East Godavari: కూర్మాపురంలో పెద్దపులి.. రాత్రంతా ఆ ఇంట్లోనే.. | East Godavari: Tiger Found At Kesavaram | Sakshi
Sakshi News home page

East Godavari: కూర్మాపురంలో పెద్దపులి.. రాత్రంతా ఆ ఇంట్లోనే..

Feb 6 2026 10:46 AM | Updated on Feb 6 2026 4:37 PM

East Godavari: Tiger Found At Kesavaram

రోజుకో రూటులో పులి తిరుగుతోంది.. ఎటెళ్తుందో ఎవరికీ అంతు‘చిక్కకుండా’ పోతోంది.. దానిని పట్టుకునేందుకు అటవీ శాఖ ఆధ్వర్యంలో వివిధ శాఖలు శ్రమిస్తున్నా, ఆనవాళ్లను మాత్రమే వదిలి వెళ్తోంది.. అయితే పులి పంజాకు మూగజీవులు బలైపోవడం పరిపాటిగా మారింది.. ఇలా వారం రోజులుగా అధికారులను పులి పరుగులు పెట్టిస్తోంది. ఎక్కడా ఆగకుండా రోజుకో చోట ప్రత్యక్షమవుతోంది.. దీంతో ఆయా గ్రామాల్లో భయాందోళన నెలకొంది. 

అదిగో పులి.. ఇదిగో పులి.. వారం రోజులుగా అందరి నోటా ఇదే మాట. తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద పులి సంచారం అంతటా హాట్‌ టాపిక్‌ అయ్యింది. వెళ్లిన రూటులో వెళ్లకుండా రోజుకో రూటు మారుస్తూ, ఎవరికీ దొరకుండా తిరుగుతున్న పెద్ద పులిని పట్టుకోవడం అటవీ శాఖకు సవాలుగా మారింది. దానిని సురక్షితంగా పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలను ఇవ్వలేకపోతున్నాయి.

ఈ క్రమంలో మూగజీవాలు దాని ఆకలికి బలైపోతున్నాయి. ఆరు రోజుల కిందట సీతానగరం మండలం తొర్రేడులో ఆవులపై దాడి చేసి ఆకలి తీర్చుకుంది. కోలమూరు, గాడాల, పాలచర్ల, దివాన్‌చెరువు మీదుగా రఘునాథపురం చేరుకుని గేదెను బలికొంది. తాజాగా భూపాలపట్నంలో ఆవును చంపింది. అక్కడి నుంచి జి.యర్రంపాలెం ఆయిల్‌పామ్‌ తోటల్లోకి వెళ్లిపోయింది. ఈ గ్రామంలో పులి దెబ్బకు మూడు లేగ దూడలు మృతి చెందాయి.

హడలెత్తిపోతున్న జనం..  
పెద్దపులి సంచారంతో రాజమహేంద్రవరం పరిసర మండలాల్లోని ప్రజలు హడలిపోతున్నారు. చిక్కదు.. దొరకదు అనే రీతిలో జరుగుతున్న పులి పయనంతో ఎప్పుడు ఎటువైపు వస్తుందోననే భయంతో అంతా వణికిపోతున్నారు. రాత్రి వేళల్లోనే కాదు పగటి సమయంలో కూడా స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితులలో రాజానగరం మండలం దివాన్‌చెరువు, భూపాలపట్నం, పుణ్యక్షేత్రం, నామవరం, జి.యర్రంపాలెం, తుంగపాడు ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని స్థితిలో ఉంటే పొలాల్లో ఉండే మూగజీవాలైన ఆవులు, గేదెలు, లేగదూడలు మాత్రం పెద్ద పులికి ఆహారంగా మారిపోతున్నాయి. ఆరు రోజులుగా నాలుగు ఆవులు, ఆరు లేగ దూడలు, రెండు గేదెలు పులి పంజాకు మృత్యువాత పడ్డాయి.

రెస్క్యూ బృందాల రాక: జిల్లా కలెక్టర్‌  
పెద్ద పులిని సురక్షితంగా పట్టుకుని అడవిలో వదిలేందుకు రెస్క్యూ బందాలను రాజమహేంద్రవరానికి రప్పించామని జిల్లా కలెక్టర్‌ కీర్తి చేకూరి తెలిపారు. జి.యర్రంపాలెంలోని ఆయిల్‌పామ్‌ తోటల్లోకి పులి వెళ్లిందనే ప్రచారం నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని అటవీ శాఖ సిబ్బందితో కలసి కలెక్టర్‌ గురువారం సందర్శించి, పులి పాదముద్రలను పరిశీలించారు. పులిని పట్టుకోవడంలో నేషనల్‌ ఎక్స్‌ఫర్ట్‌ టీమ్‌ ఇప్పటికే జిల్లాకు చేరుకుందన్నారు. సీసీఎఫ్‌ మార్గదర్శంలో అటవీ శాఖ ఏర్పాటు చేసిన బృందాలు కూడా పనిచేస్తున్నాయన్నారు. అలాగే థర్మల్‌ డ్రోన్, ట్రాప్‌ కెమెరాలను సిద్ధం చేశామని అన్నారు.

వెటర్నరీ వైద్యులు, వన్యప్రాణి నిపుణులు రంగంలోకి వచ్చారని వివరించారు. పులి జాడ తెలిసిన వెంటనే పట్టుకునే విధంగా ఏర్పాట్లు చేశారన్నారు. అయితే పులి సంచరించిన చోట పాదముద్రలను చెడగొట్టకుండా గ్రామస్తులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పులి సంచరించే ప్రాంతాల్లోని ప్రజలు మరింత అప్రమత్తంగా ఉంటూ అ«ధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. దానిని రెచ్చకొట్టే పనులు మాత్రం చేయవద్దని కోరారు. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, జిల్లా ఎస్పీ నరసింహకిశోర్, డీఎఫ్‌ఓ బి.ప్రభాకరరావు, అటవీ శాఖ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ పీవీ చలపతిరావు, సీపీఎఫ్‌ బీఎన్‌ఎన్‌ మూర్తి, ఎఫ్‌ఆర్‌ఓ దావీదురాజు నాయుడు, ఎనీ్టసీఏ అధికారి రాజశేఖర్, మత్తు వైద్యులు ఫణీంద్ర ఉన్నారు.  

కేశవరంలోకి..
మండపేట మండలం కేశవరం గ్రామ శివారు కోకాకోలా ఫ్యాక్టరీ సమీపంలోని ఉండమట్ల లక్ష్మయ్య వ్యవసాయ క్షేత్రంలో పులి సంచరిస్తోందని అధికారులు భావిస్తున్నారు. గురువారం రాత్రి సుమారు ఐదు సెకన్ల పాటు పులి సంచరించినట్టు ఆ ప్రాంతంలోని డ్రోన్‌ కెమెరాలో పడినట్లు చెబుతున్నారు. అయితే పులి మండపేట మండలం నుంచి పక్కన అనపర్తి మండలంలోకి వెళ్లే అవకాశం ఉండడంతో పోలీస్, అటవీ తదితర శాఖల అధికారులు అప్రమత్తమయ్యారు.

మండపేట మండలం కేశవరం ద్వారపూడి వేములపల్లి జెడ్ మేడపాడు గ్రామ పరిధిలో పులి సంచరిస్తున్నట్లు తెలిపారు. ఆ గ్రామాల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలకు విద్యాశాఖ సెలవు ప్రకటించింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయట సంచరించవద్దని మండపేట రూరల్‌ సీఐ పి.దొరరాజు తెలిపారు.

రాయవరం మండలంలోకి..
ఇవాళ ఉదయం(శుక్రవారం) పెద్దపులి​.. రాయవరం మండలంలోకి ప్రవేశించినట్లు అధికారులు చెబుతున్నారు. జి.ఎర్రం పాలెం నుంచి చెల్లూరు మీదుగా కూర్మాపురం వెళ్లిన పులి. మనుషుల్లేని ఇంట్లో రాత్రంతా ఉన్నట్లు తెలిపారు. కూర్మాపురానికి చేరుకున్న పెద్దపులి.. పాలచర్ల రాజు గారికి చెందిన ఓ ఇంట్లోకి చేరింది. కుక్కలు మొరగడంతో స్థానికులు గుర్తించారు. ఆ ఇంటి వద్దకు అటవీ శాఖ అధికారులు చేరుకున్నారు. కూర్మాపురం పరిసర గ్రామాల ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement