క్యూబా చేరుకున్న రష్యా చమురు.. ఇరాన్‌కు చైనా ఝలక్‌? | China Three Ships Crossing Iran Strait of Hormuz | Sakshi
Sakshi News home page

క్యూబా చేరుకున్న రష్యా చమురు.. ఇరాన్‌కు చైనా ఝలక్‌?

Apr 1 2026 9:07 AM | Updated on Apr 1 2026 9:29 AM

China Three Ships Crossing Iran Strait of Hormuz

బీజింగ్‌: తమ దేశానికి రావాల్సిన మూడు చమురు నౌకలు విజయవంతంగా హార్మూజ్‌ జలసంధిని దాటాయని చైనా మంగళవారం ప్రకటించింది. హార్మూజ్‌ను దాటడంలో ఎంతగానో సహకరించిన ఇరాన్‌ పేరును ప్రస్తావించకుండానే నౌకల సాఫీ ప్రయాణానికి చేయూతనందించిన వారికి ధన్యవాదాలు అంటూ చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్‌ మంగళవారం ఒక ప్రకటన విడుదలచేశారు. పశ్చిమాసియా యుద్ధం మొదలయ్యాక హార్మూజ్‌ గుండా తమ నౌకలు ప్రయాణిస్తున్నాయని చైనా అధికారికంగా ప్రకటించడం ఇదే తొలిసారి.

మరోవైపు ఇరాన్‌లో పరిస్థితులపై పాకిస్తాన్‌ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి మొహమ్మద్‌ ఇషాన్‌ దార్‌తో చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ మంగళవారం మంతనాలు జరిపారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు సన్నిహిత నేత అయిన వాంగ్‌ యీ ఇప్పటికే దేశ అధికార కమ్యూనిస్ట్‌ పార్టీ పొలిటికల్‌ బ్యూరోలోనూ సభ్యునిగా ఉన్నారు.  

క్యూబా చేరుకున్న రష్యా చమురు.. 
ఇదిలా ఉండగా.. ఎట్టకేలకు మూడు నెలల తర్వాత రష్యా ముడిచమురు నౌక క్యూబాకు చేరుకుంది. కొంతకాలంగా రష్యా చమురును కొనుగోలుచేయొద్దంటూ క్యూబాపై అమెరికా ప్రభుత్వం అంతర్జాతీయ ఆంక్షలు విధించడంతో క్యూబా చమురుకష్టాలు మొదలయ్యాయి. తాజాగా రష్యా చమురును తాత్కాలికంగా అనుమతిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించిన కొన్ని గంటలకే క్యూబాలోని మటాంజా నౌకాశ్రయానికి రష్యా చమురునౌక ‘అనటోలీ కొలోడ్కిన్‌’చేరుకుంది.

మార్చి 8న రష్యా నుంచి బయల్దేరి ఇంగ్లిష్‌ ఛానల్‌ మీదుగా ఈ నౌక ఇటీవల అట్లాంటిక్‌ సముద్రజలాల్లోకి ప్రవేశించి అమెరికా అనుమతుల కోసం వేచిచూస్తున్న విషయం తెల్సిందే. ఇది ఏకంగా 7,30,000 బ్యారెళ్ల చమురును మోసుకొచ్చింది. నౌక రాకపై క్యూబా ఇంధన, గనుల మంత్రి విసెంటే లేవీ అమితానందం వ్యక్తంచేశారు. ఇన్నాళ్లూ క్యూబా తమ చమురుఅవసరాల కోసం అత్యధికంగా వెనెజువెలాపై ఆధారపడేది. వెనెజువెలా అధ్యక్షుడు మదురోను అమెరికా అరెస్ట్‌చేశాక ఆ దేశం నుంచి చమురురాక దాదాపు ఆగిపోయింది. దీంతో రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోబోతే అమెరికా అడ్డుకోవడం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement