‘అనంత’జిల్లాలో దాహం కేకలు | Problems are arising even for drinking water in Anantapur district | Sakshi
Sakshi News home page

‘అనంత’జిల్లాలో దాహం కేకలు

Feb 11 2026 5:33 AM | Updated on Feb 11 2026 5:33 AM

Problems are arising even for drinking water in Anantapur district

వజ్రకరూరు మండలం కొనకొండ్ల సచివాలయానికి ఎదురుగా ఉరవకొండ–గుంతకల్లు ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో బైఠాయించి ధర్నా నిర్వహిస్తున్న మహిళలు, కాలనీవాసులు

ఆర్థిక మంత్రి పయ్యావుల ఇలాకాలో రోడ్డెక్కిన మహిళలు 

ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి ధర్నా 

బండమీదపల్లిలో ఖాళీ బిందెలతో నిరసన 

వజ్రకరూరు/కుందుర్పి: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న అనంతపురం జిల్లాలో గుక్కెడు తాగునీటికీ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఎన్నికల హామీలన్నీ నీటి మూటలుగా మారగా.. గొంతు తడిపే నీటిచుక్క కోసం ప్రజలు పడరాని పాట్లు పడుతున్న ప్రజలు పలుచోట్ల రోడ్లెక్కి ఆందోళనలకు దిగారు. మంగళవారం వజ్రకరూరు మండలం కొనకొండ్లలో మహిళలు తాగునీటి కోసం మంగళవారం ఆందోళన చేపట్టారు. 

ఆ గ్రామంలోని 7, 8 కాలనీలకు కొన్ని రోజులుగా తాగునీరు సరఫరా కావడం లేదు. దీంతో వారంతా సుదూర ప్రాంతాలకు వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారు. ఈ సమస్య గురించి అధికారులకు చెప్పినా ఫలితం లేకపోవడంతో మంగళవారం సాయంత్రం వివిధ కాలనీల వారు మహిళలతో కలిసి గ్రామ సచివాలయానికి చేరుకున్నారు. ఎదురుగా ఉన్న ఉరవకొండ–గుంతకల్లు ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నాకు దిగారు. 

ఖాళీ బిందెలతో గంటకుపైగా ధర్నా నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గ్రామానికి చెందిన వైఎస్సార్‌ సీపీ నాయకుడు వాల్మీకి గోవిందు, కాలనీవాసులు దేవేంద్రప్ప, శంకరయ్య, రాజేష్ కుమార్, మరికొందరు మహిళలు మాట్లాడుతూ... కాలనీకి సక్రమంగా మంచినీరు రావడం లేదని, రెండురోజులకు ఒకసారి నీరు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో మంత్రి పయ్యావుల కేశవ్‌ వంద రోజుల్లో ఇంటింటికీ కుళాయి ఏర్పాటు చేస్తామని చెప్పారని, అధికారంలోకి వచ్చాక హామీని అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ముళ్లకంచె అడ్డంగా పెట్టి ఖాళీ బిందెలతో నిరసన 
కుందుర్పి మండలం బండమీదపల్లి గ్రామంలో మంగళవారం కుందురి్ప–కళ్యాణదుర్గం ప్రధాన రహదారికి ముళ్ల కంచె అడ్డంగా పెట్టి ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వాహన రాకపోకలను అడ్డుకున్నారు. గ్రామంలో 20 రోజులుగా తాగునీటి సమస్యతో ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే స్పందించేవారు కరువయ్యారన్నారు. 

ఎంపీడీవో లక్ష్మీశంకర్‌ బండమీదపల్లిలోనే నివాసముంటూ సమస్యను కళ్లారా చూస్తున్నా.. పరిష్కరించడంలో విఫలమయ్యారని మహిళలు వాపోయారు. 20 రోజుల్లో రెండుసార్లు కుందుర్పి మండల పరిషత్‌ కార్యాలయం ముందు ధర్నాలు, నిరసనలు చేపట్టినా... అధికారుల్లో చలనం లేదన్నారు.

గొంతెండుతోంది.. నీళ్లివ్వండి మహాప్రభో!
నీటి కోసం రోడ్డెక్కిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు  
బ్రహ్మసముద్రం/మడకశిర రూరల్‌: నీటి సమస్యను తీర్చాలంటూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు రోడ్డెక్కారు. వివరాలు.. అనంతపురం జిల్లా నాగిరెడ్డిపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో దాదాపు 250 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. సుమారు 15 రోజులుగా ఈ పాఠశాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. తాగునీటికి, కాలకృత్యాలకు విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. 

ఈ సమస్యను టీడీపీ గ్రామ సర్పంచ్, టీడీపీ నేత సందీప్‌కు తెలిపినా ఆయన ఏ చర్యలూ తీసుకోలేదు. దీంతో విద్యార్థులంతా మంగళవారం రోడ్డెక్కారు. పాఠశాల ఎదుట రోడ్డుపై ధర్నా చేశారు. అనంతరం సర్పంచ్‌ ఇంటికి వెళ్లి తమ ఆందోళన తెలియజేశారు. ఇంట్లో సర్పంచ్‌ లేకపోవడంతో.. విద్యార్థులు స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ చైర్మన్‌ ఇంటికి వెళ్లి నిరసన తెలిపారు. 

మంత్రి సవిత ఇలాకాలో ఇదే పరిస్థితి..
బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీసత్యసాయి జిల్లాలోని మడకశిర మండలం పత్తికుంటలోనూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మంగళవారం రోడ్డెక్కారు. మధ్యాహ్న భోజన సమయంలో తాగునీటి కోసం తీవ్ర అవస్థలు పడుతున్నట్లు విద్యార్థులు వాపోయారు. అధికారులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో ధర్నా చేస్తున్నట్లు చెప్పారు. వెంటనే తమ సమస్య తీర్చాలని డిమాండ్‌ చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement