Shiva devotees
-
పరమశివుడి భిక్షు పర్యావతారం
పూర్వం విదర్భ రాజ్యాన్ని సత్యరథుడు పరిపాలించేవాడు. సత్యరథుడు పేరుకు తగినట్లే సత్యధర్మ పరాయణుడు. మహా శివభక్తుడు. విదర్భ రాజ్యాన్ని సత్యరథుడు సుభిక్షంగా పాలిస్తుండటం చూసి, సాల్వరాజుకు కన్నుకుట్టింది. ఒకనాడు అతడు విదర్భ రాజ్యంపై దండెత్తాడు. విదర్భ సాల్వ సేనలకు భీకర పోరాటం జరిగింది. సత్యరథుడు కూడా స్వయంగా యుద్ధంలో పాల్గొన్నాడు. యుద్ధంలో విదర్భ సేనలు ఓడిపోయాయి.సత్యరథుడు సాల్వరాజు చేతిలో నేలకూలాడు.శత్రుసైన్యం అంతఃపురాన్ని ముట్టడించడానికి వస్తున్నట్లు సత్యరథుడి పట్టపురాణికి సమాచారం తెలిసింది. అప్పటికి ఆమె గర్భవతి. నమ్మకస్తులైన దాసీల సాయంతో ఆమె రహస్యమార్గం గుండా అంతఃపురాన్ని వీడి, అటవీ మార్గంలోకి చేరింది. అడవిలో శిథిలావస్థలో ఉన్న ఒక శివాలయంలో తలదాచుకోసాగింది. కొన్నాళ్లకు నెలలు నిండి, ఆమెకు సర్వశుభలక్షణాలు కలిగిన కొడుకు పుట్టాడు. ఆమె ఆ బాలుడిని అల్లారుముద్దుగా పెంచుకోసాగింది.ఒకనాడు ఆమె కొడుకును ఆలయంలోనే వదిలి, స్నానం చేయడానికి చేరువలోనే ఉన్న నదికి వెళ్లింది. స్నానం చేస్తుండగా ఆమె మొసలి నోటికి చిక్కింది. మొసలి ఆమెను అమాంతం తినేసింది. ఆలయంలో ఉన్న పసిబాలుడు తల్లి కోసం రోదించసాగాడు. అంతలో కొడుకుని చంకనెత్తుకుని అటుగా వెళుతున్న బ్రాహ్మణ వితంతువు ఆలయం నుంచి వినిపిస్తున్న శిశువు రోదనను గమనించి, ఆలయంలోకి వెళ్లింది. ఏడుస్తున్న బాలుడిని ఎత్తుకుని, అతడికి పాలిచ్చి ఓదార్చింది. అతడు ఎవరి బాలుడో తెలియక, ఆ బాలుడి కోసం ఎవరైనా వస్తారేమోనని ఆమె దిక్కులు చూడసాగింది. అప్పుడు పరమశివుడు భిక్షుక రూపంలో ఆమె ఎదుట ప్రత్యక్షమయ్యాడు.‘తరుణీ! మనసులో శంకలు వీడి ఈ శిశువును కూడా నీ కుమారుడితో పాటే పెంచు. ఇతడి వల్ల నీకు భవిష్యత్తులో మేలు జరుగుతుంది’ అని చెప్పాడు.‘భిక్షుకా! ఇంతకీ ఈ బాలుడెవరు? ఇతడి జన్మవృత్తాంతం ఏమిటి?ఈ పిల్లవాణ్ణి నేను తీసుకువెళితే, రాజభటులు నాపై అపహరణ నేరం మోపి, ఉరితీస్తారేమో! అదే జరిగితే ఈ బాలుడితో పాటు నా శిశువు కూడా అనాథ అవుతాడు’ అని భయంగా పలికిందా బ్రాహ్మణ వనిత.‘తరుణీ! భయపడకు. నేను శంకరుడిని. నా సంకల్పం ప్రకారమే నువ్వు ఇక్కడకు వచ్చావు. నిస్సందేహంగా ఈ బాలుడిని తీసుకువెళ్లి పెంచు’ అని పలికి, ఆ బాలుడి వృత్తాంతమంతా వివరించి తన నిజరూపాన్ని ప్రదర్శించాడు.ఆమె వెంటనే శంకరుడికి పాదాభివందనం చేసింది. ‘పరమేశ్వరా! ఈ పసిబాలుడికి ఇంతటి దుర్గతి కలగడానికి కారణమేమిటి? అలాగే నా కుమారుడు నిరుపేద వితంతువునైనా నా కడపున పుట్టడానికి కారణమేమిటి?’ అని ప్రశ్నించింది.‘తరుణీ! మానవుల జనన మరణాలకు, వారి సుఖదుఃఖాలకు వారు చేసుకున్న కర్మలే కారణం. ఈశ్వరుడిని అయిన నేను ఈ విషయంలో నిమిత్తమాత్రుడను. ఈ రాకుమారుడి తండ్రి సత్యరథుడు గత జన్మలో రాజుగా పాలిస్తూ, ముందు వెనుకలు విచారించకుండా తన సామంతరాజును ఉరితీయించాడు. ఈ జన్మలో అదే సామంతరాజు చేతిలో హతమయ్యాడు. ఇతడి తల్లి గత జన్మలో తన సవతిని విషప్రయోగంతో చంపించింది. ఇక నీ కుమారుడు గత జన్మలో బ్రాహ్మణుడై, ఆశ్రమధర్మాలను విడనాడి నీచులైన వారి వద్ద నీచ ద్రవ్యాన్ని దానాలుగా స్వీకరించి, ప్రాయశ్చిత్త కర్మలు చేసుకోకుండా జీవించాడు. అందుకే ఇప్పుడిలా జన్మించాడు’ అని పలికి అంతర్ధానమయ్యాడు.ఆ తర్వాత బ్రాహ్మణ స్త్రీ ఇద్దరు బాలకులను తీసుకుని ఏకచక్రపురానికి చేరుకుంది. అక్కడ నివాసం ఉంటూ ఇద్దరు బాలురను అల్లారుముద్దుగా పెంచసాగింది. తగిన వయసు రాగానే ఇద్దరికీ ఉపనయనాది సంస్కారాలను జరిపించింది. వారికి నిత్యం శివలీలలను వినిపిస్తూ, వారిచేత శివలీలలను గానం చేయిస్తూ, ఇద్దరినీ శివభక్తులుగా తీర్చిదిద్దింది. కొన్నాళ్లకు ఇద్దరు బాలకులను ఒక గురువు వద్ద గురుకులంలో చేర్చింది. బ్రాహ్మణ బాలకుడికి బ్రాహ్మణోచిత విద్యలలోను, క్షత్రియ బాలకుడికి క్షత్రియోచిత విద్యలలోను శిక్షణ ఇప్పించింది. ఇద్దరు బాలకులూ గురువు వద్ద వినయ విధేయతలతో మెసలుకొంటూ శీఘ్రంగానే సమస్త విద్యలనూ నేర్చుకున్నారు. యుక్తవయసు రాగానే బ్రాహ్మణ బాలకుడు తగిన కన్యను వివాహం చేసుకుని, ఏకచక్రపురం రాజు వద్దనే రాజ పురోహితుడిగా కుదురుకున్నాడు.క్షత్రియ కుమారుడు ఆ బ్రాహ్మణ కుమారుడి సాయంతో రాజాశ్రయం సంపాదించాడు. తన వృత్తాంతం చెప్పి, రాజును సైనిక సహాయం అర్థించాడు. రాజు సమకూర్చిన సైన్యంతో తన తండ్రిని హతమార్చిన సాల్వరాజుపై యుద్ధం ప్రకటించాడు.యుద్ధంలో సాల్వరాజును అంతం చేసి, తన తండ్రి పరిపాలించిన విదర్భ దేశాన్ని హస్తగతం చేసుకున్నాడు. విదర్భ రాజ్యానికి పట్టాభిషిక్తుడైన తర్వాత «సత్య ధర్మాలను తప్పకుండా జనరంజకంగా పరిపాలన కొనసాగించాడు.∙సాంఖ్యాయన -
నాగేంద్ర హారాయ త్రిలోచనాయ ! (ఫొటోలు)
-
శివ స్వాములపై లాఠీ ఛార్జ్.. ఇంత కన్నా పాపం ఉంటుందా ?
-
శివ శివా.. ఇదేం దారుణం?
శ్రీశైలం టెంపుల్: వరుసగా ఆలయాల్లో విషాద ఘటనలు.. ఎన్నడూ లేని విధంగా తొక్కిసలాటలు.. భక్తుల మరణాలు.. చంద్రబాబు సర్కార్ అంతులేని నిర్లక్ష్యానికి ప్రబల నిదర్శనాలు. తిరుపతి, సింహాచలం, కాశీబుగ్గ పుణ్య క్షేత్రాలలో భక్తులు ప్రాణాలు కోల్పోయినా బాబుసర్కార్ మొద్దునిద్ర వీడలేదు. ఇపుడు శ్రీశైలం వంతు వచ్చింది. హరహర మహాదేవ.. శంభోశంకర అంటూ నల్లమల కొండగుట్టల్లో ప్రతిధ్వనించే శివస్వాముల గొంతులు.. భయంతో రక్షించు శివా అంటూ ఆర్తనాదాలు చేసే పరిస్థితి వచ్చింది. కనీస ఏర్పాట్లు చేయాల్సిన ప్రభుత్వం దారుణంగా విఫలమవడంతో శివస్వాములు ప్రత్యక్ష నరకాన్ని చవిచూశారు. గంటల తరబడి క్యూలైన్లలో మగ్గిపోతూ చివరకు తాళాలను పగులగొట్టి గోడలు ఎక్కి ప్రాణాలు రక్షించుకున్నారు. ప్రాణభయంతో పరుగులు పెడుతున్న శివభక్తులపై పోలీసులు లాఠీచార్జి చేయడం మరీ దారుణం. ఆలయాల్లో సదుపాయాల విషయంలో నిర్లక్ష్యం వహించిన ఈ ప్రభుత్వం భక్తులపై కాఠిన్యం ప్రదర్శించడం అత్యంత దుర్మార్గమని హిందూ ధార్మిక సంఘాలు, ప్రజాస్వామిక వాదులు విమర్శిస్తున్నారు. ఈ ఘటనకు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఏం సమాధానం చెబుతారని ప్రశ్నిస్తున్నారు. వరుసగా దేవాలయాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నా పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించడం, కోట్లాదిమంది భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా తిరుమల పవిత్ర ప్రసాదంపై అదేపనిగా నిరాధార ఆరోపణలు చేయడం చూస్తుంటే అసలు చంద్రబాబుకు భక్తి అనేది ఉందా అన్న అనుమానం కలుగుతోందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబుకు పుణ్యక్షేత్రాలలో ఉత్సవాల నిర్వహణే చేతకావడంలేదని వరుస ఘటనలు తేటతెల్లం చేస్తున్నాయి. అంటే దీనిని బట్టి ఆయనకు కనీస అడ్మినిస్ట్రేషన్ కూడా చేతకావడం లేదని అర్థం చేసుకోవచ్చు. విజనరీ అంటూ ప్రచారమే గానీ నిజానికి ఆయన ఎల్లో మీడియా తయారుచేసిన ఓ ఈవెంట్ మేనేజరేనని విమర్శకులంటున్నారు.భయాందోళనతో ఉన్న భక్తులపై లాఠీలా..?శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు భారీగా తరలివచ్చే శివస్వాములకు, భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించాల్సిన రాష్ట్రప్రభుత్వం ఆ విషయంలో దారుణంగా విఫలమయ్యింది. ముగ్గురు మంత్రులు శ్రీశైలంలో ఏర్పాట్లపై సమీక్షలు జరిపారు. కానీ ఫలితం సున్నా. ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది శివస్వాముల దర్శనం రోజులను కుదించారు. దాంతో సోమవారం రాత్రికే వేలాది మంది శ్రీగిరి చేరుకున్నారు. పాదయాత్రగా, వాహనాల్లో భారీ సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. దేవస్థానం అధికారుల సమన్వయ లోపం, వీఐపీ ప్రోటోకాల్ పేరుతో ఇతరులకు స్పర్శదర్శనాలు కల్పించడంతో కంపార్ట్మెంట్లలో, క్యూలైన్లలో భక్తులు ఎక్కువ సేపు వేచి ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది. ఉదయం 9గంటల నుంచి శివస్వాముల లైన్లను నిలిపివేశారు. ఉచిత కంపార్ట్మెంట్లలో ఉండలేక అసహనానికి గురై గేటు దూకుతున్న భక్తులు అప్పటికే చంద్రావతి కళ్యాణ మండపంలోకి భారీగా చేరుకున్న శివస్వాములు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. మరో వైపు సాధారణ భక్తులు సైతం కంపార్ట్మెంట్లలో నిండిపోయారు. కంపార్ట్మెంట్లలో, క్యూలైన్లలో కనీస సౌకర్యాలు లేవు. తాగునీరు, అల్పాహారం, పాలు, బిస్కెట్లు అక్కడక్కడా అరకొరగా అందాయి.. గంటల తరబడి క్యూలైన్లలో మగ్గిపోయిన భక్తులు భయాందోళనలకు లోనయ్యారు. క్యూలైన్ల తాళాలు పగులగొట్టి, గోడలు ఎక్కి తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బయటపడ్డారు. ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీస్తున్న తమపై పోలీసులు లాఠీలను ఝుళిపించడంతో భక్తుల ఆగ్రహం తారస్థాయికి చేరుకుంది. ఈ పరిస్థితికి కారణమైన సీఎం, డిప్యూటీ సీఎం, చైర్మన్, ఈఓ డౌన్ డౌన్ అంటూ భక్తులు తమ నిరసనను తెలియజేశారు. భక్తులపై లాఠీచార్జీ ఘటనలో నంద్యాల ఏఎస్పీ యుగంధర్‌బాబు తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి.తూతూమంత్రంగా సమీక్షలు..మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం చేపట్టాల్సిన ఏర్పాట్లపై ఈ నెల 2న శ్రీశైలంలో రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి అనం రామనారాయణరెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్థనరెడ్డి, హోంశాఖ మంత్రి అనితలు జిల్లా అధికారులతో, దేవస్థాన అధికారులతో సమీక్షలు నిర్వహించారు. భక్తులకు విస్త్రత ఏర్పాట్లు చేస్తున్నామని, గతేడాది కంటే ఈ ఏడాది అదనంగా 30శాతం ఏర్పాట్లు చేస్తున్నామని ప్రగల్బాలు పలికారు. కానీ ఆచరణలో మాత్రం శూన్యంగా కనిపించింది. తూతూ మంత్రంగా జరిపిన మంత్రుల సమీక్షలను అధికారులు పట్టించుకోలేదు. అరకొర ఏర్పాట్లతో సరిపెట్టినట్లు తెలుస్తోంది. భక్తులు భారీగా తరలివచ్చే శ్రీశైల పుణ్యక్షేత్రంలో కనీస సౌకర్యాలపై చంద్రబాబు ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వాముల యాత్రకు అనుమతిలోనూ అలక్ష్యమే..మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం శివభక్తులు తరలివస్తారు. బ్రహ్మోత్సవాల్లో చాలా మంది శివస్వాములు నల్లమల అడవుల్లో పాదయాత్ర చేసుకుంటూ శ్రీగిరి చేరుకుని మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకోవడం ఆనవాయితీ. బ్రహ్మోత్సవాల కంటే ముందుగానే తమ ఇంటి వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభించి శ్రీగిరి చేరుకుంటారు. అయితే ఈ ఏడాది జాతీయ పులుల గణన పేరుతో అటవీశాఖ అధికారులు నల్లమల అడవుల్లో పాదయాత్రకు ముందస్తు అనుమతి ఇవ్వలేదు. చివరకు ఈ నెల 6వ తేది నుంచి అనుమతి ఇచ్చారు. దీంతో భక్తులు, శివస్వాములు ఒక్కసారిగా పాదయాత్రతో శ్రీగిరి చేరుకున్నారు. అటవీశాఖ నుంచి భక్తుల పాదయాత్రకు అనుమతి ఇప్పించడంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని అంటున్నారు. గ్రామోత్సవం చేయకపోవడం మహాపచారం!మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిఅమ్మవార్లను విశేష వాహనసేవలో అలంకరించి ప్రత్యేకంగా వాహన పూజలు నిర్వహిస్తారు. అనంతరం ప్రత్యేక వాహనాధీశులైన స్వామి అమ్మవార్లకు అంగరంగ వైభవంగా క్షేత్ర ప్రధాన వీధుల్లో గ్రామోత్సవం నిర్వహిస్తారు. అయితే సరైన ప్రణాళిక లేకపోవడంతో శ్రీశైలం చరిత్రలో ఇంతవరకు ఎప్పుడూ లేని విధంగా స్వామి అమ్మవార్లకు గ్రామోత్సవం నిర్వహించక పోవడాన్ని భక్తులు మహాపచారంగా భావిస్తున్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యంతో అలంకార మండపంలో పూజలకే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.ప్రాణభయంతో క్యూలైన్ల నుంచి బయటకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న శివస్వాములు తప్పు కప్పిపుచ్చుకునేందుకు ఈవో పాట్లు..శివస్వాముల ముసుగులో కొంత మంది అసాంఘిక శక్తులు తనపై కుట్ర పన్ని భక్తులను రెచ్చగొట్టేలా చేశారని శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు సోమవారం సాయంత్రం మీడియాతో నిర్వహించిన చిట్ చాట్‌లో పేర్కొనడం గమనార్హం. తనని ఈఓ బాధ్యతల నుంచి తప్పించేందుకు కొందరు కుట్ర పన్ని.. ప్రణాళికాబద్ధంగా భక్తులను రెచ్చగొట్టి ఆందోళనలు చేయించారని తన తప్పిదాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. ఇదిలాఉంటే రద్దీని కంట్రోల్ చేయాల్సిన దేవస్థాన ట్రస్ట్‌బోర్డు చైర్మన్, ఈఓ కంట్రోల్ రూంకే పరిమితం కావడం గమనార్హం. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజే భక్తుల రద్దీని కంట్రోల్ చేయలేని దేవస్థానం, జిల్లా యంత్రాంగం ఇక మహాశివరాత్రి రోజు లక్షన్నరకు పైగా భక్తులు తరలివస్తే పరిస్థితి ఎలా ఉంటుందోననే ఆందోళన వ్యక్తమవుతోంది.స్వామివారి దర్శనం కోసం ఎండలో భక్తులు ఇలా మాడాల్సిందే.. సనాతన ధర్మం అన్నాడు.. ఇప్పుడు ఎక్కడున్నాడు?సనాతన ధర్మాన్ని కాపాడతానని గొప్పలు చెప్పే డిప్యూటీ సీఎం శ్రీశైలంలో భక్తులకు ఇన్ని సమస్యలు ఎదురవుతుంటే ఎక్కడున్నాడు. కనీస సౌకర్యాలు కూడా కల్పించకపోవడం దారుణం. బ్రహ్మోత్సవాల సమయంలో కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం చూస్తే భక్తుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతోంది.– మల్లికార్జున, శివస్వామి, అనంతపురంకనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలంమహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో పరమేశ్వరుడిని దర్శించుకునేందుకు శ్రీశైలం వచ్చాను. 6గంటలకు పైగా క్యూలైన్లలో ఉండాల్సిన పరిస్థితి. క్యూలైన్లలో ఉండలేక బయటికి వచ్చి కూర్చున్నా. కనీస సౌకర్యాలైన తాగునీరు, అన్నప్రసాదం, బాత్రూం లేవు. వృద్ధులకు సైతం ప్రత్యేక క్యూలైన్ లేదు. బ్రహ్మోత్సవాల్లో సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. – నాగరాజు, భక్తుడు, అనంతపురంప్రభుత్వానికి, పాలక మండలికి మంచి బుద్ధి ప్రసాదించు మల్లన్నాబ్రహ్మోత్సవాల్లో భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించలేని చంద్రబాబు ప్రభుత్వానికి, శ్రీశైల దేవస్థానం పాలక మండలికి మంచి బుద్ధి ప్రసాదించాలని మల్లన్నను కోరుకుంటున్నా. గంటల తరబడి భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నా, ఒక్క అధికారి, వలంటీర్ కూడా పలకరించిన దాఖలాలు లేవు. చంద్రబాబు ప్రభుత్వం ఇంత అధ్వాన్నంగా ఏర్పాట్లు చేసింది. పదవులు తీసుకోవడానికి కాదు పాలక మండలి సభ్యులు ఉండేది. భక్తులకు సేవలందించేందుకని గుర్తుంచుకోవాలి.– నరసింహారెడ్డి, శివస్వామి, తెలంగాణ30 ఏళ్లలో ఎన్నడూ మల్లన్న దర్శనం చేసుకోకుండా వెళ్లలేదునేను గత 30 ఏళ్ల నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు వచ్చి స్వామిఅమ్మవార్లను దర్శించుకుంటా. చాలా సార్లు శివమాలను స్వీకరించి 41రోజులు నిష్టగా ఉండి ఇరుముడి సమర్పించేందుకు శ్రీశైలం చేరుకుంటా. గత 30ఏళ్లలో ఎన్నడూ జరగని రీతిలో ఈ ఏడాది మల్లన్నను దర్శించుకోకుండానే వెనుతిరిగి వెళ్తున్నా. ప్రభుత్వం, దేవస్థానం అధికారుల నిర్లక్ష్యంతోనే పరమేశ్వరుడిని దర్శించుకోకుండా వెనక్కి వెళ్తున్నా.– వెంకటరావిురెడ్డి, శివభక్తుడు, హైదరాబాద్ -
శివతత్త్వాన్ని పొందాలంటే...!
మన హృదయంలో ఉండేది శ్రీ మహాదేవుని ప్రతిబింబం. ఇది శ్రీ శివుని నివాసం. ఇది అన్నింటినీ మించినది. మన మనస్సుకు, ఆలోచనలకు అన్నింటికీ అతీతమైనది. ఈ శివ తత్త్వాన్ని పొందాలంటే, ముందుగా మనం శ్రద్ధ వహించి మన హృదయం ఎంత స్వచ్ఛంగా ఉందో మన లోపలికి మనం చూసుకోవాలి. మన హృదయం లోపల, మనం చాలా మురికిని పెంచుకుంటాము. ఉదాహరణకు, మనం ఎవరినైనా చూసి అసూయపడతాం. ఎవరో మనకు చెడు చేసినట్టు అసూయ పడుతుంటాము. వారు మనకు నిజంగా హాని చేసినా కూడా, ఇబ్బంది కలిగించినా కూడా వారి పట్ల అసూయపడి ప్రయోజనం లేదు. మన హృదయం శుభ్రంగా ఉంటే, మన హృదయమనే అద్దంలో గల సర్వ శక్తిమంతుడైన భగవంతుని ప్రతిబింబం స్పష్టంగా ఉంటుంది. కానీ మనం మన లోపల అసూయను కలిగి ఉంటే, అప్పుడు ఆ అద్దం శుభ్రంగా ఉండదు. అందులో భగవంతుని ప్రతిబింబం కూడా పరిపూర్ణంగా ఉండదు. ఎవరితోనైనా శత్రుత్వం కలిగి ఉండటం, ఎవరి పట్లనైనా హృదయంలో కోపం లేదా చెడు భావాలను కలిగి ఉండటం చాలా తప్పు. దాని వలన శ్రీ శివతత్త్వాన్ని కలిగి ఉండలేము. అందుకే మనం అందరినీ ప్రేమించడం, క్షమించడం చాలా ముఖ్యం. మనం రోజూ శివునికి పూజలు, అభిషేకాదులు చేస్తూ మన లోపల గల అరిషడ్వర్గాలను విడిచి పెట్టలేకపోతే శ్రీ శివతత్త్వాన్ని పొందలేం. శ్రీ శివతత్త్వాన్ని పొందాలంటే మన హృదయం నిర్మలంగా ఉండాలి. ఎటువంటి అలజడులు లేని స్వచ్ఛమైన నీటిని కలిగి ఉన్న సరస్సు మాత్రమే ఆకాశంలో ఉన్న సూర్యుని చక్కగా ప్రతిబింబించ గలుగుతుంది. అదే విధంగా మన హృదయం కూడా ఎటువంటి ఆలోచనలు లేని నిర్విచార స్థితిలో, ఇతరుల పట్ల ఏ విధమైన ద్వేషం, కోపం లేకుండా ఉన్నప్పుడు మాత్రమే భగవంతుని నిజమైన స్వరూపాన్ని ప్రతిబింబించ గలుగుతాము. అనగా శ్రీ శివ తత్త్వాన్ని పొందగలుగుతాం.శ్రీ శివుని సచ్చిదానంద స్వరూపుడు అని వర్ణిస్తారు. అనగా సత్ + చిత్ + ఆనంద స్వరూపుడు. సత్యము, చిత్తము మరియు ఆనందమును స్వరూపముగా కలిగిన వాడు శ్రీ శివుడు. ఏ విషయం గురించైనా సత్యము ఏమిటి అనేది మనకు సహస్రారములో ఉండే శ్రీ సదాశివుని పాదాల వద్దనే తెలుస్తుంది. మన చిత్తం ఆత్మ ప్రకాశంతో నిండినప్పుడే మనకు ఆత్మ సాక్షాత్కారం లభిస్తుంది. నిరంతరం నిర్మలమైన ఆనందంతో ఉండే వ్యక్తే భగవంతుని పరిపూర్ణంగా ప్రతిబింబించ గలుగుతాడు. ఈ సచ్చిదానంద స్వరూపమయిన శ్రీ శివ తత్త్వాన్ని పొందగలిగిన వారి జన్మ ధన్యం.మన లోపల ఉండే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాలు మన హృదయంలో ఉండే శ్రీ శివుని ప్రకాశానికి అడ్డు పొరలుగా ఏర్పడతాయి. మనం సహజ యోగంలో కుండలినీ జాగృతి ద్వారా ఆత్మ సాక్షాత్కారం పొందినప్పుడు ఈ ఆత్మ ఉనికిని మన చేతి వేళ్ళపై అనుభూతి చెందడం ప్రారంభిస్తాం. అప్పుడు ఆత్మ పరిశీలన ద్వారా ఈ అరిషడ్వర్గాలను క్రమంగా తొలగించుకొన్నప్పుడు, పరిపూర్ణంగా ఆత్మ స్వరూపులమయ్యి భగవంతుని ప్రతిబింబాన్ని స్పష్టంగా మన హృదయంలో ప్రతిబింబించ గలుగుతాం. అటువంటి వ్యక్తులలో దైవికమైన సుగుణాలన్నీ స్పష్టంగా ప్రస్ఫుటమవుతూ ఉంటాయి. అటువంటి వ్యక్తులు నిత్య నిరామయమైన శ్రీ శివ తత్త్వాన్ని పొంది, సదా శివసాన్నిధ్యంలో ఉంటారు.– డా. పి. రాకేష్(పరమపూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి ప్రవచనాల ఆధారంగా) -
పింఛన్ పేరిట ఘరానా మోసం
నెహ్రూసెంటర్(మహబూబాబాద్): శివసత్తులకు ప్రభుత్వం నుంచి పెన్సన్ అందిస్తున్నారని, దీనికి క్రియేషన్ ఫొటోలు దిగాలనే పుకార్లు దావణంలా వ్యాపించాయి. ఈ మేరకు మంగళవారం మానుకోట పట్టణంలోని ఓ ఫొటో స్టూడియోలో ఫొటోల కోసం శివసత్తులు, దేవుడమ్మలు పోటెత్తారు. ఫొటో స్టూడియో వద్ద భారీఎత్తున ప్రజలు గుమిగూడడంతో మహిళల మధ్య తోపులాట జరిగి గోడవకు దారితీసింది. ఈ విషయం మీడియాకు, పోలీసులకు తెలియడంతో అసలు విషయం బయటపడింది. స్థానికులు, బాధితుల కథనం ప్రకారం.. ఈ నెల 5న జిల్లావ్యాప్తంగా గిరిజన పూజారులకు జీవనభృతి కల్పించి, బ్రాహ్మణ పూజారులకు ఇచ్చే వేతనాలు తమకు కూడా కల్పించాలని గిరిజన పూజారులు మానుకోటలో మహాసభ నిర్వహించారు. ఆ మరునాటి రోజునుంచి శివసత్తులకు, గిరిజన పూజారులకు పెన్షన్ అందిస్తున్నారని, ఈ పెన్షన్‌కు అర్హతగా శివసత్తులు నెత్తిన బోనం, గొర్రెపోతు, వేప మండలు చేత పట్టుకొని ఫొటో దిగిన తర్వాత దరఖాస్తు చేసుకోవాలని, దీనికి మానుకోటలోని ఓ ఫొటో స్టూడియోలో పెన్షన్‌కు సంబంధించిన ఫొటోలు తీస్తున్నారనే పుకార్లు షికార్లు కొట్టాయి. ముందుగా మహబూబాబాద్ మండలంలోని సింగారం గ్రామానికి చెందిన గిరిజన శివసత్తులు వచ్చి ఫొటో దిగారు. వారు మరికొంత మందికి చెప్పడంతో వరంగల్, వరంగల్ రూరల్, మహబూబాబాద్ జిల్లాలోని పలు మండలాల నుంచి గిరిజన మహిళలు మానుకోటకు వచ్చారు. ఇదే అదునుగా భావించిన పట్టణంలో ఉన్న ఓ ఫొటోస్టూడియో నిర్వాహకుడు వారం రోజులుగా వందల మంది క్రియేషన్ ఫోటోలు తీశాడు. 5 కలర్ ఫొటోలకు రూ.150 చొప్పున వసూళ్లు చేసి క్రియేషన్ ఫొటోలు తీశాడు. ఈ క్రమంలోనే పెన్షన్‌కు మంగళవారం చివరి తేదీ అని మరికొన్ని పుకార్లు రావడంతో మూడు జిల్లాల నుంచి వందలాది మంది మహిళలు ఫొటో స్టూడియోకు చేరుకున్నారు. అక్కడ మహిళల మధ్య తోపులాట జరగడంతో ఈ విషయం మీడియాకు, పోలీసులకు చేరింది. సంఘటనా స్థలానికి ట్రాఫిక్ ఎస్సై అశోక్, టౌన్ సీపీఐ జబ్బార్ చేరుకోగా అక్కడ గుమిగూడిన మహిళలు పోలీసులను చూసి పరుగులు తీశారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన మహిళలతో పోలీసులు మాట్లాడుతూ ఇలాంటి పుకార్లను ప్రజలు నమ్మొద్దని, ఇలాంటి వారికి చట్టపరంగా చర్యలు తప్పవని, అక్కడికి వచ్చిన మహిళలను ఇంటికి వెళ్లిపోవాలని కోరారు. -
వైఎస్ జగన్‌ను కలిసిన శివ భక్తులు
-
కార్తీకమాసంలో శివుడికి పరాభవం
-
అపచారం.. అహంకారం
కార్తీక మాసంలో హిందువులు శివారాధన ఎంతో పవిత్రంగా భావిస్తారు. అటువంటి పరమశివుడికి కార్తీక మాసంలోనే పరాభవం ఎదురైంది. రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కేఎస్ జవహర్ ఇలాకాలో ఇది జరిగింది. కొవ్వూరు రూరల్: కొవ్వూరు పట్టణంలో శ్రీవెంకటేశ్వర స్వామి దేవస్థానం ఎదురుగా ఉన్న శ్రీనివాస స్నానఘట్టంలో భక్తులు ఏర్పాటు చేసుకున్న శివలింగాన్ని మంగళవారం పోలీసుల సహకారంతో అధికారులు తొలగించడం వివాదాస్పదం అయింది. చెప్పులతోనే సిబ్బంది విగ్రహాలు తొలగించి హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. విగ్రహాల తొలిగింపుపై ఆందోళనకు దిగిన స్థానికులకు వైఎస్సార్ సీపీ నేతలు అండగా నిలిచారు. సమాచారం తెలుసుకుని అక్కడికి వెళ్లిన జిల్లా వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి పరిమి హరిచరణ్‌ను, పలువురు స్థానికులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కి తరలించారు. సోమవారం అర్ధరాత్రే పోలీసుల సాయంతో అధికారులు విగ్రహాన్ని తొలగించడానికి వెళ్లారు. స్థానికులు ప్రతిçఘటించడంతో అధికారులు వెనుతిరిగారు. మంగళవారం గణపతి హోమం నిర్వహణకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ తరుణంలో భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించి బలవంతంగా శివలింగాన్ని, గణపతి, నంది విగ్రహాలతో పాటు, శివుడికి ప్రార్థన చేసే రావణబ్రహ్మ విగ్రహాలను తొలగించడానికి పూనుకున్నారు. తొలగించిన విగ్రహాలను వ్యాన్‌లో ధవళేశ్వరంలోని నీటిపారుదల శాఖ కార్యాలయా నికి తరలించారు. రావణబ్రహ్మా విగ్రహాన్ని మాత్రం పూర్తిగా ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న స్థానికులు, వైఎస్సార్ సీపీ నాయకులు అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసు అడ్డుకున్నారు. నాయకులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. దాంతో వైఎస్సార్ సీపీ నాయకులు పోలీసు స్టేషన్ ఎదుట బైఠాయించారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త తానేటి వనిత ఆధ్వర్యంలో సుమారు మూడు గంటల పాటు స్టేషన్ ఎదుటే ధర్నా నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా బయల్దేరి మొయిన్ రోడ్డు మీదుగా ఫ్యాక్టరీ రోడ్డు నుంచి సంఘటనా స్థలం వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. మళ్లీ పోలీసులు అడ్డుకున్నారు. ప్రతిఘటించిన జిల్లా ప్రధాన కార్యదర్శి బండి పట్టాభిరామారావు (అబ్బులు)ని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కి తరలించారు. దీంతో నాయకులు ఆంధ్రాషుగర్స్ ఫ్యాక్టరీ సమీపంలో రోడ్డుపైనే బైఠాయించి రాస్తారోకో చేశారు. ప్రభుత్వ తీరుపై నాయకులు తీవ్రస్థాయిలో మండి పడ్డారు. ఈ సందర్భంగా వనిత మాట్లాడుతూ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రభుత్వ అధికారులు వ్యవహరించారని అన్నారు. ఆర్డీవోని కలిసి సోమవారం వినతిప్రతం అందజేశామని, కనీసం పరిగణనలోకి తీసుకోకుండా విగ్రహం తొలగించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. కార్తీక మాసంలో శివలింగం, గణపతి, నందీశ్వరుడి విగ్రహాలను తొలగించి హిందువుల మనోభావాలను దెబ్బతీశారని విమర్శించారు. టూరిజం పేరుతో మంత్రి, అతని అనుయాయులు ఆక్రమించా లనుకున్న 9 ఎకరాల స్థలంలో కొద్ది సెంట్ల స్థలంలో ఉన్న శివలింగమే అడ్డు వచ్చిందా అని ప్రశ్నించారు. తక్షణమే తొలగించిన విగ్రహాన్ని పునః ప్రతిష్ట చేయాలని డిమాండు చేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోడూరి శివరామకృష్ణ మాట్లాడుతూ పవిత్రమైన గోదావరి తీరంలో 2003 పుష్కరాల్లో దొరికిన అతి పురాతన శివలింగాన్ని భక్తులు ప్రతిష్టించుకుంటే, అధికారులు తొలగించడం దారుణమన్నారు. టూరిజం అభివృద్ధి పేరుతో భక్తుల మనోభావాలను కాలరాయడం సమజసం కాదన్నారు. దళిత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముప్పిడి విజయరావు మాట్లాడుతూ హిందూ మనోభావాలకు వ్యతిరేకంగా ఎక్సైజ్‌శాఖ మంత్రి తీసుకునే నిర్ణయాలకు పోలీసులు, అధికారులు వత్తాసు పలకవద్దని హితవు పలికారు. పర్యాటక అభివృద్ధి పేరుతో నీటిపారుదల శాఖ భూమిని కబ్జా చేసేయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మండల పార్టీ అధ్యక్షుడు గురుజు బాలమురళీకృష్ణ, నాయకుడు ముదునూరి నాగరాజు పోలీసుల వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. శ్రీనివాసపురం స్నానఘట్టానికి అడ్దంగా మట్టి గుట్టలు పోయడంపై స్ధానికులు మండిపడ్డారు. మత్య్సకారులతో పాటు స్థానికులు రోడ్డుపైకి చేరుకుని వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. సుమారు గంటసేపు రోడ్డుపైనే వనితతో పాటు నాయకులు రాస్తారోకో నిర్వహించారు. పోలీసు అధికారుల సూచనలతో స్నానఘట్టానికి అడ్డుగా వేసిన మట్టి గుట్టలు తొలగించడంతో పరిస్థితి చక్కబడింది. బుధవారం నీటిపారుదల శాఖ, రెవెన్యూ, పోలీసు అధికారులతో చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేస్తామని పట్టణ సీఐ ఎస్బీవీ శుభాకర్ హామీ ఇవ్వడంతో నాయకులు ఆందోళన విరమించారు. పార్టీ జిల్లా కార్యదర్శులు కొమ్మిరెడ్డి వెంకటేశ్వరరావు, కాకర్ల నారాయుడు, చాగల్లు, తాళ్లపూడి మండల పార్టీ అధ్యక్షులు కొఠారు అశోక్‌బాబా, కుంటముక్కల కేశవనారాయణ, పట్టణ అధ్యక్షుడు రుత్తల ఉదయ భాస్కరరావు, జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి లకంసాని శ్రీనివాసరావు, కార్యదర్శి ముళ్లపూడి కాశీవిశ్వనాధ్, జిల్లా రైతు విభాగం నాయకులు గన్నిన రత్నాజీ, నాయకులు వర్రే శ్రీనివాస్, వరిగేటి సుధాకర్, కొయ్యల భాస్కరరావు, నగళ్లపాటి శ్రీనివాస్, చిలంకుర్తి బాబి లతో పాటు అధిక సంఖ్యలో నాయకులు పాల్గొన్నారు. -
ద్వాదశ దర్శనం
కార్తికం కార్తికమాసం శివుడికి ప్రీతిపాత్రమైన మాసం. శివభక్తులు ఈ నెల్లాళ్లూ అత్యంత భక్తిశ్రద్ధలతో సదాశివుడిని కొలుస్తారు. శూలపాణి అయిన శివుడు కార్తిక పౌర్ణమి రోజున దేవతలను ముప్పుతిప్పలు పెట్టిన త్రిపురాసురుడిని సంహరించి, ముల్లోకాలను కాపాడాడని ప్రతీతి. సోమవారం శివుడికి ప్రీతిపాత్రం కావడంతో కార్తీక సోమవారాల్లో ఉపవాస వ్రతాలు ఆచరిస్తారు. వేకువనే శివాలయాలకు వెళ్లి పూజార్చనలలో పాల్గొంటారు. మన దేశంలో శివాలయాలు లేని ఊళ్లు దాదాపు ఉండవు. అయితే, ద్వాదశ జ్యోతిర్లింగాలు మాత్రం శివభక్తులకు తప్పనిసరి సందర్శనీయ క్షేత్రాలు. సాధారణ దినాలలో కంటే, కార్తికమాసంలో ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు శివభక్తులతో కళకళలాడుతూ కనిపిస్తాయి. పవిత్ర కార్తిక మాసం సందర్భంగా వరుస క్రమంలో ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల గురించి ఒక విహంగ వీక్షణం... 1. సోమనాథుడు గుజరాత్‌లోని సౌరాష్ట్ర ప్రాంతంలో ఉంది. ద్వాదశ జ్యోతిర్లింగాల యాత్రకు బయలుదేరే వారు ఇక్కడి నుంచే తమ యాత్రను ప్రారంభిస్తారు. ఈ క్షేత్రంపై పదహారుసార్లు దాడులు జరిగాయి. అన్నిసార్లూ పునర్నిర్మాణమూ జరిగింది. ఇది శైవులకు మాత్రమే కాదు, వైష్ణవులకూ సందర్శనీయ క్షేత్రమే. శ్రీకృష్ణ పరమాత్ముడు ఇక్కడే తన అవతారాన్ని చాలించినట్లు ప్రతీతి. శాపవశాత్తు తేజస్సు కోల్పోయిన చంద్రుడు ఇక్కడి సరస్వతీ నదిలో స్నానమాచరించి, తిరిగి తేజస్సును పొందినట్లు పురాణాలు చెబుతున్నాయి. 2. మల్లికార్జునుడు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో ఉంది. తమలో ఎవరు అధికులనే దానిపై బ్రహ్మకు, విష్ణువుకు ఎడతెగని వాదులాట జరిగినప్పుడు శివుడు ఇక్కడ ముల్లోకాలనూ ఆక్రమిస్తూ అద్యంత రహిత జ్యోతిర్లింగంగా ఆవిర్భవించినట్లు పురాణాలు చెబుతున్నాయి. సాంబశివుడు ఇక్కడ మల్లికార్జున స్వామిగా వెలశాడు. శ్రీశైలం శైవక్షేత్రం మాత్రమే కాదు, ఇది శక్తిపీఠం కూడా. సతీదేవి పెపైదవి ఇక్కడ పడినందున ఇది అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా ప్రసిద్ధి పొందింది. 3. మహాకాళేశ్వరుడు మధ్యప్రదేశ్‌లో ఉంది. మహాశివుడు ఇక్కడ స్వయంభువుగా వెలిశాడు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఇదొక్కటే స్వయంభూలింగం. ఇక్కడ మహాకాళేశ్వరుడిగా పరమశివుడు పూజలందుకుంటున్నాడు. మహాకాళేశ్వరుడినే దక్షిణామూర్తిగానూ ఆరాధిస్తారు. అష్టాదశ శక్తిపీఠాలలో ఉజ్జయిని కూడా ఒకటి. ఇక్కడ మహాకాళిగా ఆదిశక్తి ఆరాధనలు అందుకుంటోంది. శివశక్తులు ఒకేచోట ఉండటం ఇక్కడి విశేషం. ఇక్కడి కాలభైరవుడి ఆలయం కూడా సుప్రసిద్ధ సందర్శనీయ క్షేత్రం. 4. ఓంకారేశ్వరుడు ఇది కూడా మధ్యప్రదేశ్‌లోనే ఉంది. మాంధాత తపస్సుకు మెచ్చి ఈశ్వరుడు ఇక్కడ వెలిశాడంటారు. నర్మదా నదీ తీరంలో శివుడు ఓంకారేశ్వరుడిగా పూజలందుకుంటున్నాడు. నారద మహాముని ఒకసారి వింధ్య పర్వతానికి వచ్చి, మేరుపర్వతం గొప్పదనం గురించి చెప్పాడు. మేరువును మించిపోవాలనే తపనతో వింధ్య పార్థివ లింగాన్ని స్థాపించి తపస్సు చేయగా, మెచ్చిన శివుడు ఇక్కడ ఓంకారేశ్వరుడిగా వెలసినట్లు ప్రతీతి. అమరులకు ఈశ్వరుడైనందున అమరేశ్వరుడిగా కూడా ఓంకారేశ్వరుడిని కొలుస్తారు. 5. బైద్యనాథేశ్వరుడు నేటి జార్ఖండ్ రాష్ట్రంలోని డియోఘర్‌లో బైద్యనాథ జ్యోతిర్లింగం ఉంది. ఈశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోవడం కోసం రావణాసురుడు తన పదితలలనూ తెగనరుక్కోవడంతో ఈశ్వరుడు ఆయన భక్తికి మెచ్చి, ఆ తలలన్నింటినీ అతికించడం వల్ల ఈయనకు వైద్యనాథేశ్వరుడని పేరు వచ్చింది. అయితే వైద్యనాథ జ్యోతిర్లింగం గురించి భిన్న కథనాలు వినవస్తాయి. మహారాష్ట్రలోని పర్లి (పరల్యాం వైద్యనాథం చ)లో హిమాచల ప్రదేశ్‌లోని ైబె థ్యనాథ్లోనూ ఉన్న లింగాలకు కూడా వైద్యనాథుడనే పేరు.. 6. కేదారనాథుడు ఉత్తరాఖండ్‌లో హిమాలయాల వద్ద మందాకినీ తీరాన ఉంది. ఏటా అక్షయ తృతీయ మొదలుకొని కార్తిక పూర్ణిమ వరకు మాత్రమే కేదార్‌నాథ్‌లోని ఆలయం భక్తుల కోసం తెరుచుకుని ఉంటుంది. ఆ తర్వాత శీతాకాలంలో ఆరునెలల పాటు ఇక్కడి విగ్రహాలను ఉఖిమఠానికి తరలించి, అక్కడ పూజపునస్కారాలను కొనసాగిస్తారు. పాండవులు ఈ ఆలయాన్ని నిర్మించారని ప్రతీతి. ఆ తర్వాత ఆది శంకరాచార్యులు దీనిని పునరుద్ధరించారు. 7. భీమశంకరుడు మహారాష్ట్రలోని పుణే సమీపంలో భీమశంకరేశ్వర ఆలయం ఉంది. భీమశంకర్ నుంచే భీమా నది మొదలవుతుంది. రాయచూర్ వద్ద ఇది కృష్ణా నదిలో కలుస్తుంది. సహ్యాద్రిపర్వతాలలో గల ఈ లింగం భీమశంకరుడిగా ప్రసిద్ధిపొందింది. ఈ ప్రదేశానికి పురాణాలలో ఢాకిని అనే పేరుంది. భీముడు ఈ లింగాన్ని పూజించడం వల్ల భీమశంకరుడని పేరు వచ్చింది. 8. రామేశ్వరుడు తమిళనాడులోని రామేశ్వరంలో ఉంది. ద్వాదశ జ్యోతిర్లింగాలన్నింటిలోనూ రామేశ్వరంలో కొలువై ఉన్న లింగమే అత్యంత పెద్దదిగా ప్రసిద్ధి పొందింది. రాముడు ప్రతిష్టించి సేవించినందు వల్ల ఈ లింగానికి రామేశ్వర లింగమని పేరు. 9. నాగేశ్వరుడు గుజరాత్‌లోని ద్వారకలో కొలువై ఉన్న ఈ నాగేశ్వర జ్యోతిర్లింగమే ద్వాదశ జ్యోతిర్లింగాలలో అత్యంత ప్రాచీనమైనదిగా విశ్వసిస్తారు. నాటి దారుకావన మే నేటి ద్వారక. శివపురాణంలో కూడా నాగేశ్వర జ్యోతిర్లింగం గురించిన ప్రస్తావన కనిపిస్తుంది. తనను ఆరాధించిన వారి సర్వకష్టాలనూ నివారిస్తానని ప్రతిజ్ఞాపూర్వకంగా చెప్పిన శివుడు నాగేశ్వర జ్యోతిర్లింగంగా మారిపోయాడంటారు. 10. విశ్వేశ్వరుడు ద్వాదశ జ్యోతిర్లింగాలన్నింటిలోనూ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో గల కాశీవిశ్వనాథుడికి ఉన్న ప్రాశస్త్యం మరేలింగానికీ లేదంటే అతిశయోక్తి కాదు. శివుడికి కాశీనగరమంటే ఈశ్వరుడికి ఎంత ప్రీతి అంటే, తనకు భిక్ష దొరకలేదని అలిగిన వ్యాసుడు ఆ నగరాన్ని శపించడానికి సిద్ధపడేసరికి అమితంగా ఆగ్రహించి, వ్యాసుడినే నగరం నుంచి వెళ్లగొట్టాడట. అత్యంత పురాతన నగరమైన కాశీకి మహాశ్మశానమని పేరు. ఇక్కడి అమ్మవారు విశాలాక్షి. అమ్మవారు అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి. కాశీవిశ్వనాథుడిని సందర్శించిన వారికి ముక్తి లభిస్తుందని, కాశీలో మరణించిన వారికి అంత్యసమయంలో శివుడే స్వయంగా తారకమంత్రాన్ని ఉపదేశిస్తాడని ప్రతీతి. 11. త్య్రంబకేశ్వరుడు మహారాష్ట్రలోని నాసిక్ వద్దగల త్రయంబకేశ్వరంలో ఈ జ్యోతిర్లింగం ఉంది. తమకు జ్ఞానబోధ చేసిన ఈశ్వరుడిలో బ్రహ్మ, విష్ణువులు ఐక్యం అయిపోవడం వల్ల ముగ్గురూ కలిసి త్య్రయంబకేశ్వర లింగంగా ఆవిర్భవించారు. పరమ పావనమైన గోదావరి నది ఇక్కడే పుట్టింది. ఈ గోదావరికి గౌతమి అని పేరు. త్య్రంబకేశ్వరుని సేవించిన వారికి సకల విద్యలు అబ్బుతాయట. మోక్షం లభిస్తుందట. 12. ఘృష్ణేశ్వరుడు మహారాష్ట్రలోని దౌలతాబాద్‌లో ఉన్న ఈ ఆలయం శివపురాణంలోని కోటిరుద్ర సంహితలో చెప్పిన చిట్టచివరి ద్వాదశ జ్యోతిర్లింగంగా చెప్పుకుంటారు. ఘృష్ణేశ్వర్కి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో గల వెరుల్లో ఉంది ఈ ఆలయం. ఘృశ్నే అనే భక్తురాలి కోరిక మేరకు శివుడు ఈ ప్రదేశంలో జ్యోతిర్లింగంగా అవతరించినందువల్ల ఈయనకు ఘృష్ణేశ్వరుడని పేరు వచ్చింది. ఘృష్ణేశ్వరుని సేవించిన వారికి సంతాన నష్టం, అకాల మృత్యువు ఉండవని విశ్వాసం. శైవక్షేత్రాలు... ఎన్నెన్నో..! ఒక్కోలింగానికి ఒక్కో విశిష్ఠత. ఇంకా... పంచభూతలింగాలున్నాయి. ఇవిగాక పంచారామాలున్నాయి. ఇంతేనా... కొన్ని వందల ఏళ్ల చరిత్ర కలిగిన ప్రాచీన శివాలయాలు ఈ పృథ్విపై ఉన్నాయి. శైవక్షేత్రాలను సందర్శించినా, విన్నా, పఠించినా పుణ్యప్రదమే. - పన్యాల జగన్నాథదాసు, డి.వి.ఆర్. భాస్కర్


