సాక్షి, ఢిల్లీ: జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు రామచందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోనే ఏపీ, తెలంగాణలో ఎస్సీలపై దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తాజా ఉదంతాలను ప్రస్తావిస్తూ సోమవారం ఆయన ఢిల్లీలో సాక్షితో మాట్లాడుతూ..
తెలుగు రాష్ట్రాల్లో దళితులపై అధిక దాడులు జరుగుతున్నాయి. దళితులను పోలీసు వ్యవస్థ చిన్న చూపు చూస్తూ అమానుషంగా వ్యవహరిస్తోంది. ఆంధ్రప్రదేశ్ తెనాలిలో ఓ దళితుడిని పోలీసుల రౌడీల్లాగా పాశవికంగా కొట్టారు. ఈ ఘటనపై డీజీపీ ఇప్పటికైనా విచారణ జరిపి పూర్తి నివేదిక పంపాలి. అమరావతిలో దళితుల డీకే పట్టా భూముల విషయంలోనూ దారుణంగా వ్యవహరిస్తున్నారు. భూముల రేట్లు పెరిగిన తర్వాత.. వ్యవసాయం చేయడం లేదనే సాకుతో భూమి లాక్కుంటున్నారు. దీనిపై 85 ఫిర్యాదులు వచ్చాయి వాటిపై విచారణ చేస్తున్నాం. ఇప్పటిదాకా 35 ఎకరాలు భూమి బలవంతంగా తీసుకున్నారు. దానికి ఖచ్చితంగా నష్టపరిహారం ఇవ్వాలి..
తెలంగాణ కోదాడలో దళిత యువకుడు కర్ల రాజేష్ లాకప్ డెత్‌పై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి కేసు దర్యాప్తు చేయాలి. ఈ ఘటనలో రీపోస్ట్‌మార్టం జరిగింది. సీఐ సస్పెన్షన్ తో సరిపోదు. ఖచ్చితంగా కేసు పెట్టాల్సిందే అని అన్నారాయన.


