సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ మండిపడ్డారు. సోమవారం ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గంజాయి, మద్యంతో యువత జీవితాలను రోడ్డున పడేశారని.. అనధికార క్లబ్‌లు నిర్వహిస్తూ కోట్ల బిజినెస్ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘2014-19లో కాల్ మనీ రాకెట్‌తో మహిళల జీవితాలను నాశనం చేశారు. ఇప్పుడు విచ్చవిడిగా ఏపీలో క్యాసినోలను నిర్వహిస్తున్నారు. మ్యాంగో బే కల్చరల్ అండ్ రిక్రియేషన్ సొసైటీ వెనుక కూటమి పెద్దల పాత్ర ఉంది. హైకోర్టు అనుమతి ఉందంటూ బోర్డులు కూడా పెట్టారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పోలీసులు, మీడియాను కూడా లోపలకు రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. 108 అంబులెన్స్‌ను కూడా పేకాట క్లబ్ దగ్గర ఏర్పాటు చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు’’ అని శివశంకర్ పేర్కొన్నారు.
‘‘ఇతర రాష్ట్రాల నుంచి కూడా పేకాట కోసం ఏపీకి వస్తున్నారు. ఈ క్లబ్ వెనుక మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. వారందరి వివరాలను ప్రభుత్వం బయట పెట్టాలి. పది వేలు, యాభై వేలు, లక్ష చొప్పున మూడు జోన్లగా విభిజించి మరీ పేకాట ఆడిస్తున్నారు. ఆ పక్కన కుటుంబాల వారు చాలాకాలంగా పేకాట ఆడుతున్నారని ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదు. ప్రభుత్వ పెద్దలు ప్రత్యేక విమానాల్లో విలాసాలు చేస్తుంటే.. ఎమ్మెల్యేలు, మంత్రులు పేకాట ఆడిస్తూ డబ్బు దోచుకుంటున్నారు. ఈ పేకాట క్లబ్‌లపై విచారణ జరిపించాలి’’ అని శివశంకర్ డిమాండ్ చేశారు.


