సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ను డ్రగ్ డెన్‌గా కూటమి సర్కార్ మార్చేసిందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. విచ్చలవిడిగా పేకాట క్లబ్‌లను కూడా నిర్వహిస్తున్నారంటూ దుయ్యబట్టారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున జనం వచ్చి పేకాట ఆడుతున్నారని.. టీడీపీ నేతల కనుసన్నల్లోనే డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నాయన్నారు.
‘‘హోం మంత్రి.. పోలీసులను వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను అక్రమ అరెస్టులకే ఉపయోగిస్తున్నారు. డ్రగ్స్ అరికట్టాం అంటున్న చంద్రబాబు, అనిత ఇప్పుడు దొరుకుతున్న డ్రగ్ర్‌కి ఏం సమాధానం చెప్తారు?. ఢిల్లీ నండి డ్రగ్స్ ఏపీకి వస్తుంటే పోలీసు వ్యవస్థ ఏం చేస్తున్నట్టు?. జగన్ హయాంలో డ్రగ్స్, గంజయిని అరికట్టడానికి సెబ్ అనే వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ వ్యవస్థ ఏం చేస్తుందో ఏమీ అర్థం కావటం లేదు’’ అని నరేంద్ర నిలదీశారు.
‘‘ఈ విచ్చలవిడి డ్రగ్ర్‌ని నిలిపేయకపోతే కోర్టును ఆశ్రయిస్తాం. విద్యా సంస్థల దగ్గర్‌లో యథేచ్ఛగా డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నాయి. డ్రగ్స్ వాడటం మొదలుపెడితే యువత తీవ్రంగా నాశనం అవుతుంది. ప్రభుత్వ అండదండలతోనే డ్రగ్స్ రాష్ట్రంలోకి వస్తోంది. మ్యాంగో బే కల్చరల్ రిక్రియేషన్ క్లబ్ వెనుక టీడీపీ నేతలు ఉన్నారు. వారెవరో బయట పెట్టాలి. రాష్ట్రాన్ని దౌర్భాగ్యకర పరిస్థితిలోకి తీసుకెళ్లారు’’ అంటూ వంగవీటి నరేంద్ర ధ్వజమెత్తారు.


