మున్సిపల్ స్కూల్‌లో చిత్తుపేపర్లు అంటుకుని విద్యార్థినికి మంటలు
నారాయణ స్కూల్‌లో ఫ్యాన్ ఊడిపడి ముగ్గురు విద్యార్థులకు గాయాలు
కర్నూలు సిటీ: కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల భద్రతను విద్యాశాఖ అధికారులు గాలికొదిలేశారనే విమర్శలకు బలం చేకూరుస్తూ రెండు ఘటనలు చోటుచేసుకున్నాయి. కర్నూలు నగరంలోని మున్సిపల్ స్కూల్‌లో చిత్తుపేపర్లకు పెట్టిన మంటల వల్ల ఓ చిన్నారి తీవ్రంగా గాయపడింది. ఇదే సందర్భంలో నారాయణ ఇంగ్లిష్ మీడియం స్కూల్‌లో ఫ్యాన్ ఊడిపడటంతో ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ రెండు ఘటలు సోమవారం చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.
కర్నూలు బండిమెట్టలో ఒకే ప్రాంగణంలో మున్సిపల్ ప్రైమరీ స్కూల్, అంగన్‌వాడీ కేంద్రంతోపాటు హైస్కూల్ ఉన్నాయి. ప్రైమరీ స్కూల్‌లో బాబు షేక్, హసీనా బీ దంపతుల కుమార్తె షేక్ హీనా (9) 3వ తరగతి చదువుతోంది. సోమవారం మధ్యాహ్నం పాఠశాల ఆవరణలో హైసూ్కల్‌కు నూతన భవనాన్ని నిర్మించేందుకు గత ప్రభుత్వ హయాంలో పనులు మొదలు పెట్టగా.. కూటమి ప్రభుత్వం పనులు నిలిపివేసింది. దీంతో పిల్లర్లకే పరిమితమైన చోట చిత్తుపేపర్లకు ఓ విద్యార్థి నిప్పంటించాడు.
ఆ సమయంలో నిప్పును చిన్నపుల్లతో పైకి ఎత్తగా ఆ నిప్పుతో కూడిన మంట హీనా దుస్తులకు అంటుకున్నాయి. మంటలతో హీనా కేకలు వేసుకుంటూ స్కూల్ బయటకు పరిగెత్తడంతో స్థానికులు గమనించి మంటలను ఆర్పివేశారు. చికిత్స కోసం జనరల్ హాస్పిటల్‌కు తరలించారు. విషయం మంగళవారం బయటికి రావడంతో ఎంఈఓ రెహ్మాన్ స్కూల్‌కి వెళ్లి విచారణ జరిపారు. హీనాను డీఈఓ ఎల్.సుధాకర్ పరామర్శించారు. అనంతరం హెచ్‌ఎం మీనిగ ఆనందం జాన్సన్‌ను సస్పెండ్ చేసి, ఎంఈఓ రెహ్మాన్‌కు సైతం షోకాజ్ నోటీసులు ఇచ్చారు.
ఫ్యాన్ ఊడిపడి గాయాలు
కర్నూలు మాధవనగర్‌లోని నారాయణ ఇంగ్లిష్ మీడియం హైసూ్కల్‌లో ఫ్యాన్ ఊడి 7వ తరగతి విద్యార్థులపై పడింది. ఘటనలో ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఇందులో సాయి చరణ్ కంటికిపై భాగంలో ఫ్యాన్ రెక్క తగిలింది. సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించి ఇంటికి పంపించారు. స్వల్ప గాయాలైన పిల్లలను సైతం ఇంటికి పంపించడం గమనార్హం. దీనిపై విద్యా శాఖ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు దారితీసింది.


