ఇరాన్ యుద్ధం: షాకిస్తున్న మృతుల గణాంకాలు | How Many People Have Been Killed in the Iran War | Sakshi
Sakshi News home page

ఇరాన్ యుద్ధం: షాకిస్తున్న మృతుల గణాంకాలు

Apr 1 2026 10:37 AM | Updated on Apr 1 2026 10:50 AM

How Many People Have Been Killed in the Iran War

టెహ్రాన్/జెరూసలేం: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు తీవ్ర విషాదాన్ని మిగులుస్తున్నాయి. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో మొదలైన ఈ రక్తపాతం ఇప్పుడు ఇరాన్ పొలిమేరలు దాటింది. కొద్ది వారాల వ్యవధిలోనే వేల సంఖ్యలో ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. యుద్ధ భూమి నుంచి అందుతున్న మృతుల గణాంకాలు గుండెల్ని పిండేస్తున్నాయి.

ఇరాన్: మరణాల హోరు
యుద్ధానికి ప్రధాన కేంద్రమైన ఇరాన్‌లో పరిస్థితి అత్యంత భయానకంగా ఉంది. హక్కుల సంస్థ ‘హర్నా’ లెక్కల ప్రకారం, ఇక్కడ ఇప్పటివరకు 3,492 మంది మృతి చెందారు. వీరిలో 1,574 మంది సామాన్య పౌరులు కాగా, కనీసం 236 మంది పసిపిల్లలు ఉండటం గమనార్హం. మరోవైపు రెడ్ క్రాస్ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం మరణాల సంఖ్య 1,900 గా ఉండవచ్చని, దాదాపు 20,000 మంది గాయపడ్డారని అంచనా వేస్తోంది. యాక్టివ్ వార్ జోన్ కావడంతో అసలు మరణాల సంఖ్య ఈ గణాంకాలకు ఎన్నో రెట్లు ఎక్కువగా ఉండొచ్చని అంతర్జాతీయ వర్గాలు భావిస్తున్నాయి.

లెబనాన్ నుంచి గల్ఫ్ వరకు..
యుద్ధం కేవలం ఇరాన్‌కే పరిమితం కాలేదు

లెబనాన్: ఇక్కడ ఇజ్రాయెల్ దాడుల్లో 1,268 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 124 మంది చిన్నారులు ఉన్నారు. సుమారు 400 మంది హిజ్బుల్లా ఫైటర్లు కూడా హతమైనట్లు సమాచారం. విధి నిర్వహణలో ఉన్న ముగ్గురు ఇండోనేషియా యూఎన్‌ శాంతి భద్రతల సిబ్బంది కూడా ఈ దాడులకు బలైపోయారు.

ఇరాక్: ఇక్కడ పౌరులు, మిలిషియా సభ్యులు కలిపి 105 మంది మరణించారు.

గల్ఫ్ దేశాలు: యుద్ధం సెగ గల్ఫ్ దేశాలకూ తగిలింది. ఇరాన్ దాడుల వల్ల యూఏఈలో 10 మంది, కువైట్‌లో  ఏడుగురు, ఒమన్, బహ్రెయిన్, సౌదీ అరేబియాల్లో మరికొందరు ప్రాణాలు కోల్పోయారు.

ఇజ్రాయెల్ తదితర ప్రాంతాలు
ఇటు ఇరాన్, లెబనాన్ నుంచి వచ్చిన మిస్సైల్ దాడుల వల్ల ఇజ్రాయెల్‌లో 19 మంది పౌరులు, సరిహద్దు పోరులో 10 మంది సైనికులు మృతి చెందారు. వెస్ట్ బ్యాంక్‌లో ఇరాన్ మిస్సైల్ పడి నలుగురు పాలస్తీనా మహిళలు మృతి చెందగా, సిరియాలో మరో నలుగురు బలయ్యారు. ఇరాక్‌లో జరిగిన డ్రోన్ దాడిలో ఒక ఫ్రెంచ్ సైనికుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ గణాంకాలు కేవలం అంకెలు కావు, ఛిద్రమైన ఎన్నో కుటుంబాల గాథలు. యుద్ధం ఇంకా కొనసాగుతుండటంతో ఈ మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement