శ్రీశైలంలో ప్రభుత్వ యంత్రాంగం ఘోరవైఫల్యం
వరుసగా ఆలయాల్లో విషాద ఘటనలు
ఆలయాలకు వెళ్లే భక్తుల్లో తీవ్ర భయాందోళనలు
భక్తులకు కనీస ఏర్పాట్లు చేయడంలో టీడీపీ సర్కార్ విఫలం
సనాతన ధర్మం గురించి మాట్లాడే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మౌనం వహిస్తే బాధ్యత ఎవరు తీసుకుంటారు? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు
‘ఎక్స్’ వేదికగా చంద్రబాబు సర్కార్‌ను నిలదీసిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ పాలనలో శ్రీశైలంలో శివమాల ధారణ చేసిన భక్తులపై పోలీసులు విచక్షణరహితంగా లాఠీచార్జ్ చేయడం దుర్మార్గం, బాధాకరమని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన రూపంలో ప్రభుత్వ యంత్రాంగం ఘోర వైఫల్యం బయటపడిందన్నారు. దురదృష్టవశాత్తూ చంద్రబాబు నీచ రాజకీయాలు పవిత్ర ఆలయాల ప్రాంగణాల్లోకే చొరబడుతున్నాయని ఎత్తిచూపారు. తిరుమల లడ్డూనూ పదే పదే వివాదాల్లోకి లాగి, రాజకీయ లాభం పొందే ప్రయత్నం చేయడంతో కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని.. ఆలయ ప్రతిష్ఠకు భంగం కలిగిందని.. ఈ ధోరణి ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాలకూ వ్యాపిస్తోందని వివరించారు.
శ్రీశైలంలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడి, చివరకు పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు తిన్నప్పటికీ.. సనాతన ధర్మం గురించి మాట్లాడే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లు, మౌనం వహిస్తే, బాధ్యత ఎవరు తీసుకుంటారు? అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారని ‘ఎక్స్’లో తన ఖాతాలో వైఎస్ జగన్ మంగళవారం పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే..
‘‘ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ పాలనలో శివమాల ధారణ చేసిన భక్తులపై పోలీసులు విచక్షణ రహితంగా లాఠీచార్జ్ చేయడం బాధాకరం. చంద్రబాబునాయుడు గారి నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఆలయాలకు వెళ్లే భక్తులు భయకంపితులవుతున్నారు. ఒకప్పుడు భక్తితో, నమ్మకంతో తీర్థయాత్రలు చేసిన భక్తులు, ఇప్పుడు ఆందోళనతో, అనిశ్చితితో ఆలయాలకు వస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబుగారి పాలనలో చోటుచేసుకుంటున్న వరుస ఘటనలు, వైఫల్యాలు అత్యంత బాధ కలిగిస్తున్నాయి. నివారించగలిగిన ఘటనలు అయినప్పటికీ, ప్రభుత్వం విఫలంకావడం వ్యవస్థలపై భక్తులకున్న విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేస్తోంది. ఇంత జరిగినా టీడీపీ ప్రభుత్వం స్పందిస్తున్న తీరు దారుణంగా ఉంది.
కేవలం ప్రచార విన్యాసాలు, ఘటన తర్వాత జరిగే రొటీన్ సమీక్షలకే ప్రభుత్వం పరిమితమవుతోంది. జవాబుదారీతనం, బాధ్యత అన్నవి ఈ ప్రభుత్వంలో ఎక్కడా కనిపించడం లేదు. శ్రీశైలం ఆలయంలో, శివమాల ధారణ చేసిన భక్తులపై పోలీసులు లాఠీచార్జ్ రూపంలో ప్రభుత్వ యంత్రాంగంలో ఘోరమైన వైఫల్యం బయటపడింది. సంవత్సరాలుగా మహాశివరాత్రి సమయంలో పాదయాత్రగా శ్రీశైలం వెళ్లే భక్తులకు ఇస్తున్న సమయాన్ని ఏడు రోజులకు కుదించారు. దీనివల్ల పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని అధికారులకు ముందే తెలిసినా, సరైన ఏర్పాట్లు చేయలేదు.
🚨 🚨 Hello India 👋🏻 👋🏻👋🏻
Shiva Mala Dharana devotees were lathi charged by Andhra Pradesh Police under TDP governance.
Devotees across Andhra Pradesh are living with growing fear when they step into temples under the TDP coalition government led by N. Chandrababu Naidu.… pic.twitter.com/kBILeAwLOY— YS Jagan Mohan Reddy (@ysjagan) February 10, 2026
తాగునీరు, క్యూల నిర్వహణ, వైద్య సదుపాయాలు అన్నీ లోపించాయి. తమ పిల్లాపాపలతో ఆలయానికి వచ్చిన కుటుంబాలు గంటల తరబడి దారుణమైన పరిస్థితుల్లో వేచి చూడాల్సి వచ్చింది. ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌లకు వ్యతిరేకంగా భక్తులు నినాదాలు చేశారు. భక్తులకు ఉపశమనం ఇవ్వాల్సిన చోట, పోలీసులు బలప్రయోగానికి దిగారు. దర్శనానికి వచ్చిన భక్తులను లాఠీలతో కొట్టి తరిమారు. రాష్ట్రంలో తిరుపతి సహా అనేక ఆలయాల్లో గతంలో జరిగిన విషాద ఘటనల తరువాత కూడా, భక్తులకు సరైన ఏర్పాట్లు చేయడంలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. 2025లో ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాల్లో జరిగిన విషాదాలు చూస్తే..:
⇒ తిరుపతిలో జనవరి 8, 2025న వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్ల కోసం క్యూలో ఉన్న సమయంలో జరిగిన తొక్కిసలాటలో 6గురు భక్తులు మృతి చెందారు. టీటీడీ చరిత్రలో ఇలాంటి దుర్ఘటన జరగడం ఇదే తొలిసారి.
⇒ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, సింహాచలంలో ఏప్రిల్ 30, 2025న చందనోత్సవం సమయంలో నూతనంగా నిర్మించిన నాసిరకం గోడ కూలిపోవడంతో ఏడుగురు భక్తులు మృతి చెందారు.
⇒ శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో నవంబర్ 1, 2025న కార్తీక ఏకాదశి సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 9 మంది భక్తులు మృతి చెందారు. ఇవికాకుండా ఆలయాల్లో అనేక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.
⇒ జాగ్రత్తపడాల్సిన, తగిన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను వరుసగా జరుగుతున్న ఘటనలు ఎత్తి చూపుతున్నప్పటికీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంలో కూరుకుపోయింది.
⇒ దురదృష్టవశాత్తూ ఇప్పుడు చంద్రబాబు గారి నీచ రాజకీయాలు పవిత్ర ఆలయ ప్రాంగణాల్లోకే చొరబడుతున్నాయి. తిరుమల లడ్డూను పదే పదే వివాదాల్లోకి లాగి, రాజకీయ లాభం పొందే ప్రయత్నం చేయడంతో కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి, ఆలయ ప్రతిష్ఠకు భంగం కలిగింది. ఈ ధోరణి ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాలకూ వ్యాపిస్తోంది.
⇒ భక్తులు తీవ్ర ఇబ్బందులు పడి, చివరకు పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు తిన్నప్పటికీ.. సనాతన ధర్మం గురించి మాట్లాడే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లు, మౌనం వహిస్తే, బాధ్యత ఎవరు తీసుకుంటారు? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు’’


