ఆగిన ‘ఆరోగ్యశ్రీ’ | Private network hospitals have completely stopped free medical services | Sakshi
Sakshi News home page

ఆగిన ‘ఆరోగ్యశ్రీ’

Apr 2 2026 5:22 AM | Updated on Apr 2 2026 5:22 AM

Private network hospitals have completely stopped free medical services

ఎన్టీఆర్‌ వైద్యసేవలు నిలిపివేస్తున్నట్టు అనంతపురంలోని ఓ ఆస్పత్రి ఎదుట ఏర్పాటు చేసిన బోర్డు

రాష్ట్రవ్యాప్తంగా ఉచిత వైద్యసేవలను పూర్తిగా నిలిపేసిన ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ ఆస్పత్రులు

నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు ప్రభుత్వం రూ.3 వేల కోట్ల బకాయి

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ ఆస్పత్రులు బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ (ఎన్టీ ఆర్‌వైద్యసేవలు)పథకం కింద ఉచిత వైద్య సేవలను పూర్తిగా నిలిపివేశాయి. చంద్రబాబు ప్రభుత్వం రూ.3 వేల కోట్ల బకాయిలు పెట్టడంతో ఆస్పత్రులు సమ్మెబాట పట్టా­యి. ఆరోగ్య­శ్రీ కార్డులతో ఉచిత చికిత్స కోసం ఆస్పత్రులకు వెళ్లిన రోగులకు డబ్బులు కడితేనే వైద్యం చేస్తామని యాజమాన్యాలు తేల్చి చెప్పేస్తున్నాయి. దీంతో తొలి రోజే నిరుపేద, మధ్య తరగతి అనారోగ్య బాధితులు తీవ్ర అవస్థలు పడ్డారు. రోడ్డు, ఇతర ప్రమాదాల్లో గాయపడిన, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న బాధితులు చేసేదేమీ లేక డబ్బులు కట్టి ఆస్పత్రుల్లో చేరారు. 

గత్యంతరం లేకనే...  
ప్రభుత్వం రూ.3 వేల కోట్ల బకాయిలు పెట్టడంతో గత్యంతరం లేకనే సమ్మె చేస్తున్నామని యాజమా­న్యాలు ఆస్పత్రుల ముందు పోస్టర్లను ఏర్పాటు చేశా­యి. ఆస్పత్రులు దివాళా తీయకుండా..రూ.3 వేల కోట్ల బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేశాయి.

ఇంకా మోసపోలేం... 
ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల సమ్మె నేపథ్యంలో బుధవారం ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ అసోసియే­షన్‌(ఆశా) ప్రతినిధులతో మంగళగిరిలోని ఆరో­గ్యశ్రీ కార్యాలయంలో వైద్యశాఖ కార్యదర్శి సౌరభ్‌గౌర్‌ భేటీ అయ్యారు. సమ్మె విరమించి సేవలు పునరుద్ధరించాలని ఆయన కోరారు. ప్రభుత్వం తరఫున సౌరభ్‌గౌర్‌ చేసిన ప్రతిపాదనను ఆశా ప్రతినిధులు తిరస్కరించారు. దీంతో ‘రెండు వారాల్లో రూ.వెయ్యి కోట్లు, అనంతరం మూడు నెలల్లో మరో రూ.వెయ్యి కోట్లు విడుదల చేస్తాం. కొత్త బీమా విధానం అమలును వాయిదా వేసి, ప్యాకేజీ ధరలు, ఇతర అంశాలపై ‘ఆశా’ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసు­కుంటాం’ అని సౌరభ్‌ గౌర్‌ ప్రతిపాదించినట్లు సమా­చారం. అయితే ‘ఇప్పటికే ఈ ప్రభుత్వం అనేక హామీలిచ్చి దగా చేసింది. 

చాలాసార్లు మోసపోయాం. ఇక మోసపోలేం..’ అని ఆశా ప్రతినిధులు తేల్చి చెప్పినట్టు తెలిసింది. గతే­డాది సమ్మె చేసినప్పుడు డిసెంబర్‌లోగా బకాయిలన్నీ తీర్చేస్తామన్న హామీ ఏమైందని ప్రభుత్వంపై నిప్పులు చెరిగినట్టు సమాచారం. ‘ఆశా’ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ విజయ్‌కుమార్‌ ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘అధికారురులు నోటి మాటల ద్వారా ఇచ్చిన హామీలను నమ్మి సమ్మె విరమించబోం. ప్రభుత్వం గతంలో కూడా ఇ­లా­ంటి హామీలు ఇచ్చి నెరవేర్చలేదు. బకా­యిలు ఎప్పటిలోగా చెల్లిస్తారో ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ కావాలి.’ అని ఆయన డిమాండ్‌ చేశారు. కాగా, ప్రభుత్వ ప్రతిపాదనలపై బుధవారం రాత్రి ఆశా సర్వసభ్య సమావేశంలో చర్చించారు. ప్రభుత్వ ప్రతిపానలపై విముఖ వ్యక్తం చేస్తూ సమ్మెను కొనసాగించాలని నిర్ణయించారు. రూ.1,000 కోట్లు బిల్లులు విడుదల చేసే వరకు సమ్మె కొనసాగించాలని తీర్మానించారు.    

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement