చివరి మజిలీ.. కన్నీళ్లు మిగిల్చె.. | Inhumane incident at Bapatla District Area Hospital | Sakshi
Sakshi News home page

చివరి మజిలీ.. కన్నీళ్లు మిగిల్చె..

Feb 11 2026 5:21 AM | Updated on Feb 11 2026 5:21 AM

Inhumane incident at Bapatla District Area Hospital

నాగేశ్‌ మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్తున్న బంధువులు

బాపట్ల జిల్లా ఏరియా ఆస్పత్రిలో అమానవీయ ఘటన 

ప్రభుత్వాస్పత్రిలో మహాప్రస్థానం వాహనం లేక బైక్‌పైనే మృతదేహం తరలింపు 

కర్లపాలెం: ప్రభుత్వ ఆస్పత్రుల నుంచి శవాలను తీసుకెళ్లడానికి పేదలు పడే బాధలు వర్ణనాతీతంగా మారుతున్నాయి. మంగళవారం బాపట్ల జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిలో అమాననీయ ఘటన చోటు చేసుకుంది. బాపట్ల జిల్లా చింతాయపాలెం గ్రామానికి చెందిన నక్కా నాగేశ్‌(55) అలియాస్‌ నాగేశ్వరరావు మంగళవారం ఉదయం భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. 

వెంటనే కుటుంబ సభ్యులు బైక్‌పై బాపట్ల ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ నాగేశ్‌ను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని నిర్ధారించారు. దీంతో మృతదేహాన్ని చింతాయపాలెం తరలించేందుకు బాపట్ల ఏరియా ఆస్పత్రిలో మహాప్రస్థానం వాహనం కావాలని అడిగారు.

వాహనం లేకపోవడంతో ఓ ఆటోవాలాను సంప్రదించగా రూ.3 వేలు కిరాయి అడగడంతో.. అంత డబ్బు వారి వద్ద లేక నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. విధి లేని పరిస్థితుల్లో మృతదేహాన్ని మోటారు బైక్‌పైనే కూర్చోబెట్టుకుని 13 కిలోమీటర్ల మేర ప్రయాణించి గ్రామానికి తీసుకెళ్లారు. మృతిచెందిన నాగేశ్‌కు భార్యతో పాటు ఇద్దరు కూతుర్లు, కుమారుడు ఉన్నారు. 

మహాప్రస్థానం కోసం ప్రతిపాదనలు పంపాం: జిల్లా కలెక్టర్‌ 
మృతదేహాన్ని మోటారు బైక్‌పై తీసుకెళ్లిన ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో జిల్లా కలెక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి సమగ్ర విచారణ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement