వైఎస్సార్‌సీపీ నిరసనలతో దద్దరిల్లిన సభ | YSRCP Leaders Protest At Assembly Budget Session | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ నిరసనలతో దద్దరిల్లిన సభ

Feb 11 2026 12:43 PM | Updated on Feb 11 2026 1:57 PM

YSRCP Leaders Protest At Assembly Budget Session

సాక్షి, విజయవాడ: ఏపీలో అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్‌ నజీర్‌ ప్రసంగించారు. అయితే, గవర్నర్‌ ప్రసంగంలో అన్ని అబద్దాలు, అసత్యాలు ఉన్నాయని.. కూటమి ప్రభుత్వం కావాలనే గవర్నర్‌తో తప్పుడు ప్రసంగం చేయిస్తోందని వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ అరాచక పాలనను ప్రశ్నిస్తూ.. ప్రతిపక్ష నేతలు, వారి ఇళ్లపై జరుగుతున్న దాడులను సభ వేదికగా ఖండించారు.  

ఏపీ బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో కూటమి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, వైఎస్సార్‌సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ సహా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ వద్ద నిరసనలు తెలిపారు. ఫ్లకార్డులు పట్టుకుని వైఎస్సార్‌సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కూటమి వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కూటమి పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. ప్రజల తరపున ప్రశ్నిస్తామనే కారణంతోనే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని మండిపడ్డారు. ప్రజల తరఫున గళం విప్పేందుకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనన్నారు. ప్రజల పక్షాన వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తోందని.. రాష్ట్ర ప్రజలకు జరుగుతున్న అన్యాయాలపై కచ్చితంగా గళం వినిపిస్తామన్నారు. 

అనంతరం, సభలో గవర్నర్‌ ప్రసంగంపై వైఎస్సార్‌సీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గవర్నర్‌ ప్రసంగంలో అన్నీ అబద్దాలేనని ఆరోపించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్‌తో కూడా అబద్ధాలు చెప్పించడం బాధాకరమని అన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు ఇవ్వరు, రాష్ట్రంలో కుప్పకూలిన శాంతి భద్రతలపై నిలదీయనివ్వరు.. అంటూ నినాదాలు చేశారు. తిరుమల లడ్డూపై తప్పుడు ప్రచారం, సభ్యుల హక్కులను కాపాడాలని, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వెంటనే నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తూ.. నినాదాలు తెలిపారు. ఎన్టీఆర్ భవన్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ ను గవర్నర్ చదువుతున్నారు. తన ప్రసంగంలో చదువుతున్నది వాస్తవమా కాదా అని కూడా గవర్నర్ చూడటం లేదు. 3.2 లక్షల కోట్లు అప్పులు చేసి ఎవరికిచ్చారు? అని ప్రశ్నించారు. ఈ క్రమంలో గవర్నర్‌ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. 

ఏపీలో అశాంతి, అశ్లీల నృత్యాల పాలన సాగుతోందని.. కూటమి ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ది లేదన్నారు. మహిళా సాధికారత కొరవడింది.. రైతులకు గిట్టుబాటు ధర లేని పరిస్థితి ఉందన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వకపోవడం వల్ల విద్యార్ధులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలపై పోరాటం కొనసాగిస్తామని అన్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్ పాలనా వైఫల్యాలను ఎండగడతామన్నారు. ఉద్యోగులపై ఈ ప్రభుత్వం తీవ్రమైన ఒత్తిడి తెస్తోంది. ప్రభుత్వం తెచ్చే ఒత్తిడితో ఉద్యోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఉద్యోగులకు బకాయిలు చెల్లించకుండా వేధిస్తోంది. వాలంటీర్లకు హామీలిచ్చి ఈరోజు రోడ్డున పడేశారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని మాటతప్పారు. ఉద్యోగాలిస్తామని మాయమాటలు చెప్పి యువతను మోసం చేశారు. దేశంలోనే గవర్నెన్స్‌లో ఏపీ అట్టడుగు స్థానంలో ఉందని గుర్తు చేశారు. ఇవన్నీ గవర్నర్‌ ప్రసంగంలో ఎందుకు చేర్చలేదని నిలదీశారు. అనంతరం, సభను వాకౌట్‌ చేసి బయటకు వెళ్లిపోయారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement