పాలన ‘కమ్మ’దనంపై స్వపక్షం పెదవివిరుపు! | Kommineni Srinivasa Rao Comments BJP MLA Adinarayana Reddy Over His Kamma Remarks | Sakshi
Sakshi News home page

పాలన ‘కమ్మ’దనంపై స్వపక్షం పెదవివిరుపు!

Feb 11 2026 11:58 AM | Updated on Feb 11 2026 12:19 PM

Kommineni Srinivasa Rao Comments BJP MLA Adinarayana Reddy Over His Kamma Remarks

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎటు వెళుతున్నాయి? రాష్ట్రంలో పాలన ‘కమ్మ’గా ఉందంటూ బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్య పొలిటికల్ ఆటంబాంబుగా మారింది. కూటమిలో తెలుగుదేశం పార్టీ, ఒక సామాజికవర్గం పెత్తనంపై వ్యతిరేకత పెరిగిపోయిందనేందుకు ఇదో సూచిక. ముఖ్యమంత్రి చంద్రబాబేమో.. కుమారుడు లోకేశ్‌కు పట్టం కట్టే ప్రయత్నాల్లో తలమునకలై ఉంటే.. పాలన అధ్వాన్నంగా మారిందన్న అంచనాలు బలపడుతున్నాయి. అదే సమయంలో టీడీపీ రాజకీయ కక్షసాధింపులు, తిరుపతి లడ్డూ ప్రసాదం వ్యవహారంలో చేసిన రచ్చ కూడా కూటమి భాగస్వాములు బీజేపీ, జనసేనల అసంతృప్తికి, వ్యతిరేకతకు కారణమవుతోంది. దీన్నే ఆదినారాయణ రెడ్డి తనదైన రీతిలో బయటపెట్టారు. ఇంకొంరు బీజేపీ, జనసేన ఎమ్మెల్యేల భావన కూడా ఇదే అయినప్పటికీ ఆ పార్టీల అధినేతలు చంద్రబాబు పట్ల విధేయతగా ఉండడంతో తగ్గి ఉంటున్నారు. 

టీడీపీలో నిజంగానే ఒక సామాజికవర్గం అధికారం చెలాయిస్తోందా? అవుననే అంటున్నారు చాలామంది. ఆది నారాయణ రెడ్డి ‘కమ్మ’గా ఉందన్న కామెంట్‌కు సమావేశంలో పాల్గొన్న బీజేపీ నేతలంతా చప్పట్లు కొట్టడం కూడా ఒక సంకేతమే. కమ్మ సామాజికవర్గం నాయకత్వం ఎలా ఉన్నా.... మిగిలిన వారిని కూడా కలుపుకొనిపోవాలని ఆయన సలహా ఇచ్చారు. బీజేపీ లేనిదే టీడీపీ, జనసేనలకు ఉనికి ఉండదని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు లడ్డూ ప్రసాదం అంశంలో ఎంతో కష్టపడి ప్రచారం చేస్తున్న కుట్ర థియరీ గాలి కూడా ఆదినారాయణ తీసేశారు. లడ్డూ అంశంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌దే పైచేయి అని స్పష్టం చేశారు. ఒకప్పుడు వైఎస్సార్‌ కాంగ్రెస్‌లో ఉన్న ఆదినారాయణ రెడ్డి ఆ తరువాత టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. 

2014-19 మధ్యకాలంలో చంద్రబాబు మంత్రివర్గ సభ్యుడు కూడా. 2019లో టీడీపీ ఓటమి తర్వాత బీజేపీ  తీర్థం పుచ్చుకున్నారు. తిరిగి ఎమ్మెల్యే అయ్యారు. పార్టీలో ఆయనకు చంద్రబాబుకు సన్నిహితుడిగా పేరుపొందిన అనకాపల్లి ఎంపీ సీ.ఎం. రమేష్‌కు మధ్య వర్గపోరు కూడా సాగుతోంది. ఇదో కోణమైతే ప్రభుత్వంలో చంద్రబాబు కంటే ఆయన కుమారుడు, మంత్రి లోకేశ్‌ మాటకే అధిక ప్రాధాన్యం లభిస్తోందని టీడీపీతోపాటు బీజేపీ, జనసేనల్లోనూ బలంగా నమ్ముతున్నాయి. లోకేశ్‌ సొంత కోటరీతో షాడో ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఆయా అంశాలలో అహంకార పూరితంగా ప్రవర్తిస్తూ, గిట్టని వారిపై రెడ్‌బుక్ ప్రయోగిస్తూ అరాచకాలు చేయిస్తున్నారని వైఎస్సార్‌సీపీ విమర్శిస్తోంది. ఇతర పక్షాల్లోనూ ఇదే అభిప్రాయం ఉంది. 

చంద్రబాబు సీనియర్ నేత, ముఖ్యమంత్రి కనుక ఆయన వద్దకు వెళ్లి ఏ సమస్య అయినా మాట్లాడవచ్చు. కాని లోకేశ్‌ వద్దకు వెళ్లడం మిత్రపక్షాలకు అంతగా ఇష్టం ఉండదు. కాకపోతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ 15 ఏళ్ల రాగం ఆలపిస్తుండడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు,ఇతర నేతలు మౌనంగా ఉంటున్నారు. తాజాగా తిరుపతి జనసేన ఎమ్మెల్యే శ్రీనివాసులు లడ్డూ ప్రసాదంలో కల్తీ లేదని చెప్పడం గమనించదగిందే. అలాగే బీజేపీ నేతలపై కూడా చంద్రబాబు ఒత్తిడి చేసి తనకు అనుకూలంగా మాట్లాడాలని కోరుతున్నారు. లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు ఇంత గందరగోళం చేస్తున్నా బీజేపీ కేంద్ర పెద్దలు పెద్దగా పట్టించుకోవడం లేదు.రాష్ట్ర బీజేపీ అద్యక్షుడు మాధవ్‌ను తన అవసరార్థం పిలిపించుకుని లడ్డూపై ఉమ్మడి సమావేశంలో పాల్గొనేలా చేశారు. ఇవన్ని చూస్తే కూటమిలో అంత సవ్యత లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

 క్రెడిట్ ఉంటే చంద్రబాబు, లోకేశ్‌లే తీసుకుంటున్నారని, నెగిటివ్ వచ్చినప్పుడే తాము కావల్సి వస్తున్నామని మిత్రపక్షాలలో ముఖ్యంగా బీజేపీలో ఉందట. ఆదినారాయణ రెడ్డి ఇదే సంగతిని పరోక్షంగా వెల్లడించారు. మరో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసులు పెట్టి జైలుకు పంపడాన్ని ఆక్షేపించారని వార్తలు వచ్చాయి. అంతకుముందు తాడేపల్లి గూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసులు తమ పార్టీ పరిస్థితిని పూసగుచ్చినట్లు  వివరించారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విషయంలో కూడా అతను చేసిన కీచక పర్వం ఒక ఎత్తు అయితే, కేవలం ఒక డమ్మీగా స్థానిక టీడీపీ నేత రూపానందరెడ్డి పెత్తనంలో ఉండాల్సి రావడం కూడా గమనించవలసిన అంశం. జనసేనకు సంబంధించి కనీసం పది మంది అంతకుముందు టీడీపీలో ఉన్నవారే. చంద్రబాబు వారిని జనసేనలోకి పంపించి ఆ పార్టీ టిక్కెట్లు ఇప్పించారు.

 ఆ రకంగా పవన్ కళ్యాణ్‌ను మొదటి నుంచి బలహీనుడిగానే నిలబెట్టారు. ఇక టీడీపీ ఎమ్మెల్యేలు అనేకమంది చేస్తున్న దందాలు ఉండనే ఉన్నాయి. వాటిలో జనసేన, బీజేపీలకు పెద్దగా గిట్టుబాటు కావడం లేదు. ఆ అసంతృప్తి కూడా ఉంది. రాష్ట్రంలో 95 శాతం మద్యం షాపులు, బెల్ట్‌ షాపులు టీడీపీ వారికే దక్కాయి. పైకి టీడీపీతో కలిసి ఉంటున్నప్పటికీ, ఈ సంగతులు తెలియని స్థితిలో మిత్రపక్షాలు ఉండవు కదా! అందులోను బీజేపీ జాతీయ పార్టీ.ఆ పార్టీ అండతోనే టీడీపీ గెలవగలిగింది. కేంద్ర ప్రభుత్వ సహకారం, ఎన్నికల సంఘం కూటమికి అనుకూల నిర్ణయాలు చేయడం వంటివి ఎన్నికల సమయంలో కనిపించాయి. కేంద్రంలో ప్రధాని మోడీని, హోం మంత్రి అమిత్ షాలను పొగుడుతూ, రాష్ట్రంలో మాత్రం తమ పెత్తనాన్ని చంద్రబాబు సాగించుకుంటున్నారన్నది బీజేపీలో ఒక అభిప్రాయంగా ఉంది.

కులపరంగా చూస్తే ఎంత కాదన్నా టీడీపీని కమ్మ సామాజికవర్గం తమ సొంత పార్టీగా భావిస్తుంటుంది.మంత్రివర్గంలో  వారికి ఉన్న ప్రాధాన్యత తెలిసిందే. పార్టీ అధిష్టానానికి సన్నిహితంగా ఉండేవారిలో ఎక్కువ మంది ఆ వర్గంవారే అంటారు. ఇతర వర్గాల వారి మాట పెద్దగా చెల్లడం లేదన్నది రాజకీయ వర్గాలలో ఉన్న  అభిప్రాయం. ఇక జనసేన పార్టీ కాపు సామాజికవర్గంపై ఎక్కువగా ఆధారపడిన పార్టీ అన్నది తెలిసిందే. ఆ వర్గాన్ని ఆకర్షించడానికి  చంద్రబాబు వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్‌ను ఉపయోగించుకోగలిగారు. అయినా పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే అవకాశం లేదన్న విషయం అర్థమైన తర్వాత ఆ వర్గంలో అసంతృప్తి పెరుగుతోంది. దానికితోడు కాపు వర్గానికి జగన్ టైమ్‌లో లభించిన పథకాలు కూటమి ప్రభుత్వంలో రావడం లేదు. 

మాజీ మంత్రి, కాపు నాయకుడు అంబటి రాంబాబుపై కేసులు పెట్టి జైలుకు పంపడం, ఇంటిపైకి వెళ్లి విధ్వంసకాండ సృష్టించిన వారు టీడీపీ గూండాలైనా అందులో కూడా కమ్మ సామాజికవర్గానికి చెందిన కొందరు ముఖ్య పాత్ర పోషించారన్న ప్రచారం,   అంబటిని దూషించిన ఒక కమ్మ సామాజికవర్గ మహిళపై కేసు పెట్టకపోవడంపై కూడా చర్చించుకుంటున్నారు. బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి కూడా చంద్రబాబుతో ఉన్న బంధుత్వం కారణంగా అంబటినే తప్పుపట్టారని, అదే అంబటిని తీవ్రగా దూషించిన వారిని ఖండించలేదని, ఇది కుల ప్రభావమేనని కాపు సామాజికవర్గం భావిస్తోంది. 

అంబటి కుమార్తె మౌనిక మాట్లాడిన పద్దతి కూడా ఆ వర్గాన్ని ఆకట్టుకుంది. ఇక బీసీ నేత జోగి రమేష్ ఇంటిపై ఏకంగా పెట్రోల్ బాంబులు విసిరి నిప్పుపెట్టడం, అలా చేసిన టీడీపీ వారిపై చిన్న కేసులు పెట్టి సరిపెట్టడం బీసీ వర్గాలలో కూడా ఆందోళన కనిపించింది. దళిత వర్గాలపై ఈ ప్రభుత్వంలో జరిగినన్ని దాడులు గతంలో ఎప్పుడూ జరిగి ఉండవు. దాంతో ఆ వర్గంలో తీవ్ర అసమ్మతి ఉందని చెబుతున్నారు.  ఇక రెడ్డి సామాజికవర్గానికి చెందిన పలువురు ప్రముఖులపై కక్షతో తప్పుడు కేసులు పెట్టించిన తీరుతో ఆ వర్గం కూడా టీడీపీకి దూరం అవుతోందని చెబుతున్నారు. లడ్డూ ప్రసాదం వివాదాన్ని చంద్రబాబు ప్రచారం చేస్తున్న తీరుపై బ్రాహ్మణ, వైశ్య సామాజిక వర్గాలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నాయి. సిట్ నివేదిక వచ్చిన  తర్వాత కూడా లడ్డూలో జంతుకొవ్వు, బాత్ రూమ్ కెమికల్స్ వంటివి ఉన్నాయని చంద్రబాబు, పవన్, లోకేశ్‌లు చెప్పడం పట్ల వారు మండిపడుతున్నారు. 

తమకు లడ్డూ ప్రసాదం తీసుకోవాలంటేనే బెరుకుగా ఉంటోందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ చేసిన వ్యాఖ్య దీనికి నిదర్శనం.  పైగా టీడీపీ వాళ్లు ఫోన్‌ పోన్ ఫ్రొఫెసర్ నాగేశ్వర్‌ను తిట్టడం, బెదిరించడం కూడా బాగా ప్రభావం చూపుతోంది. నిజానికి గత ఎన్నికల సమయంలో ఈ వర్గాలలో మెజార్టీ భాగం కూటమికే మద్దతిచ్చాయి. అయినా ప్రస్తుతం పరిస్థితి కేవలం ఒక సామాజికవర్గానికే అనుకూలంగా ఉందన్న భావన ప్రజలలో నెలకొంది. దానికి తోడు టీడీపీ పత్రికలుగా పేరొందిన మీడియా యజమానులు కూడా అదే సామాజికవర్గంగా ఉండడం, కూటమి ప్రభుత్వం చేసే అకృత్యాలకు సైతం మద్దతు ఇచ్చేలా కథనాలు రాయడం ఏపీ  సమాజం గమనిస్తోంది. ఈ కారణాల రీత్యా ఆదినారాయణరెడ్డి వంటి నేతలు ఈ విషయాన్ని పరోక్షంగా చెప్పి ప్రభుత్వానికి హెచ్చరికలు పంపుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే 2014 టర్మ్‌లో కూడా టీడీపీ ఇలాగే ఆయా సామాజిక వర్గాలను దూరం చేసుకుంది. ఈసారి మరింత ముందుగానే ఆ పరిస్థితి తెచ్చుకుందన్న  భావన వివిధ రాజకీయ పక్షాలలో నెలకొంది.



-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement