అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే చంద్రబాబు డ్రామాలు : వైఎస్ జగన్ మండిపాటు
2014లో 50 వేల ఎకరాల్లో అద్భుత రాజధాని అంటూ బాహుబలి సెట్టింగులు
రోడ్లు, సీవరేజ్, నీరు, విద్యుత్ కల్పనకే ఎకరానికి రూ.2 కోట్లు అవసరమన్న చంద్రబాబు
ఇప్పుడేమో మున్సిపాల్టీగా మిగిలిపోతుందంటూ మరో 50 వేల ఎకరాలకు ఎసరు
మొత్తంగా లక్ష ఎకరాల్లో రోడ్లు, సీవరేజ్, నీరు, విద్యుత్ వసతుల కల్పనకే రూ.2 లక్షల కోట్లు అవసరం
ఇక భవనాల నిర్మాణ ఖర్చు దీనికి అదనం
ఏడేళ్లలో సీఎం చంద్రబాబు రాజధానికి ఖర్చు పెట్టింది కేవలం రూ.8 వేల కోట్లే
ఈ లెక్కన రోడ్లు, సీవరేజ్, నీరు, విద్యుత్ వసతులు కల్పించడానికే దశాబ్దాలు పడుతుంది
అప్పటికి ఆ వ్యయం రూ.2 లక్షల కోట్లు కాస్తా రూ.4 లక్షల కోట్లో.. రూ.10 లక్షల కోట్లకు చేరుతుంది
అందుకే తక్కువ పెట్టుబడితో గ్రోత్ ఇంజిన్‌గా మార్చాలనే విశాఖపట్నంను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా చేయాలనుకున్నాం
శ్రీబాగ్ ఒడంబడిక మేరకు కర్నూలును న్యాయ రాజధాని చేయాలనుకున్నాం
అమరావతిని శాసన రాజధానిగా కొనసాగించాలనుకున్నాం
మేం చెప్పిన ఆచరణాత్మక ప్రణాళిక చంద్రబాబుకు నచ్చలేదు.. ఎల్లో మీడియాతో కలిసి మాపై విషంగక్కారు
ఇప్పుడు అమరావతిని అడ్డం పెట్టుకుని మీరు అవినీతికి పాల్పడుతున్నారు
చదరపు అడుగు నిర్మాణానికి రూ.11 వేల నుంచి రూ.14 వేలా?
అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టయితే మరి ఇన్ని అప్పులు ఎందుకు?
22 నెలల్లోనే రూ.3.37 లక్షల కోట్ల అప్పు.. ఈ స్థితిలో రూ.2 లక్షల కోట్లతో రాజధానిని ఎప్పుడు అభివృద్ధి చేస్తారు?
రాజధాని స్కామ్‌ల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే అసెంబ్లీలో తీర్మానం
తీరా 200 ఎకరాల్లోనే రాజధాని అని చెప్పకనే చెబుతున్నారు
ఈ మాత్రం దానికి మారుమూల, నిర్మానుష్య ప్రాంతానికి ఎందుకెళ్లావ్?
రాష్ట్రంలో అమరావతి సహా మేము ఏ ప్రాంతానికీ వ్యతిరేకం కాదు
ఆరు నెలల క్రితం మేం చెప్పిన ప్లాన్ బీ అయినా అమలు చేయండి
మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు మధ్య 110 కిలోమీటర్ల కారిడార్‌ను ‘మావిగన్’ రాజధానిగా ప్రకటించండి.. లేదంటే ప్రజలు మీకు బుద్ధిచెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి
రాజ్యాంగంలో దేశానికి రాజధాని అని మాత్రమే ఉంది.. రాష్ట్రాల రాజధాని ప్రస్తావనే లేదు..
రాజధాని అంశం రాష్ట్రాల ఇష్టమని తేల్చి చెప్పిన కేంద్రం
2000లో కొత్తగా ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల ఏర్పాటు.. రాజధానిపై ఆ రాష్ట్రాలే నిర్ణయం
ఎవరికీ వర్తించనిది మనకు మాత్రమే ఎందుకు వర్తిస్తోంది?
ఆచరణాత్మక ఆలోచన.. మావిగన్
చెన్నై, ముంబై పోర్టు ఆధారిత సిటీలు. ఈ తరహాలోనే మచిలీపట్నంృగుంటూరు మధ్య 110 కిలోమీటర్ల జాతీయ రహదారి వెంబడి ప్రాంతాలను రాజధాని కారిడార్‌గా ప్రకటించండి. మచిలీపట్నం నుంచి తొలి రెండు అక్షరాలు ఎంఏ, విజయవాడలోంచి తొలి రెండు అక్షరాలు వీఐ, గుంటూరు నుంచి జీయూఎన్ తీసుకుని ‘మావిగన్’ అని పేరుపెట్టండి. గన్ అంటే బాగుండదు.. జగన్ గుర్తొస్తారనుకుంటే వేరే పేరు పెట్టుకోండి. రాజధానిగా అభివృద్ధి చేయండి. అంతేకానీ రూ.2 లక్షల కోట్లు ఖర్చు అంటే అయ్యేది కాదు. 
రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు ఏడేళ్లు సీఎంగా ఉండి లక్ష ఎకరాల అమరావతిలో ఎంత వరకు కట్టారు? అమరావతి తన పెట్ ప్రాజెక్టు (మానస పుత్రిక) అని చెప్పే చంద్రబాబు ఏ మేరకు నిర్మాణాలు చేశారు? చంద్రబాబు డబ్బా కొట్టినట్టు అమరావతి నిజంగా సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అయ్యిందా? ఏ దేశం వెళితే ఆ దేశం బొమ్మలు చూపించి అదిగో.. ఇదే అమరావతి అంటారు. ఇప్పుడు అమరావతి ఎంత వరకు వచ్చింది? ఆ దేశాలు ఇక్కడ కనిపిస్తున్నాయా?
కనీసం భూములు ఇచ్చిన రైతులకు హామీలను నెరవేర్చారా? మొదట తీసుకున్న 50 వేల ఎకరాల్లోనే కేవలం రోడ్లు, కరెంటు, డ్రెయినేజీ, నీటి సౌకర్యాల కల్పనకు ఎకరానికి కేంద్రానికి, బ్యాంకులకు చంద్రబాబు చెప్పిన లెక్కల ప్రకారం రూ.2 కోట్లు అవుతుంది. అంటే 50 వేల ఎకరాలకు రూ.లక్ష కోట్లు ఖర్చు చేయాలి. ఇంకా భవనాల ఖర్చు అదనం. దీనికే దిక్కులేదంటే మళ్లీ మరో 50 వేల ఎకరాలు అదనంగా సేకరిస్తున్నారు. దీనికి మరో రూ.లక్ష కోట్లు అవుతుంది. ఇలా అమరావతి బడ్జెట్‌ను ఎందుకు పెంచాల్సి వస్తోంది? నిర్మాణాలకు, అభివృద్ధికి డబ్బులు ఎలా వస్తాయి? లక్ష ఎకరాల్లో కేవలం రోడ్లు, నీరు, డ్రైనేజీ, విద్యుత్ కోసం రూ.2 లక్షల కోట్లు కావాలి. ఇదంతా చేయడానికి ఎన్ని దశాబ్దాలు పడుతుంది? ఇంత సుదీర్ఘ సమయంలో రూ.2 లక్షల కోట్ల వ్యయం కాస్తా రూ.10 లక్షల కోట్లకు పెరుగుతుంది.
భవిష్యత్తులో రాజధానిని ఎవరూ మార్చకుండా చట్టం తెస్తున్నామని చంద్రబాబు డ్రామా చేస్తున్నారు. అసెంబ్లీలో వీళ్లు చేయగా లేనిది.. అదే అసెంబ్లీలో మార్చలేరా? చట్టాలు చేసిన తర్వాత చట్ట సవరణలు చేయలేరా? ఈ విషయం చంద్రబాబుకు తెలిసినా, తన అవినీతిని కప్పిపుచ్చుకునే డ్రామా చేస్తున్నారు.
2014 నుంచి ఇప్పటి వరకు 12 ఏళ్ల కాలంగా మనస్ఫూర్తిగా చంద్రబాబు ఈ ప్రాంతంలో ఉన్నారా? ఇక్కడ కాపురం పెట్టారా? ఇప్పటికీ కూడా మీ కుటుంబాలన్నీ ఎక్కడున్నాయి? 2019 వరకు హైదరాబాద్‌కు షటిల్ సర్వీసు చేశారు. ఒకవైపు సీఎంగా ఉంటూ హైదరాబాద్‌కు వెళ్లి వచ్చారు. ప్రతిపక్ష నాయకుడిగా 2024 ఎన్నికల వరకు వీళ్ల అడ్రస్ మొత్తం హైదరాబాద్. ఇప్పుడు కూడా వారానికి రెండు రోజులు అక్కడే. అదీ చంద్రబాబు తీరు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు కొడుకైతే వారానికి నాలుగు రోజులు ఉంటే గొప్ప. పవన్ కళ్యాణ్ ఎప్పుడుంటాడో తెలీదు. ప్రత్యేకంగా ఒక్కొక్కరికి ఒక్కో విమానం. మమ్మల్ని తిట్టడానికే అసెంబ్లీ. నిజానికి మా ప్రశ్నలు ప్రజలను ఆలోచింపజేసేవి.
- వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: చంద్రబాబు తన స్కామ్‌ల కోసం ఏ రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను దెబ్బ తీస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ఆచరణ సాధ్యం కానిది.. అసాధ్యమైన దానిపై భ్రమలు కల్పిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. అమరావతి క్యాపిటల్(రాజధాని)ను సీఎం చంద్రబాబు దేశంలో అతి పెద్ద స్కామ్‌గా మార్చేశారని ధ్వజమెత్తారు. అమరావతి ప్రజల రాజధాని కాదని, స్కామ్‌ల రాజధాని అని అభివర్ణించారు. రాజధాని నిర్మాణ పనుల్లో చంద్రబాబు దోపిడీ ముందు వీరప్పన్ కూడా సరిపోడంటూ ఎద్దేవా చేశారు. అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే రాజధానికి చట్టబద్ధత పేరుతో డ్రామా చేస్తున్నారని దుయ్యబట్టారు. రాజధానిలో అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే సీఎం చంద్రబాబు డ్రామా చేస్తున్నారని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని అమరావతికి సంబంధించి నాణానికి రెండో పార్శ్వాన్ని సాక్ష్యాధారాలతో ఆయన వివరించారు. అమరావతి రాజధానిలో 12 ఏళ్ల క్రితం సీఎం చంద్రబాబు చెప్పిన లెక్కల ప్రకారమే రోడ్లు, నీరు, డ్రైనేజీ, విద్యుత్ వసతుల కల్పనకే ఎకరానికి రూ.2 కోట్లు చొప్పున లక్ష ఎకరాలకు రూ.2 లక్షల కోట్లు వ్యయం చేయాల్సి వస్తుందన్నారు.
ఏడేళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు కేవలం రూ.8 వేల కోట్లే రాజధాని కోసం ఖర్చు చేశారని.. ఈ లెక్కన కనీస సదుపాయాలు కల్పించడానికే దశాబ్దాలు పడుతుందన్నారు. అప్పుటికి ఆ వ్యయం రూ.4 లక్షల కోట్లు అవుతోందో.. లేక రూ.10 లక్షల కోట్లకు చేరుతుందో అన్నారు. అప్పు తెచ్చిన నిధులు.. బడ్జెట్ ద్వారా కేటాయించిన నిధులు ఒక్క అమరావతికే ఖర్చు పెడితే.. రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల అభివృద్ధి మాటేంటని, ప్రభుత్వాలు బాధ్యతగా ప్రజలకు చేయాల్సిన సంక్షేమం, మంచి మాటేంటని వైఎస్ జగన్ ప్రశ్నించారు. రాష్ట్రానికి రాజధాని గుదిబండగా మారకూడదనే ఉద్దేశంతో.. తక్కువ పెట్టుబడితో రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్‌గా మారే అవకాశం ఉన్న విశాఖపట్నంను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా.. శ్రీబాగ్ ఒడంబడికను గౌరవిస్తూ కర్నూలును న్యాయ రాజధానిగా.. అమరావతిని శాసన రాజధానిగా కొనసాగించాలనుకున్నామని వివరించారు.
సీఎం చంద్రబాబుకు అది నచ్చలేదని.. అందుకే వాటిని రద్దు చేశారన్నారు. రాష్ట్రాన్ని తక్కువ ఖర్చుతో గ్రోత్ ఇంజిన్‌గా మార్చాలనే ఉద్దేశంతో ఆర్నెల్ల క్రితం మేం ప్రతిపాదించిన ప్లాన్ బీ ప్రకారం అమరావతిలో రోడ్లు, నీరు, డ్రైనేజీ, విద్యుత్ వసతుల కల్పనకు అయ్యే వ్యయం రూ.2 లక్షల కోట్లలో కేవలం పది శాతం ఖర్చు చేస్తే మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు మధ్య 110 కిలోమీటర్ల కారిడార్ ‘మావిగన్’ మహానగరంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. అమరావతిలో ఇప్పటికీ భవనాలు ప్రాథమిక దశలో ఉన్న నేపథ్యంలో ‘మావిగన్’ ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించి భవనాలను కట్టాలని సూచించారు. రాజధాని అమరావతిలో చంద్రబాబు చేస్తున్న కుంభకోణాలు బట్టబయలవుతాయని.. దేవుడు, ప్రజలు చంద్రబాబుకు మొట్టికాయలు వేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..
అప్పుడు బెస్ట్ కేపిటల్.. ఇప్పుడు మున్సిపాలిటీనా?
⇒ 2019కి ముందు చంద్రబాబు స్వయంగా చేసిన మాస్టర్ ప్లాన్ ప్రకారం 50 వేల ఎకరాల్లో ప్రపంచంలో అత్యద్భుతమైన (బెస్ట్), బ్రహ్మాండమైన రాజధాని వస్తుందని బాహుబలి సెట్టింగులు చూపించారు. ఆ మాస్టర్ ప్లాన్‌ను ఇప్పుడు ఎందుకు మారుస్తున్నారు? అప్పుడు ఇదే 50 వేల ఎకరాల్లోనే ప్రపంచంలోనే బెస్ట్ కేపిటల్ అని ఊదరగొట్టిన వ్యక్తి, ఈ రోజు మున్సిపాలిటీగా మిగిలిపోతుందంటూ మరో 50 వేల ఎకరాలు కావాలని చెప్పడం స్కాములు చేయడానికే!
⇒ ఎక్కడా లేని విధంగా అమరావతిలో చదరపు అడుగు (ఎస్‌ఎఫ్‌టీ) నిర్మాణానికి ఏకంగా రూ.11 వేల నుంచి రూ.14 వేలు ఖర్చు అవుతుంది. అంతంత ఎందుకు ఖర్చు చేస్తున్నారు? ఏ స్కాములతో ఇది పెరుగుతోంది. వీటికి సమాధానం ఎక్కడైనా అసెంబ్లీలో చెప్పారా చంద్రబాబు? ఐదున్నర గంటలపాటు నిర్వహించిన అసెంబ్లీ సమావేశంలో వీటికి సమాధానం చెప్పలేదు.
⇒ కేవలం జగన్‌ను, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తిపోయడానికి, బూతులు తిట్టడానికి మాత్రమే వాడుకున్నారు. రాజధాని పేరుతో పట్టపగలు చేస్తున్న దోపిడీపై ప్రజలను డైవర్ట్ చేసేందుకు డ్రామా చేశారు. ఒకవైపు అసెంబ్లీని పిలుస్తారు.. మరోవైపు అదే చట్టసభలో భాగమైన కౌన్సిల్(శాసనమండలి)ను పిలవరు. కౌన్సిల్‌ను పిలిస్తే రాజధాని పేరుతో చంద్రబాబు చేస్తున్న అవినీతి బాగోతాన్ని మా సభ్యులు బయట పెడతారని, చంద్రబాబు బండారాన్ని కడిగి పారేస్తారని భయం.
రాజధానిలో అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే తీర్మానం డ్రామా
⇒ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటం రాష్ట్ర ప్రజలు చేసుకున్న దురదృష్టం. అసలు చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు. నిజాయితీ లేదు. బాబు దృష్టిలో పరిపాలన అంటే కేవలం దోపిడీ, అవినీతి చేయడమే. రకరకాలుగా దోపిడీ కోసం డ్రామా చేస్తాడు. విజన్, సంపద సృష్టి అంటాడు. కొత్త కొత్త పేర్లతో డ్రామాలు చేస్తూ ప్రజల దృష్టిని మళ్లించి స్కాము(కుంభకోణం)లతో దోచేస్తున్నారు. అమరావతిలో గత వారం శాసనసభ తీర్మానం డ్రామాలో ఇవన్నీ స్పష్టంగా కనిపించాయి.
⇒ వాస్తవానికి రాజధానిపై అసెంబ్లీలో తీర్మానం అవసరం లేదని చంద్రబాబు ప్రభుత్వంలోని మంత్రి పార్థసారథి ప్రకటించారు. అసలు రాజ్యాంగంలో రాజధాని అనే పదం ఎక్కడా లేదు. కేవలం దేశానికి మాత్రమే రాజధాని అని ఉంది. రాష్ట్రాలకు సంబంధించి రాజధానిపై ప్రత్యేకంగా ప్రస్తావన లేదు. సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వం సైతం రాజధాని అంశం రాష్ట్రాల ఇష్టమని అధికారికంగా ఏపీ హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. రాజధాని విషయంలో కేంద్రానికి ఎలాంటి పాత్ర లేదని అందులో పేర్కొంది.
⇒ మన కళ్ల ఎదుటే 2000 సంవత్సరంలో కేంద్రం కొత్తగా ఉత్తరాఖండ్, జార్ఖండ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలను ఏర్పాటు చేసింది. ఆ రాష్ట్రాలకు రాజధానులను కేంద్రం నిర్ణయించలేదు. ఆయా రాష్ట్రాలు నిర్ణయించుకున్నాయి. మరి ఎవరికీ వర్తించనిది మనకు మాత్రమే ఎందుకు వర్తిస్తోంది. ఎందుకీ డ్రామా? రాజధానిపై రాష్ట్రాలకే హక్కు ఉన్నప్పుడు చంద్రబాబు డ్రామా చేస్తూ రైతులను, ప్రజలను నిలువునా ముంచేస్తున్నారు.
స్కాముల కోసం చట్ట సభలనూ వదలట్లేదు
⇒ చంద్రబాబు హైకోర్టు, అసెంబ్లీని కూడా స్కాముల కోసం వదలట్లేదు. దుబారా, విచ్చలవిడి దోపిడీ కోసం చట్టసభలను వాడేస్తున్నారు. చంద్రబాబు తన అవినీతిని సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు భవనాలకు పరిమితం చేయలేదు. ఏ పని చూసినా దోపిడీ కనిపిస్తోంది. రోడ్లు, మురుగు నీటి కాలువలు, సీవరేజీ ప్లాంట్, కొండవీటి వాగు వరద మళ్లింపు, లే అవుట్ డెవలప్‌మెంట్, అర్కిటెక్చర్ డిజైన్ల ఫీజుల్లో అవినీతికి పాల్పడ్డారు.
రూ. 2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు?
⇒ రోడ్లు, నీరు, డ్రైనేజీ, విద్యుత్ వసతుల కల్పనకు రూ.2 లక్షల కోట్లు కాకుండా భవనాల నిర్మాణానికి అదనంగా ఖర్చు చేయాల్సి ఉంది. రూ.2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు? ఒక్క అమరావతిలో కేవలం మౌలిక వసతులకే ఇంత ఖర్చు చేస్తుంటే రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి.. ఇతర ప్రభుత్వ బాధ్యతల పరిస్థితి ఏమిటి? ఇప్పటికే చంద్రబాబు అమరావతిపై అప్పులు తెచ్చి.. స్కాములు చేయడంతో దాని ప్రభావం రాష్ట్రంపై కనిపిస్తోంది.
⇒ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా నాడు–నేడు పనులు ఆగిపోయాయి. స్కూళ్లు, హాస్పిటళ్లను పట్టించుకునే నాథుడు లేదు. వసతి దీవెన, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పేరుకుపోయాయి. ఈ ఏడాదితో కలిపితే రూ.10 వేల కోట్లు అవసరం అయితే బడ్జెట్‌లో విదిల్చింది స్వల్పమే. ప్రభుత్వంపై నెట్‌వర్క్ ఆస్పత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పేదలకు ఆరోగ్యశ్రీలో ఉచిత వైద్యం నిలిపివేస్తున్నాయి. రైతులకు సంబంధించి ఏ పంటకు గిట్టుబాటు ధర రావట్లేదు. ప్రభుత్వం జోక్యం చేసుకోవట్లేదు. ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయింది. ఆర్బీకేలను నిర్వీర్యం చేశారు. ఈ–క్రాప్‌ను పట్టించుకోవట్లేదు. ఏడాదికి రూ.వెయ్యి కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు పెడితే పూర్తయ్యే మెడికల్ కాలేజీలను నిలిపేశారు.
⇒ మా హయాంలోని పథకాలు రద్దయ్యాయి. రాష్ట్రానికి అవసరమయ్యే కార్యక్రమాలన్నీ గతించాయి. చివరికి చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్, సూపర్ సెవన్ హామీలు మోసాలుగా తేలాయి. ఉద్యోగులకు రూ.36 వేల కోట్లు బకాయిలున్నాయి. చంద్రబాబు తన జీవితాంతం అమరావతిలోనే రోడ్లు, కరెంటు, నీళ్లు, డ్రెయిన్లు కడతారా? వాటిని కట్టడానికి జీవితాంతం అప్పులు చేస్తారా? అంత వరకు రాష్ట్రంలో ప్రజలు ఇబ్బంది పడుతూనే ఉండాలా? ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు చెప్పిన లక్ష ఎకరాల అమరావతి ఎప్పటికి పూర్తవుతుంది? రూ.2 లక్షల కోట్లు పెట్టే స్తోమత మనకు ఉందా? ఇవన్నీ అడుగుతామనే అసెంబ్లీలో తీర్మానం అంటూ కౌన్సిల్‌ను పిలవకుండా తానేదో గొప్పగా సాధించినట్టు డ్రామాలు చేశారు. నాయకులుగా ఆచరణాత్మక ఆలోచన చేయాల్సిన ధర్మం మనపై ఉంది. అంతేగానీ స్కాములకు స్టాంపు వేసే కార్యక్రమం, డైవర్షన్ పాలిటిక్స్ చేయకూడదు.
ఖర్చు చేసింది రూ.8 వేల కోట్లే!
⇒ వైఎస్సార్‌సీపీ రాష్ట్రంలో ఈ ప్రాంతానికే కాదు.. ఏ ప్రాంతానికీ అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ వ్యతిరేకం కాదు. చంద్రబాబు చెప్పిన లెక్క ప్రకారమే అమరావతిలో ఒక ఎకరా అభివృద్ధికి (రోడ్లు, కరెంటు, డ్రెయినేజీ, నీటి వసతి) మాత్రమే రూ.2 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. ఇంక భవనాల ఖర్చు అదనం. మొదటి దశలో తీసుకున్న 50 వేల ఎకరాల్లో సాధారణ మౌలిక వసతుల అభివృద్ధికే దిక్కులేదు. రెండో దశలో మరో 50 వేల ఎకరాలు తీసుకుంటున్నారు. అందులో 20 వేల ఎకరాలకు నోటిఫికేషన్ ఇచ్చారు.
⇒ చంద్రబాబు 12 ఏళ్ల కిందట చెప్పిన లెక్క ప్రకారం రాజధానిలో లక్ష ఎకరాల్లో సాధారణ మౌలిక వసతులకే రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేయాలి. భవిష్యత్తులో ఈ ప్రాజెక్టు పూర్తయ్యే సరికి రూ.2 లక్షల కోట్లు రూ.4 లక్షల కోట్లు అవుతుందో.. రూ.10 లక్షల కోట్లు అవుతుందో చెప్పలేము. ఇది ఎన్ని సంవత్సరాలు, ఎన్ని దశాబ్దాలు పడుతుందో తెలీదు.
⇒ విడిపోయిన రాష్ట్రానికి ఏడేళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఇప్పటి వరకు రాజధాని కోసం ఎంత ఖర్చు పెట్టారు? 2014–19 మధ్య కేవలం రూ.5,335 కోట్లు ఖర్చు చేశారు. ఇది కూడా అప్పుల ద్వారా తెచ్చిందే. ఈ రెండేళ్లలో ప్రస్తుతానికి చేసిన గ్రాస్ కమిటెడ్ (మొత్తం చేసిన, చేయడానికి నిర్ణయించిన) అప్పులు రూ.47 వేల కోట్లు. ఇందులో డ్రా చేసింది రూ.13 వేల కోట్లు. వీటిల్లో మొబిలైజేషన్ అడ్వాన్స్‌గా ఇచ్చింది రూ.5,500 కోట్లు. ఇక్కడ 10 శాతం అడ్వాన్సులుగా ఇవ్వడం.. అందులో 8 శాతం కమీషన్లు తీసుకోవడం.
⇒ సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ డిజైన్ల కోసం రూ.401 కోట్లు ఖర్చు పెట్టారు. కొండవీటి వాగు నుంచి వారధి వరకు ఫ్లైఓవర్ కోసం కిలోమీటరుకు రూ.170 కోట్లు పెడుతున్నారు. మా హయాంలో బెంజ్ సర్కిల్‌లో రెండో ఫ్లైవర్ పూర్తిగా నిర్మించాం. దీనికి కిలోమీటరకు రూ.35 కోట్లు ఖర్చు అయ్యింది. చంద్రబాబు ఏమైనా బంగారు బిస్కెట్లు పెట్టి కడుతున్నారా?
⇒ అమరావతిలో మిగిలిపోయిన ఆరు లేన్ల రోడ్లు వేయడానికి కిలోమీటర్‌కు రూ.53 కోట్లు వెచ్చిస్తున్నారు. అదే జాతీయ రహదారి నిర్మాణానికి టెండర్లు పిలిస్తే కిలోమీటరుకు రూ.20 కోట్లు సగటు ఖర్చు. ఈ దోపిడీని ప్రశ్నించకూడదు, అడగకూడదు. అడిగితే ఎదురుదాడి చేసి అమరావతికి వ్యతిరేకం అంటారు.
⇒ మా హయాంలో మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వలేదు. పని చేసి బిల్లు పెడితే డబ్బులిచ్చాం. చంద్రబాబు వచ్చిన తర్వాత దాన్ని మార్చి, మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకొచ్చారు. ముందే డబ్బులిచ్చి అందులో కమీషన్లు ఎత్తేస్తున్నారు. కేవలం రూ.2,500 కోట్లు మాత్రమే బిల్లుల కింద ఇచ్చారు. మరో రూ.960 కోట్లు దారి మళ్లించారు. ఏడేళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు అమరావతికి ఖర్చు చేసింది రూ.2,500 కోట్లు, రూ,5,335 కోట్లు. మొత్తంగా దాదాపు రూ.8 వేల కోట్లు మాత్రమే. కేవలం రోడ్లు, కరెంట్, నీళ్లు, డ్రెయినేజీ సౌకర్యాలకు రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సిన చోట ఇప్పటి వరకు కేవలం రూ.8 వేల కోట్లు ఖర్చు చేస్తే మిగిలింది ఎప్పటికి చేస్తారు?
⇒ అమరావతికి ఎవరూ వ్యతిరేకం కాదు. సాధ్యాసాధ్యాలను ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. లీడర్లుగా ఉంటూ స్కాముల కోసం.. సాధ్యం కాదని తెలిసి కూడా ప్రజలను మభ్యపెడుతూ పెడదోవ పట్టిస్తే రాష్ట్రానికి రాజధాని ఉండదు. మౌలిక వసతుల అభివృద్ధి కోసం రూ.2 లక్షల కోట్లు అవసరం అని తెలిసినా, అసాధ్యమని కళ్లముందే కనిపిస్తున్నా.. రైతులను, ప్రజలను మభ్య పెట్టాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. తాను ఉన్నన్ని రోజులు అప్పులు తెచ్చి, అమరావతి పేరు చెప్పి.. స్కాములు చేసి దోచేయాలనేది చంద్రబాబు ప్లాన్. ఈ దోపిడీ డైవర్షన్ కోసం అసెంబ్లీలో తీర్మానం పేరుతో డ్రామాలు చేశారు.
రాజధాని అమరావతి నిర్మాణాలకు అనూహ్యంగా రేట్లు పెంచడంపై ది హిందూ పత్రికలో ప్రచురించిన కథనాన్ని ప్రదర్శిస్తున్న వైఎస్ జగన్
2018లో ఇచ్చిన వాళ్లకే ఇప్పుడు మళ్లీ పనులు
⇒ రాజధాని నిర్మాణ పనులు 2018లో ఎవరైతే చేశారో.. 2024లో ఆ టెండర్లు రద్దు చేశారు. మళ్లీ ఆ పనులకు టెండర్లు నిర్వహించి.. అవే కంపెనీలకు ఆ పనులు దక్కేలా చేశారు. అమరావతి పనుల టెండర్లలో చంద్రబాబు గూడుపుఠాణి, మాఫియా వ్యవహారం స్పష్టంగా కనిపిస్తోంది. అనూహ్యంగా టెండర్లు రద్దు చేసి, మళ్లీ రేట్లు పెంచేస్తున్నారు. మరోవైపు టెండర్లను రిగ్ చేసి మళ్లీ పాత వాళ్లకే కట్టబెడుతున్నారు. ఇక్కడ కాంట్రాక్టర్‌కు ఇసుక ఫ్రీ, కరెంటు చార్జీల్లో రాయితీలు, జీఎస్టీ, సీనరేజీ, ఎన్‌ఏసీ మినహాయింపులు అన్నీ ఇస్తున్నా సరే చదరపు అడుగుకు ఏకంగా రూ.11 వేల నుంచి రూ.14 వేలు ఖర్చు చేస్తున్నారు. ఇది భయంకరమైన దోపిడీ కాదా?
⇒ కేపిటల్‌గా అమరావతి రియాల్టీ సంగతి పక్కన పెడితే.. దేశంలో అతిపెద్ద స్కాముకు చంద్రబాబు నిజంగా కేపిటల్‌గా మార్చేశారు. ఇక్కడ వ్యవస్థీకృతంగా (ఆర్గనైజ్డ్) అవినీతి సాగుతోంది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లో 5 స్టార్ సదుపాయాలతో కట్టిన రెసిడెన్షియల్ ప్లాట్స్ చదరపు అడుగుకు రూ.4,500 మించట్లేదు. ఇందులో ఇసుక ఉచితం లేదు.. ఎటువంటి రాయితీలు లేవు. కానీ, రాజధానిలో అన్ని రకాల రాయితీలు ఇచ్చి చదరపు అడుగు నిర్మాణానికి రూ.11 వేల నుంచి రూ.14 వేలు చెల్లిస్తున్నారు.
⇒ అమరావతిలో చంద్రబాబు సాగిస్తున్న దోపిడీకి వీరప్పన్ కూడా సరిపోడు. సచివాలయంలో టవర్–1, 2లకు బేస్‌మెంట్, గ్రౌండ్ ఫ్లోర్, 39 అంతస్తుల నిర్మాణానికి 2018లో ఖరారు చేసిన కాంట్రాక్టు విలువ రూ.932 కోట్లు. ఇప్పుడు అదే పని విలువ రూ.1,423 కోట్లకు పెంచేశారు. పైగా టెండర్‌లో పెంచిన రేటుకు 4.5 శాతం అధికంగా చెల్లిస్తున్నారు. కాంట్రాక్టర్‌కు నజరానా రూపంలో జీఎస్టీ, పన్నుల వంటి మినహాయింపుల ద్వారా రూ.257 కోట్లు లబ్ధి. మొత్తంగా రెండు టవర్ల నిర్మాణ వ్యయం రూ.1,762 కోట్లకు చేరింది. గతంలో కంటే ఏకంగా రూ.830 కోట్లు పెరిగింది. పైగా అçప్పటి కాంట్రాక్టర్ షాపూర్జీ పల్లంజీనే ఇప్పుడు పనులు చేసేది.
⇒ ఇక టవర్ 3, 4 పనులను 2018లో రూ.784 కోట్లతో కాంట్రాక్టు ఇచ్చారు. ఇప్పుడు దానిని రూ.1,247 కోట్లకు పెంచేశారు. దానిపై మళ్లీ 4.5 శాతం అదనంగా కాంట్రాక్టర్‌కు ఇస్తున్నారు. రాయితీలు మరో రూ.241 కోట్లు. మొత్తంగా చూస్తే రూ.1,545 కోట్లు ఖర్చు అవుతుంది. అప్పుడు కాంట్రాక్టర్ ఎల్‌అండ్‌టీ. ఇప్పుడూ వాళ్లే. ఈ పనులు అన్నింటికీ ఇసుక ఫ్రీ.
⇒ జీఏడీ టవర్ చూస్తే బేస్‌మెంట్, గ్రౌండ్‌ఫ్లోర్‌తో పాటు 49 అంతస్తుల నిర్మాణానికి 2018లో రూ.554 కోట్లు కాంట్రాక్టు ఇస్తే.. ఇప్పుడు దానిని రూ.844 కోట్లకు పెంచేశారు. ఆ పెంచిన టెండర్ల రేటుపై 4.53 శాతం అదనంగా చెల్లిస్తున్నారు. రాయితీల రూపంలో మరో రూ.163 కోట్లు లబ్ధి. మొత్తం రూ.1,046 కోట్లకు చేరింది. అప్పుడు కాంట్రాక్టర్ ఎన్‌సీసీ. ఇప్పుడూ వాళ్లే.
⇒ ఈ ఐదు టవర్లకు రాయితీలతో కలిపి రూ.4,354 కోట్లకు కాంట్రాక్టు ఇస్తే.. మళ్లీ దీనికి అదనంగా ఏసీలు, ప్లంబింగ్, ఎలక్ట్రికల్, లిఫ్టులు, ఫైర్ పనుల కోసం మరో రూ.2,316 కోట్లకు టెండర్లు పిలుస్తున్నారు. అన్నీ కలుపుకుంటే ఐదు టవర్లకు రూ.6,671 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ ప్రభుత్వ కాంప్లెక్స్‌లో మౌలిక వసతుల (డ్రెయినేజీ, సీవరేజీ ట్రీట్‌మెంట్ ప్లాంట్) కోసం రూ.1,053 కోట్లు చెల్లిస్తోంది. ఎక్కడైనా ప్లాట్లు కట్టే సమయంలో ఇవన్నీ అందిస్తేనే ప్రజలు అందులో చేరతారు. ఇక్కడ కాంట్రాక్ట్ విలువ కంటే వీటికి అదనంగా ఖర్చు చేస్తున్నారు.
⇒ దీని బిల్డప్ ఏరియా 52.20 లక్షల ఎస్‌ఎఫ్‌టీ. అంటే ఎస్‌ఎఫ్‌టీకి రూ.14,795 ఖర్చు చేసింది. ఇందులో అదనపు మౌలిక వసుతులు తీసేస్తే ఎస్‌ఎఫ్‌టీకి రూ.12,779 అవుతుంది. బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలో అన్నీ కలుపుకుని ఎస్‌ఎఫ్‌టీ రూ.4,500కు చేస్తుంటే ఇక్కడ రూ.వందల కోట్ల మినహాయింపులు, ఇసుక ఉచితంగా ఇచ్చినా నిర్మాణాలకు రూ.14 వేల కోట్లకుపైగా
అవుతుంటే ఆశ్చర్యం వేస్తోంది.
⇒ ఒకవైపు ఇంత డబ్బులు ఖర్చు చేసి టవర్లు కడుతున్నారు. మరోవైపు తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ పేరుతో రూ.1,100 కోట్లు వృథా చేశారు. అవి ఎందుకు కట్టారు? ఇప్పుడు ఆ డబ్బులన్నీ గంగలో పోసినట్టే కదా? తెలంగాణలో కేసీఆర్ ఉన్నప్పుడు 28 ఎకరాల్లో 10 లక్షల ఎస్‌ఎఫ్‌టీలో రూ.615 కోట్లతో సచివాలయం కట్టారు. దేశ రాజధాని ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి రూ.970 కోట్లు మాత్రమే అయ్యింది. అందులో 1,272 మంది కూర్చునేలా కట్టారు. పార్లమెంట్‌ను దేశం మొత్తం చూస్తోంది. ఆ స్థాయిలో వాళ్లు కడితే.. ఇప్పుడు కట్టే మన అసెంబ్లీ రూ.1,449 కోట్లు అవుతుంది. అంటే, పార్లమెంట్‌ను దాటేశాం.. కేసీఆర్ నంబర్‌కు డబుల్ చేసేశాం. ఇక హైకోర్టు కోసం మరో రూ.1,480 కోట్లు. ఐదు టవర్లు కాకుండా ఈ రెండూ అదనంగా కట్టేవి.


