పల్లిపాలెం ఫిషింగ్ హార్బర్ కేంద్రంగా చేసుకుని సోమవారం సముద్రంపై వేటకు వెళ్లిన మత్య్సకారుల వలకు ఇతర రకాల సంపదతో పాటు కొమ్ముకోణం రకం భారీ చేప చిక్కింది. దాన్ని మంగళవారం ఫిష్ మార్కెట్‌కు తీసుకువచ్చారు. సుమారు 40 కేజీల బరువున్న కొమ్ముకోణం చేపను ఓ వ్యక్తి రూ.8 వేలకు కొనుగోలు చేశాడు. ఈ చేప ముక్కుకు కొమ్ము ఉండడంతో దీన్ని కొమ్ముకోణం అని పిలుస్తామని, మనిషి ప్రాణం తీసే శక్తి దీనికి ఉందని మత్స్యకారులు చెబుతున్నారు.
– సఖినేటిపల్లి
మీనమిలలు
పల్లిపాలెం ఫిష్ మార్కెట్‌కు మంగళవారం వడగర్లు రకం చేపలు ఇబ్బడి ముబ్బడిగా వచ్చాయి. ఈ చేపలన్నీ కలిసి సుమారు మూడు టన్నులు ఉంటాయని మత్స్యకారులు చెప్పారు. వీటిని కేజీ రూ.50 చొప్పున విక్రయిస్తామని, మాంసాహార ప్రియులు ఈ రకం చేపల కోసం ఎదురు చూస్తుంటారన్నారు. అలాగే చాలామంది వాటిని కొనుగోలు చేశారు. వాటిని ఎగుమతి చేసేందుకు ఐస్ బాక్సుల్లో భద్ర పరిచే పనులు చేపట్టారు.
– సఖినేటిపల్లి
ఫుట్‌పాట్లు
చంద్రబాబు ప్రభుత్వం ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టాక మహిళా ప్రయాణికులు బాగా పెరిగారు. కానీ ఆ రద్దీకి అనుగుణంగా బస్సులను పెంచకపోవడంతో వారందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సులో కూర్చోవడానికి సీటు కోసం చూసే స్థాయి నుంచి నిలబడే స్థలం దొరికితే చాలనే పరిస్థితి ఏర్పడింది. గతంలో ఫుట్‌పాత్‌పై నిలబడితే ప్రమాదమని చెప్పేవారు. ప్రస్తుతం అలాంటి స్థితిలోనే మహిళలు ప్రయాణం చేస్తున్నారు. రాజమహేంద్రవరంలో మంగళవారం కనిపించిన ఈ చిత్రం దానికి
నిదర్శనంగా నిలుస్తోంది.
– ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్,రాజమహేంద్రవరం


