సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతోందని.. అందుకే వైఎస్సార్‌సీపీలోకి చేరికలు జరుగుతున్నాయని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. సోమవారం వైఎస్సార్‌సీపీలోకి భారీ చేరికల కార్యక్రమం జరిగింది. అయితే ఆ సమయంలో అనుమతులు నిరాకరణ పేరుతో వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఏరినా సిబ్బంది తాళం వేశారు. ఈ పరిణామాలపై స్పందిస్తూ ఆయన కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.
ప్రభుత్వం మీద వ్యతిరేకతతో పెద్ద ఎత్తున వైఎస్సార్‌సీపీలోకి చేరికలు జరుగుతున్నాయి. అనుమతి తీసుకున్న తర్వాత చిల్డ్రన్ ఏరియా థియేటర్ ఇవ్వకపోవడాన్ని ఖండిస్తున్నాం. దళితులు వైఎస్సార్సీపీలో చేరకూడదా?.. దళితులకు చిల్డ్రన్ ఏరినా ధియేటర్లో అడుగుపెట్టే అర్హత లేదా?. దళితులంటే అంత చిన్న చూపా చంద్రబాబు? అని గుడివాడ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ అంటే కూటమి నేతల భయపడుతున్నారని.. చంద్రబాబు లోకేష్, టీడీపీ బచ్చాలు ఎందుకు పనికిరారని అన్నారాయన.
చంద్రబాబు కోసం కేసిఆర్ చేసిన వ్యాఖ్యలను గుడివాడ అమర్నాథ్ సమర్థించారు. ‘‘కేసీఆర్ ఎన్నడూ అబద్దాలు మాట్లాడలేదు. అందుకే ఆయన అంత పెద్ద నేత అయ్యారు. చంద్రబాబుపై ఆయన చేసిన వ్యాఖ్యలను నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా. ప్రభుత్వంలో ఉండి ప్రజల కోసం ఆలోచించాలి.. కొడుకు, కుటుంబం కోసం కాదు’’ అని అన్నారాయన.
అంతకు ముందు.. చేరికల కార్యక్రమం సమయంలో ఆఖరి నిమిషంలో వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఏరినా సిబ్బంది అనుమతి నిరాకరిస్తూ గేటుకు తాళం వేశారు. ఈ క్రమంలో గేటు ముందు వైఎస్సార్‌సీపీ నేతలు ధర్నాకు దిగారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. దీంతో పరిస్థితి స్వల్ప ఉద్రిక్తంగా మారింది.
కూటమి నేతల ఒత్తిడితోనే అనుమతి నిరాకరించారని.. వైఎస్సార్‌సీపీ చేరికలను చూసి కూటమి నేతల భయపడుతున్నారని.. అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని వైఎస్సార్‌సీపీ నేత కేకే రాజు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
కేసీఆర్ ఏమన్నారంటే.. చంద్రబాబు మాటలు విని.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసింది. పాలమూరులో చెరువులను బాగు చేయాలని కేంద్రానికి మేం అధికారంలో ఉన్నప్పుడు లేఖలు రాశాం. అయితే.. చంద్రబాబు మాటలు విని కేంద్రం అన్యాయం చేసింది. కనీసం పట్టించుకోలేదు. బీజేపీ పాలకులు శనిలా దాపురించారు.


