శివ శివా.. ఇదేం దారుణం? | Chandrababu Naidu govt has failed miserably in Srisailam | Sakshi
Sakshi News home page

శివ శివా.. ఇదేం దారుణం?

Feb 11 2026 4:30 AM | Updated on Feb 11 2026 4:30 AM

Chandrababu Naidu govt has failed miserably in Srisailam

శివ భక్తులపై లాఠీచార్జి చేస్తున్న ఏఎస్పీ యుగంధర్‌

శ్రీశైలంలో చంద్రబాబు సర్కార్‌ ఘోర వైఫల్యం

కనీస సదుపాయాలు కల్పించకపోగా భక్తులపై లాఠీచార్జీనా.. 

ఇంత దుర్మార్గమా అంటూ శివస్వాముల ఆగ్రహం 

సరైన ప్రణాళిక లేకే క్యూలైన్లలో తొక్కిసలాట.. 

రక్షించు శివా అంటూ భక్తుల ఆర్తనాదాలు 

గతంలో ఎన్నడూ చూడలేదంటున్న ధార్మిక సంఘాలు 

సీఎం, డిప్యూటీ సీఎం బాధ్యత వహించాలంటున్న భక్తులు 

తిరుపతి, సింహాచలం, కాశీబుగ్గ తరహాలోనే తొక్కిసలాట.. 

అదృష్టవశాత్తూ తప్పిన ప్రమాదం.. 

వరుస ఘటనలు జరుగుతున్నా బాబు సర్కార్‌ నిర్లక్ష్యం

భక్తుల మనోభావాలు దెబ్బతీస్తూ తిరుమల ప్రసాదంపైనా నిరాధార ఆరోపణలు.. అందుకే బాబుగారి భక్తిపై భక్తులకు సందేహాలు

పుణ్యక్షేత్రాల నిర్వహణే చేతకావడంలేదంటే కనీస అడ్మినిస్ట్రేషన్‌ తెలియడం లేదనుకోవాలి.. ఎల్లో మీడియా ప్రచారం చేస్తున్న సమర్థవంతమైన పరిపాలన అంటే ఇదేనా? అని ప్రశ్నిస్తున్న విశ్లేషకులు

శ్రీశైలం టెంపుల్‌: వరుసగా ఆలయాల్లో విషాద ఘటనలు.. ఎన్నడూ లేని విధంగా తొక్కిసలాటలు.. భక్తుల మరణాలు.. చంద్రబాబు సర్కార్‌ అంతులేని నిర్లక్ష్యానికి ప్రబల నిదర్శనాలు. తిరుపతి, సింహాచలం, కాశీబుగ్గ పుణ్య క్షేత్రాలలో భక్తులు ప్రాణాలు కోల్పోయినా బాబుసర్కార్‌ మొద్దునిద్ర వీడలేదు. ఇపుడు శ్రీశైలం వంతు వచ్చింది. హరహర మహాదేవ.. శంభోశంకర అంటూ నల్లమల కొండగుట్టల్లో ప్రతిధ్వనించే శివస్వాముల గొంతులు.. భయంతో రక్షించు శివా అంటూ ఆర్తనాదాలు చేసే పరిస్థితి వచ్చింది. కనీస ఏర్పాట్లు చేయాల్సిన ప్రభుత్వం దారుణంగా విఫలమవడంతో శివస్వాములు ప్రత్యక్ష నరకాన్ని చవిచూశారు. గంటల తరబడి క్యూలైన్లలో మగ్గిపోతూ చివరకు తాళాలను పగులగొట్టి గోడలు ఎక్కి ప్రాణాలు రక్షించుకున్నారు. ప్రాణభయంతో పరుగులు పెడుతున్న శివభక్తులపై పోలీసులు లాఠీచార్జి చేయడం మరీ దారుణం. ఆలయాల్లో సదుపాయాల విషయంలో నిర్లక్ష్యం వహించిన ఈ ప్రభుత్వం భక్తులపై కాఠిన్యం ప్రదర్శించడం అత్యంత దుర్మార్గమని హిందూ ధార్మిక సంఘాలు, ప్రజాస్వామిక వాదులు విమర్శిస్తున్నారు. 

ఈ ఘటనకు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఏం సమాధానం చెబుతారని ప్రశ్నిస్తున్నారు. వరుసగా దేవాలయాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నా పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించడం, కోట్లాదిమంది భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా తిరుమల పవిత్ర ప్రసాదంపై అదేపనిగా నిరాధార ఆరోపణలు చేయడం చూస్తుంటే అసలు చంద్రబాబుకు భక్తి అనేది ఉందా అన్న అనుమానం కలుగుతోందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబుకు పుణ్యక్షేత్రాలలో ఉత్సవాల నిర్వహణే చేతకావడంలేదని వరుస ఘటనలు తేటతెల్లం చేస్తున్నాయి. అంటే దీనిని బట్టి ఆయనకు కనీస అడ్మినిస్ట్రేషన్‌ కూడా చేతకావడం లేదని అర్థం చేసుకోవచ్చు. విజనరీ అంటూ ప్రచారమే గానీ నిజానికి ఆయన ఎల్లో మీడియా తయారుచేసిన ఓ ఈవెంట్‌ మేనేజరేనని విమర్శకులంటున్నారు.

భయాందోళనతో ఉన్న భక్తులపై లాఠీలా..?
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు భారీగా తరలివచ్చే శివస్వాములకు, భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించాల్సిన రాష్ట్రప్రభుత్వం ఆ విషయంలో దారుణంగా విఫలమయ్యింది. ముగ్గురు మంత్రులు శ్రీశైలంలో ఏర్పాట్లపై సమీక్షలు జరిపారు. కానీ ఫలితం సున్నా. ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది శివస్వాముల దర్శనం రోజులను కుదించారు. దాంతో సోమవారం రాత్రికే వేలాది మంది శ్రీగిరి చేరుకున్నారు. పాదయాత్రగా, వాహనాల్లో భారీ సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. దేవస్థానం అధికారుల సమన్వయ లోపం, వీఐపీ ప్రోటోకాల్‌ పేరుతో ఇతరులకు స్పర్శదర్శనాలు కల్పించడంతో కంపార్ట్‌మెంట్లలో, క్యూలైన్లలో భక్తులు ఎక్కువ సేపు వేచి ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది. ఉదయం 9గంటల నుంచి శివస్వాముల లైన్లను నిలిపివేశారు. 

ఉచిత కంపార్ట్‌మెంట్లలో ఉండలేక అసహనానికి గురై గేటు దూకుతున్న భక్తులు  

అప్పటికే చంద్రావతి కళ్యాణ మండపంలోకి భారీగా చేరుకున్న శివస్వాములు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. మరో వైపు సాధారణ భక్తులు సైతం కంపార్ట్‌మెంట్లలో నిండిపోయారు. కంపార్ట్‌మెంట్లలో, క్యూలైన్లలో కనీస సౌకర్యాలు లేవు. తాగునీరు, అల్పాహారం, పాలు, బిస్కెట్లు అక్కడక్కడా అరకొరగా అందాయి.. గంటల తరబడి క్యూలైన్లలో మగ్గిపోయిన భక్తులు భయాందోళనలకు లోనయ్యారు. క్యూలైన్ల తాళాలు పగులగొట్టి, గోడలు ఎక్కి తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బయటపడ్డారు.  ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీస్తున్న తమపై పోలీసులు లాఠీలను ఝుళిపించడంతో భక్తుల ఆగ్రహం తారస్థాయికి చేరుకుంది. ఈ పరిస్థితికి కారణమైన సీఎం, డిప్యూటీ సీఎం, చైర్మన్, ఈఓ డౌన్‌ డౌన్‌ అంటూ భక్తులు తమ నిరసనను తెలియజేశారు. భక్తులపై లాఠీచార్జీ ఘటనలో నంద్యాల ఏఎస్పీ యుగంధర్‌బాబు తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి.


తూతూమంత్రంగా సమీక్షలు..
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం చేపట్టాల్సిన ఏర్పాట్లపై ఈ నెల 2న శ్రీశైలంలో రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి అనం రామనారాయణరెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్థనరెడ్డి, హోంశాఖ మంత్రి అనితలు జిల్లా అధికారులతో, దేవస్థాన అధికారులతో సమీక్షలు నిర్వహించారు. భక్తులకు విస్త్రత ఏర్పాట్లు చేస్తున్నామని, గతేడాది కంటే ఈ ఏడాది అదనంగా 30శాతం ఏర్పాట్లు చేస్తున్నామని ప్రగల్బాలు పలికారు. కానీ ఆచరణలో మాత్రం శూన్యంగా కనిపించింది. తూతూ మంత్రంగా జరిపిన మంత్రుల సమీక్షలను అధికారులు పట్టించుకోలేదు. అరకొర ఏర్పాట్లతో సరిపెట్టినట్లు తెలుస్తోంది. భక్తులు భారీగా తరలివచ్చే శ్రీశైల పుణ్యక్షేత్రంలో కనీస సౌకర్యాలపై చంద్రబాబు ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 


స్వాముల యాత్రకు అనుమతిలోనూ అలక్ష్యమే..
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం శివభక్తులు తరలివస్తారు. బ్రహ్మోత్సవాల్లో చాలా మంది శివస్వాములు నల్లమల అడవుల్లో పాదయాత్ర చేసుకుంటూ శ్రీగిరి చేరుకుని మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకోవడం ఆనవాయితీ. బ్రహ్మోత్సవాల కంటే ముందుగానే తమ ఇంటి వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభించి శ్రీగిరి చేరుకుంటారు. అయితే ఈ ఏడాది జాతీయ పులుల గణన పేరుతో అటవీశాఖ అధికారులు నల్లమల అడవుల్లో పాదయాత్రకు ముందస్తు అనుమతి ఇవ్వలేదు. చివరకు ఈ నెల 6వ తేది నుంచి అనుమతి ఇచ్చారు. దీంతో భక్తులు, శివస్వాములు ఒక్కసారిగా పాదయాత్రతో శ్రీగిరి చేరుకున్నారు. అటవీశాఖ నుంచి భక్తుల పాదయాత్రకు అనుమతి ఇప్పించడంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని అంటున్నారు. 


గ్రామోత్సవం చేయకపోవడం మహాపచారం!
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిఅమ్మవార్లను విశేష వాహనసేవలో అలంకరించి ప్రత్యేకంగా వాహన పూజలు నిర్వహిస్తారు. అనంతరం ప్రత్యేక వాహనాధీశులైన స్వామి అమ్మవార్లకు అంగరంగ వైభవంగా క్షేత్ర ప్రధాన వీధుల్లో గ్రామోత్సవం నిర్వహిస్తారు. అయితే సరైన ప్రణాళిక లేకపోవడంతో శ్రీశైలం చరిత్రలో ఇంతవరకు ఎప్పుడూ లేని విధంగా స్వామి అమ్మవార్లకు గ్రామోత్సవం నిర్వహించక పోవడాన్ని భక్తులు మహాపచారంగా భావిస్తున్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యంతో అలంకార మండపంలో పూజలకే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ప్రాణభయంతో క్యూలైన్ల నుంచి బయటకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న శివస్వాములు 

తప్పు కప్పిపుచ్చుకునేందుకు ఈవో పాట్లు..
శివస్వాముల ముసుగులో కొంత మంది అసాంఘిక శక్తులు తనపై కుట్ర పన్ని భక్తులను రెచ్చగొట్టేలా చేశారని శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు సోమవారం సాయంత్రం మీడియాతో నిర్వహించిన చిట్‌ చాట్‌లో పేర్కొనడం గమనార్హం. తనని ఈఓ బాధ్యతల నుంచి తప్పించేందుకు కొందరు కుట్ర పన్ని.. ప్రణాళికాబద్ధంగా భక్తులను రెచ్చగొట్టి ఆందోళనలు చేయించారని తన తప్పిదాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. ఇదిలాఉంటే రద్దీని కంట్రోల్‌ చేయాల్సిన దేవస్థాన ట్రస్ట్‌బోర్డు చైర్మన్, ఈఓ కంట్రోల్‌ రూంకే పరిమితం కావడం గమనార్హం. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజే భక్తుల రద్దీని కంట్రోల్‌ చేయలేని దేవస్థానం, జిల్లా యంత్రాంగం ఇక మహాశివరాత్రి రోజు లక్షన్నరకు పైగా భక్తులు తరలివస్తే పరిస్థితి ఎలా ఉంటుందోననే ఆందోళన వ్యక్తమవుతోంది.
స్వామివారి దర్శనం కోసం ఎండలో భక్తులు ఇలా మాడాల్సిందే.. 

సనాతన ధర్మం అన్నాడు.. ఇప్పుడు ఎక్కడున్నాడు?
సనాతన ధర్మాన్ని కాపాడతానని గొప్పలు చెప్పే డిప్యూటీ సీఎం శ్రీశైలంలో భక్తులకు ఇన్ని సమస్యలు ఎదురవుతుంటే ఎక్కడున్నాడు. కనీస సౌకర్యాలు కూడా కల్పించకపోవడం దారుణం. బ్రహ్మోత్సవాల సమయంలో కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం చూస్తే భక్తుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతోంది.
– మల్లికార్జున, శివస్వామి, అనంతపురం

కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలం
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో పరమేశ్వరుడిని దర్శించుకునేందుకు శ్రీశైలం వచ్చాను. 6గంటలకు పైగా క్యూలైన్లలో ఉండాల్సిన పరిస్థితి. క్యూలైన్లలో ఉండలేక బయటికి వచ్చి కూర్చున్నా. కనీస సౌకర్యాలైన తాగునీరు, అన్నప్రసాదం, బాత్‌రూం లేవు. వృద్ధులకు సైతం ప్రత్యేక క్యూలైన్‌ లేదు. బ్రహ్మోత్సవాల్లో సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. 
– నాగరాజు, భక్తుడు, అనంతపురం

ప్రభుత్వానికి, పాలక మండలికి మంచి బుద్ధి ప్రసాదించు మల్లన్నా
బ్రహ్మోత్సవాల్లో భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించలేని చంద్రబాబు ప్రభుత్వానికి, శ్రీశైల దేవస్థానం పాలక మండలికి మంచి బుద్ధి ప్రసాదించాలని మల్లన్నను కోరుకుంటున్నా. గంటల తరబడి భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నా, ఒక్క అధికారి, వలంటీర్‌ కూడా పలకరించిన దాఖలాలు లేవు. చంద్రబాబు ప్రభుత్వం ఇంత అధ్వాన్నంగా ఏర్పాట్లు చేసింది. పదవులు తీసుకోవడానికి కాదు పాలక మండలి సభ్యులు ఉండేది. భక్తులకు సేవలందించేందుకని గుర్తుంచుకోవాలి.
– నరసింహారెడ్డి, శివస్వామి, తెలంగాణ

30 ఏళ్లలో ఎన్నడూ మల్లన్న దర్శనం చేసుకోకుండా వెళ్లలేదు
నేను గత 30 ఏళ్ల నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు వచ్చి స్వామిఅమ్మవార్లను దర్శించుకుంటా. చాలా సార్లు శివమాలను స్వీకరించి 41రోజులు నిష్టగా ఉండి ఇరుముడి సమర్పించేందుకు శ్రీశైలం చేరుకుంటా. గత 30ఏళ్లలో ఎన్నడూ జరగని రీతిలో ఈ ఏడాది మల్లన్నను దర్శించుకోకుండానే వెనుతిరిగి వెళ్తున్నా. ప్రభుత్వం, దేవస్థానం అధికారుల నిర్లక్ష్యంతోనే పరమేశ్వరుడిని దర్శించుకోకుండా వెనక్కి వెళ్తున్నా.
– వెంకటరావిురెడ్డి, శివభక్తుడు, హైదరాబాద్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement