర్చాలని ఆదేశించింది. అందుకోసం పోలీసు, రవాణా, అటవీ, ఎన్‌హెచ్‌ఏఐ తదితర విభాగాలు రహదారులపై నెలకొల్పే సీసీ కెమెరాల ఫుటేజీలు, ఈ–చలానా డేటాను అధ్యయనం చేస్తారు.
» ‘డేంజరస్ డ్రైవింగ్ బిహేవియర్’ కేటగిరీలో చేర్చినవారు మానసిక నిపుణులు, ఇతర నిపుణుల వద్ద కౌన్సెలింగ్‌కు హాజరుకావాల్సి ఉంటుంది. అయినా సరే నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ కొనసాగించినట్టు నిర్ధారణ అయితే వారి డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేస్తారు. ఈ డ్రైవర్ల ప్రొఫైళ్లను వ్యక్తిగత బీమా, వాహన బీమా సంస్థల డేటాతో అనుసంధానిస్తారు.
» రోడ్డు ప్రమాదాలకు రహదారుల నిర్మాణ లోపాలే కారణమని నిర్ధారణ అయితే సంబంధిత కాంట్రాక్టు సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటారు. ప్రమాదాలపై దర్యాప్తు నివేదిక ఆధారంగా ఈ చర్యలు ఉంటాయి.
» డ్రైవర్ల ప్రొఫైల్స్‌ను రూపొందించి వారి డాటా ట్రాకింగ్ విధానాన్ని ఎంపిక చేసిన రాష్ట్రాల్లో 2026లో మొదలు పెడతారు. 2030నాటికి దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్ర రవాణాశాఖ నిర్ణయించింది.


