సాక్షి, ఢిల్లీ: ప్రస్తుత రూపంలో అమరావతి బిల్లును వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ సభ్యులు వాకౌట్ చేశారు. ప్రస్తుత రూపంలో అమరావతి బిల్లును అంగీకరించం అని వైఎస్సార్‌సీపీ తేల్చి చెప్పింది. రైతుల సమస్యలు, నిధుల గురించి చెప్పకుండా కేవలం పేరు మాత్రమే తీసుకొస్తే లాభం లేదన్న వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి.. తాము అమరావతికి కానీ, మరే ప్రాంతానికి కానీ వ్యతిరేకం కాదన్నారు.
అమరావతి పేరుతో దోపిడీ..
అమరావతి బిల్లుపై లోక్‌సభలో ఇవాళ జరిగిన చర్చలో మిథున్‌రెడ్డి మాట్లాడుతూ.. అమరావతి పేరుతో ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. జీతాలు, సంక్షేమానికి డబ్బులు లేవని చెబుతున్న చంద్రబాబు.. అమరావతి అభివృద్ధికి ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. ఏపీలో జరుగుతున్న అన్యాయాల నుంచి డైవర్ట్ చేయడానికే అమరావతి డ్రామా అంటూ దుయ్యబట్టారు.
చర్చలో సమాజ్‌వాదీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ కూడా మాట్లాడుతూ.. ఏపీలో ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరం విశాఖ ఉంది.. విశాఖ రాజధానిగా అభివృద్ధి చేస్తే సహజంగా ఉండేదని.. ల్యాండ్ పూలింగ్, నిధుల సమస్య వచ్చేదేకాదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ల్యాండ్ పూలింగ్ పెద్దలకే లాభం.. రైతులకు ఏం వస్తుందంటూ ధర్మేంద్ర ప్రశ్నించారు. అమరావతి కోసం భారీ ఎత్తున రైతుల నుంచి భూములు తీసుకున్నారు. రైతులకు ఇప్పటివరకు పరిహారం ఎందుకివ్వలేదు? అంటూ ఆయన నిలదీశారు.
ఉద్ధవ్ సేన ఎంపీ అర్వింద్‌సావంత్ మాట్లాడుతూ ఏపీ విభజన సమయంలో టీడీపీ ఐదేళ్లు ప్రత్యేక హోదా కోరిందని.. అప్పుడు శివసేన, టీడీపీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. అప్పుడు ఐదేళ్లు హోదా కావాలని పదేపదే అడిగారు. ఇప్పుడు ఈ అంశాని ఎందుకు ప్రస్తావించడం లేదంటూ ఆయన ప్రశ్నించారు.


